Covid-19 4th Wave: దేశంలో కరోనా ఫోర్త్ వేవ్‌ అలజడి.. అప్రమత్తమైన రాష్ట్రాలు.. నిపుణులు ఏమంటున్నారంటే..?

|

Mar 23, 2022 | 9:59 PM

Coronavirus 4th Wave in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పూర్తిగా ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి కరోనా నిబంధనలు

Covid-19 4th Wave: దేశంలో కరోనా ఫోర్త్ వేవ్‌ అలజడి.. అప్రమత్తమైన రాష్ట్రాలు.. నిపుణులు ఏమంటున్నారంటే..?
Coronavirus
Follow us on

Coronavirus 4th Wave in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో కోవిడ్ నిబంధనలు పూర్తిగా ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి కరోనా నిబంధనలు ఎత్తివేయున్నట్లు హోంశాఖ ప్రకటించింది. అయితే.. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అంటూ వెల్లడించింది. అయితే.. తాజాగా.. దేశంలో 1,778 కేసులు మాత్రమే నమోదయ్యాయి. అయితే, ప్రపంచవ్యాప్తంగా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ (Omicron) ఉప-వేరియంట్ BA.2 యూరప్, చైనాలో విజృంభిస్తోంది. దీంతోపాటు బ్రిటన్ (95,098 కేసులు), ఫ్రాన్స్ (19,134), జర్మనీ (92,316), ఇటలీ (33,445) వంటి దేశాల్లో గత కొన్ని వారాలుగా కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. చైనాలో ప్రస్తుతం ఈ సంఖ్య 4,770కి చేరుకుంది. ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో ఈ సంఖ్యలు పెరుగుతున్నందున భారత్‌లో ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశం ఉందని.. దీనికోసం ఇప్పటినుంచే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కొందరు నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో.. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో హెచ్చరికను జారీ చేసింది. ప్రజలు బయటికి వెళ్లేటప్పుడు COVID-19 ప్రోటోకాల్‌ను తప్పనిసరిగా అనుసరించాలని పేర్కొంది. మూడో వేవ్ లో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిన నేపథ్యంలో ఈ సూచనలు చేసింది. దీంతోపాటు ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయా రాష్ట్రాల అధికారులు తెలిపారు.

దేశంలో BA.2 వేరియంట్‌ను ఎదుర్కొనేందుకు మహారాష్ట్ర చర్యలు..

ఈ విషయంపై మహారాష్ట్రలోని కోవిడ్-టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ సుశాంత్ జోషి మాట్లాడుతూ.. ఫోర్త్ వేవ్ ఎదుర్కొనే సన్నద్ధతలో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 600 పీడియాట్రిక్ కోవిడ్ బెడ్‌ల సంఖ్యను దాదాపు 2,300కి పెంచాలని యోచిస్తోందని పేర్కొన్నారు. పిల్లలకు చికిత్స అందించేందుకు గ్రేడెడ్ హెల్త్‌కేర్ సదుపాయాన్ని రూపొందించాలని సలహా ఇచ్చినట్లు పేర్కొన్నారు. ముంబైలో పిల్లల కోసం ప్రత్యేకంగా 500 పడకలను పక్కన పెట్టాలని BMC యోచిస్తోంది. పీడియాట్రిక్ కోవిడ్ బెడ్‌లను ఏర్పాటు చేయడంతో పాటు.. పిల్లలలో ఎమర్జెన్సీ కేసులను గుర్తించేందుకు వైద్యులకు శిక్షణ ఇస్తున్నారు. జ్వరంతో సహా అనుమానిత కోవిడ్ లక్షణాలు ఉన్న వ్యక్తులకు చికిత్స అందించేందుకు శిక్షణ ఇస్తున్నారు. అయితే.. ఈ వేవ్ లో చికిత్స అందించేందుకు పూర్తిగా సంసిద్ధంగా ఉన్నామని డాక్టర్ జోషి పేర్కొన్నారు.

జోషి చెప్పిన దాని ప్రకారం.. కోవిడ్-19 ఇన్ఫెక్షన్ వ్యాప్తిని అరికట్టడానికి నాగ్‌పూర్‌లోని ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) సిద్ధంగా ఉంది. ఆసుపత్రి వద్ద కరోనా కార్నర్, థర్మల్ స్కానర్లు, హ్యాండ్ శానిటైజర్ సౌకర్యం, సూచిక బోర్డులు, పోస్టర్లు, ఆడియో ప్రకటనలు ఉన్నాయన్నారు. 100 పడకల ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో ఆరు పడకల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) మల్టీ-పారా మానిటర్లు, ఇన్ఫ్యూషన్ పంపులు, ఫౌలర్ బెడ్‌లు, ఇంట్యూబేషన్ కిట్లు, డీఫిబ్రిలేటర్లు, ECG మెషీన్‌లు, వెంటిలేటర్‌లు ఉంటాయి. న్యూఢిల్లీలోని AIIMS ఇచ్చిన మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్ ప్రకారం చికిత్స అందిస్తామని జోషి చెప్పారు. RTPCR పరీక్షలో సహాయం కోసం IGGMC వద్ద నలుగురు సభ్యులను కూడా నియమిచామన్నారు. దీంతోపాటు మరో 500 మంది సభ్యులను కూడా నియమించి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

