ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత పార్టీ శ్రేణులు నైరాశ్యంలో మునిగిపోయారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో అయితే హస్తం కనిపించే పరిస్థితి లేనట్లు తెలుస్తోంది. ఇటీవల హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో 150 సీట్లలో ఒక్కసీటుతోనే సరిపెట్టుకుంది. అయితే వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఎలా ఎదుర్కొవాలో తెలియక పార్టీ ఆందోళనలో పడిపోయింది.
2021 ఏప్రిల్, మే నెలల్లో పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరిల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఇప్పటికే నామరూపాలు లేకుండా పోతున్న కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ రాష్ట్రాల్లోనైనా పాగ వేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఆ రాష్ట్రాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించి, ముందు చూపుతో బరిలోకి దిగితే మంచి ఫలితాలు సాధించవచ్చని, అన్ని బాగుంటే ఒకటి, రెండు రాష్ట్రాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సీనియర్ నేతలు.
కాగా, ఇక కేరళ విషయానికొస్తే అక్కడ సీపీఎం నాయకత్వంలోని ఎల్డీఎఫ్ అధికారంలో ఉంది. కేరళలో ఐదేళ్లకోసారి అధికార పార్టీని గద్దె దించే సంప్రదాయం ఉంది. యూడీఎఫ్ కూటమిలో కుమ్మలాటలున్నాయి. ముఖ్యమంత్రి పినరయి విజయ్‌పై అనేక ఆరోపణలున్నాయి. శబరిమల ఆలయానికి సంబంధించి వివాదంలో వామపక్ష ప్రభుత్వం అవలంబిస్తున్న విధానంపై ప్రజల్లో అసమ్మతి ఉంది. గత ఏడాది పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 20 కి కాంగ్రెస్ 16 స్థానాలను కైవసం చేసుకుంది. పార్టీ అగ్రనేత రాజీవ్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచే పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. ఈ పరిస్థితుల్లో సమన్వయంతో ముందుకు సాగితే కేరళ అధికారాన్ని చేజిక్కించుకోవచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ, సీఎల్పీ నాయకుడు రమేష్ చెన్నితాల, పీసీసీ చీఫ్ ముళ్లపల్లి రామచంద్రన్ కలిసికట్టుగా పని చేస్తున్నారు. 2016 నాటికి ఎన్నికల్లో సీపీఎంకు 58, సీపీఐకి 19 దక్కాయి. కాంగ్రెస్ పార్టీకి 22, దాని మిత్రపక్షం ఐయూఎల్ 18 సీట్ల చొప్పున దక్కాయి.
తమిళనాడు, పుదుచ్చేరిలో..
ఇక తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ డీఎంకే కూటమిలో ఉండటం కలిసొచ్చే అశం. స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే గత ఎన్నికల్లో మొత్తం 236 సీట్లకు 89 సాధించి గెలుపు కేరటాలకు చేరువైంది. గత ఏడాది పార్లమెంట్ మొత్తం 38కి గాను డీఎంకే కూటమి 37 సీట్లు సాధించి సత్తా చాటింది. కూటమిలోని కాంగ్రెస్ పార్టీ 8 గెలుచుకుంది. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమన్న ధీమా వ్యక్తం అవుతోంది. పక్కనే ఉన్న పుదుచ్చేరిలో వి. నారాయణ స్వామి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది.
గత ఏడాది ఇక్కడి ఏకైక పార్లమెంట్ సీటును కాంగ్రెస్ సీటును కాంగ్రెస్ గెలుచుకుంది. 32 స్థానాలు గల రాష్ట్రంలో డీఎంకే మద్దతుతో కాంగ్రెస్ పార్టీ మళ్లీ సత్తా చాటే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్‌లో సీపీఎంతో పొత్తు పెట్టుకోవడం ద్వారా అధికారంలోకి రాకపోయినా.. కనీసం కాంగ్రెస్ పార్టీకి మెరుగైన సీట్లు రావచ్చన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఇక కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉన్న మరో రాష్ట్రం అసోం. 126 స్థానాలు గల ఈశాన్యం రాష్ట్రంలో 2016లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ గెలిచింది. బీజేపీ 60కిపైగా స్థానాలు సాధించగా, దాని మిత్రపక్షం అసోం గణపరిషత్ 14, బోడో పీపుల్స్ ఫ్రంట్ 12 సీట్లు సాధించాయి. హస్తం పార్టీ పాతిక సీట్లకే పరిమితమైంది. దీంతో ముందస్తు ప్రణాళికలతో గట్టిగా పోరాడితే విజయం తమదేనన్న ధీమాను పీసీసీ చీఫ్ రిపున్ బోరాలో వ్యక్తం అవుతోంది. గత ఏడాది పార్లమెంట్ ఎన్నికల్లో మొత్తం 14 సీట్లకు బీజేపీ 9, కాంగ్రెస్ 3 స్థానాలు దక్కించుకున్నాయి. మరి ఆ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ముందస్తు ప్రణాళికలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి.