
దగ్గు మందు తాగి 14 మంది పిల్లలు మృతి. ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని అస్సలు ఊహించలేదు. ఎందుకంటే.. ఇండియా అంటేనే ‘ప్రపంచ ఫార్మసీ హబ్’. దాదాపు 200 దేశాలకు మన దగ్గరి నుంచి మెడిసిన్స్ సప్లై అవుతుంటాయి. ఇండియాలో తయారైన మెడిసినే కావాలి అని అడిగి మరీ దిగుమతి చేసుకుంటాయి కొన్ని దేశాలు. పాకిస్తాన్‌కి చైనా అంటే ఎంత ప్రేమ ఉన్నా.. ఇండియన్ బ్రాండ్ మెడిసిన్స్‌నే ఎక్కువగా వాడుతుంటారు. అంత నమ్మకం మన మెడిసిన్స్ మీద. వాళ్ల నమ్మకానికి తగ్గట్టే క్వాలిటీ మెడిసిన్స్ తయారవుతుంటాయి మన దగ్గర. అలాంటిది.. కొన్నేళ్లుగా నకిలీ ఔషధాల తయారీ విచ్చలవిడిగా పెరిగిపోయింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లో దగ్గు మందు కారణంగా ఇప్పటికి చనిపోయింది 14 మందే కావొచ్చు. కాని, 1972 నుంచి ఇలాంటి ఘటనలు చాలాసార్లు జరిగాయి. మొత్తంగా 70 మందికి పైగా చనిపోయారని రికార్డ్స్ చెబుతున్నాయి. 2019-20 మధ్య జమ్మూ కశ్మీర్‌లో 12 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. దానికి కారణం కూడా దగ్గు మందే. అయినా సరే.. కంపెనీల తీరు మారలేదు. అధికారులూ పట్టించుకోలేదు. దగ్గు మందు మరణాలు గాంబియా, ఉజ్బెకిస్తాన్‌లో కూడా జరిగాయి. గాంబియాలో 66 మంది పిల్లలు, ఉజ్బెకిస్తాన్‌లో 18 మంది పిల్లలు దగ్గు మందు తాగిన తరువాతే చనిపోయారు. దారుణం ఏంటంటే.. అక్కడ మరణాలకు కారణం కూడా భారత ఫార్మా కంపెనీలు తయారుచేసి పంపించిన దగ్గు మందే అనేది ఓ ఆరోపణ....