గుజరాత్

గుజరాత్‌ కోవిడ్ టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ అమీ పారిఖ్.. ఈ విషయంపై మాట్లాడుతూ ఫోర్త్ వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రస్తుతం మరొక COVID-19 వేవ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. భారత్‌లో ఫోర్త్ వేవ్ వస్తుందా..? రాదా.? అనే విషయాలతో సంబంధం లేకుండా తాము సన్నద్ధంగా ఉన్నామన్నారు. ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు, బెడ్‌ల సదుపాయం పెంచామన్నారు. అయితే.. ఈ వేవ్ ఎక్కువగా ప్రభావం చూపదని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. COVID-19 చికిత్స కోసం 97,000 పడకలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని, ఇందులో 70,000 ఆక్సిజన్ బెడ్‌లు, 15,000 క్రిటికల్ బెడ్‌లు, 8,000 వెంటిలేటర్ బెడ్‌లు ఉన్నాయి. వీటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అయితే.. తమ వద్ద నర్సుల కొరత ఉందని డాక్టర్ పారిఖ్ తెలిపారు. ఆసుపత్రిలోని సిబ్బంది అవసరాలకు అనుగుణంగా నర్సులను నియమిస్తామని ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.

ఢిల్లీ

Omicron BA.2 సబ్-వేరియంట్ ముప్పును ఎదుర్కొనేందుకు ఢిల్లీ పూర్తిగా సిద్ధంగా ఉందని ఢిల్లీలోని AIIMS COVID-19 టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ యష్ గార్గ్ News9తో పేర్కొన్నారు. ఓమిక్రాన్ లేదా డెల్టా సమయంలో ఏర్పడిన పరిస్థితి తలెత్తితే.. తాము ప్రతిరోజూ లక్షకు పైగా కోవిడ్ కేసులను నిర్వహించగలమంటూ గార్గ్ చెప్పారు. ఢిల్లీలోని ఎయిమ్స్‌ సిద్ధంగా ఉందని తెలిపారు. బెడ్లు, ఆక్సిజన్‌, సౌకర్యాలు అన్ని సిద్ధంగా ఉన్నాయన్నారు. తేలికపాటి లక్షణాలు ఉన్న రోగులు ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండాలని.. ఆసుపత్రులకు వెళ్లవద్దంటూ సూచించారు. ఫోన్ చేస్తే.. ఆరోగ్య కార్యకర్తలు వారి ఇళ్లను సందర్శించి సలహాలు సూచనలు ఇస్తారన్నారు.

నోయిడా

నోయిడాలోని గౌతమ్ బుద్‌నగర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ శర్మ మాట్లాడుతూ.. కోవిడ్ కేసులను ఎదుర్కొ్నేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. వైద్య నిపుణులు, పోలీసు సిబ్బంది వంటి ఫ్రంట్‌లైన్ కార్మికుల కోసం ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నోయిడాలో మొదటిసారిగా మార్చి 19, 2022న ఒకే ఒక్క కోవిడ్ కేసు ఉందని తెలిపారు. నోయిడా, ఢిల్లీ, ఘజియాబాద్, గురుగ్రామ్, మీరట్ వంటి నగరాలన్నీ అనుసంధానంతో ఉంటయి కావున కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

కర్ణాటక

బెంగుళూరులోని కోవిడ్ టాస్క్ కమిటీ కోఆర్డినేటర్ డాక్టర్ కిరణ్ ప్రతిభ మాట్లాడుతూ.. రాబోయే వేవ్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఆరు జెనోమిక్ సీక్వెన్సింగ్ లేబొరేటరీలను ఏర్పాటు చేయాల్సి ఉందని తెలిపారు. కర్ణాటక వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రుల్లో 262 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని.. 190 పనిచేస్తున్నాయని తెలిపారు. ఔషధాలు, బెడ్లు ఇతర సౌకర్యాలన్నీ అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

తమిళనాడు

తమిళనాడు కోవిడ్ టాస్క్‌ఫోర్స్ సమన్వయకర్త డాక్టర్ గుహానందం మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోవిడ్-19 రోగులకు చికిత్స చేసేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో 1.5 లక్షల పడకలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ కేర్ సెంటర్లలో 50,000 కొత్త పడకలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. రాష్ట్రంలో 222 ఆక్సిజన్‌ ప్లాంట్‌లు, బెడ్‌లు పూర్తిగా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

రాజస్థాన్

వివిధ వైద్య సంస్థల్లో 50,000 జనరల్, 28,000 ఆక్సిజన్ ప్లాంట్లు, 6,000 ICU పడకలు అందుబాటులో ఉన్నాయని రాజస్థాన్ కోవిడ్ టాస్క్ ఫోర్స్ అధికారి ధ్రువ్ బిష్ణోయ్ తెలిపారు. ఔషధాలు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

Also Read:

Alzheimer Disease: ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే అల్జీమర్స్ బారిన పడే అవకాశం.. ఎందుకో తెలుసుకోండి

Neem Leaves: చేదుగా ఉన్నాయని తీసిపారేయకండి.. వేప ఆకులతో బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు.. తెలిస్తే షాకవ్వాల్సిందే..