
బెంగళూరుతో సహా కర్నాటకవ్యాప్తంగా బైక్ ట్యాక్సీ సేవలు నిలిచిపోయాయి. ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో ర్యాపిడో, ఉబర్, ఓలా సంస్థలు తమ సేవలను నిలిపివేశాయి. హైకోర్టు ఆదేశానుసారం తమ సేవలను నిలిపివేస్తున్నట్లు ర్యాపిడో పేర్కొంది. సేవలను పునరుద్ధరించేందుకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని తెలిపింది. బైక్ ట్యాక్సీ సేవలను ఉబర్, మోటో కొరియర్ కింద మార్చగా.. ఓలా తన యాప్‌లో బైక్ ట్యాక్సీ అనే ఆప్షన్‌ను పూర్తిగా తొలగించింది. మోటార్ వెహికల్ చట్టంలో బైక్ ట్యాక్సీల ప్రస్తావన లేదు. దీంతో బైక్ ట్యాక్సీ సేవలను నిలిపివేయాలని కర్నాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ సమర్థించింది. ఇక జూన్ 20లోగా దీనిపై స్పందన తెలియజేయాలని కర్నాటక ప్రభుత్వాన్ని అక్కడి హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 24కు వాయిదా వేసింది.
బైక్ ట్యాక్సీ సేవలకు కోర్టు సడెన్ బ్రేకులు వేయడంతో…లక్షా ఇరవై వేల మంది బైక్ ట్యాక్సీ రైడర్లు రోడ్డున పడ్డారు. వాళ్లు ఉపాధిని కోల్పోయారు. కమర్షియల్ ప్లేట్ లేకుండా బైక్‌లు నడపడం పైనే ప్రధానంగా అభ్యంతరాలు వచ్చాయి. కోర్టు ఆదేశాలతో బైక్ ట్యాక్సీలను పోలీసులు ఆపేశారు. దీనిపై ఆటోలు, క్యాబ్ డ్రైవర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే లక్షలాదిమంది ఉపాధి పోతోందని బైకర్లు వాపోతున్నారు. విద్యార్థులు, పార్ట్‌టైమ్ చేసుకునేవాళ్ల ఆదాయానికి గండి పడింది. ఇక ఆటోలు, క్యాబ్‌ల కిరాయిలు భరించలేని పేద, మధ్యతరగతి జనానికి బైక్ ట్యాక్సీలు అందుబాటు ధరల్లో రవాణా సౌకర్యం కల్పిస్తున్నాయి. దీంతో ఆయా వర్గాల ప్రజల నెత్తిన పిడుగు పడినట్లయింది. దీంతో గిగ్ వర్కర్లు ఉపాధిని కోల్పోకుండా చూడాలని సీఎం సిద్దరామయ్య, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి నమ్మ బైక్ ట్యాక్సీ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.
ఇదే నేపథ్యంలో బెంగళూరు జయానగర్ బాటా షోరూమ్ దగ్గర ఓ ర్యాపిడో డ్రైవర్, మహిళా ప్రయాణికురాలి మధ్య ఘర్షణ జరిగింది. బైక్ రైడర్‌ని రెండుసార్లు కొట్టింది ఆ మహిళ. దీంతో ఆ మహిళను చెంపపై కొట్టాడు ర్యాపిడో డ్రైవర్. ఈ సంఘటన తర్వాత బైక్ ట్యాక్సీ ప్రయాణికుల భద్రతపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్‌లో లక్షా పదివేలకు పైగా బైక్ ట్యాక్సీలు నడుస్తున్నాయి. లక్షమందికి పైగా దీని ద్వారా ఉపాధి పొందుతున్నారు. ఇక డైలీ లక్షలాదిమంది పేద, మధ్యతరగతి ప్రజలు బైక్ ట్యాక్సీలనే నమ్ముకుని ప్రయాణాలు సాగిస్తున్నారు. ఇప్పుడు కర్నాటక ప్రభావంతో మిగిలిన మెట్రో సిటీల్లో కూడా బైక్ ట్యాక్సీ రైడర్లకు, వాటి మీద ఆధారపడ్డ జనానికి దడ మొదలైంది. ఇది చివరకు ఎటు దారితీస్తుందో చూడాలి.