Lockdown: కరోనా మహమ్మారి మళ్లీ తీవ్ర స్థాయిలో వ్యాప్తి చెందుతోంది. ఇక మహారాష్ట్రలో అయితే కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, బీఎంసీ అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోగుల కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో వైరస్‌ను అదుపులోకి తీసుకువచ్చేందుకు మరోసారి లాక్‌డౌన్ విధించాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం కూడా లాక్‌డౌన్ దిశగా ఆలోచన చేస్తోందని వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో జనాలు కలవరపడుతున్నారు. అయితే లాక్‌డౌన్ అంశంపై మళ్లీ తెరమీదకు రావడంతో ముఖ్యంగా ధనవంతుల ఇళ్లల్లో పని చేసుకుంటూ జీవనం వెళ్లదీసే నిరుపేద మహిళలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
గత సంవత్సరం అమలు చేసిన లాక్‌డౌన్ వల్ల వారు ఇప్పటికే తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురైంది. ఉన్న ఉపాధి కోల్పోయి చేతిలో చిల్లిగవ్వ లేక పస్తులుండాల్సిన దుస్థితి వచ్చింది. తర్వాత పరిస్థితులు అదుపులోకి రావడంతో గత ఆరు నెలలుగా వారికి ఏదో ఒక ఉపాధి లభించింది. దీంతో వారి కుటుంబాలకు కొంత ఆధారం లభించినట్లు అయింది. ఇప్పుడు మళ్లీ లాక్‌డౌన్ అనే వార్తలు వినిపిస్తుండటంతో వారు ఆందోళనలో పడిపోతున్నారు. మళ్లీ లాక్‌డౌన్ విధిస్తే పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయని వారు మదనపడిపోతున్నారు. కుటుంబాల పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.
కాగా, ముంబై, థానే, నవీ ముంబై పరిసర ప్రాంతాల్లో ఇళ్లల్లో పని చేసే మహిళా కార్మికులు దాదాపు 35 లక్షల మంది ఉన్నట్లు సమాచారం. వీరిలో కొంత మంది ఇటుక బట్టీలలో పనులు చేసుకుంటూ జీవనం గడుపుతుండగా, మరి కొంత మంది కూలీ పనులు చేసుకుంటున్నారు. కానీ అధిక శాతం మంది ధనవంతుల ఇళ్లల్లో ఇంటి పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. గత కొన్ని రోజులుగా ముంబైలో కరోనా కేసులు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించేందుకు నిర్ణయం తీసుకుంది. గత ఏడాది పరిస్థితులు పునరావృతం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే కొద్దిపాటి వేతనంతో కుటుంబాన్ని గడుపుతున్న మహిళలు అధిక శాతం ఉన్నారు. వీరికి సొంతిళ్లు సైతం లేకపోవడంతో అద్దె ఇళ్లల్లోనే ఉంటున్నారు. మళ్లీ లాక్‌డౌన్ విధిస్తే ఉపాధి కోల్పోయే పరిస్థితి ఎదురై ఇంటి అద్దె కూడా చెల్లించని పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. గతంలో విధించిన లాక్‌డౌన్ ఇప్పటికే పిల్లల చదువు, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపింది. చాలామందికి ఉపాధి పోయింది. ఇప్పుడిప్పుడే ఉపాధి పొందుతున్న వారికి తాజా లాక్‌డౌన్ వార్తలతో ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చదవండి: India Corona Cases Updates: భారత్‌లో మరింత విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. భారీగా పెరిగిన మరణాల సంఖ్య..
Vaccines export: అది ప్రచారం మాత్రమే.. టీకాల ఎగుమతిపై ఎలాంటి నిషేధం లేదు.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం