దేశంలో మళ్ళీ కరోనా కోరలు చాస్తోంది. కరోనా బాధితుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సుమారు 7 నెలల క్రితం కోవిడ్-19కి సంబంధించిన ప్రజారోగ్య సలహాను ఉపసంహరించుకుంది. అయితే JN.1 కరోనా వైరస్ క్రమంగా పెరుగుతూ మరోసారి ప్రపంచ దేశాలకు కరోనా మార్గదర్శకాలను అనుసరించాల్సిన ఆవశ్యకతను తెలియజేసింది. మన దేశంలో కేరళలో మళ్ళీ కొత్త వైరస్ కేసులు వెలుగులోకి రాగా గత 9 రోజుల్లో కరోనా కేసులు రెట్టింపు అయ్యాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
కేరళ తర్వాత ఇప్పుడు ఈ కొత్త వేరియంట్ మహారాష్ట్ర, గోవా సహా తెలుగు రాష్ట్రాల్లో కూడా వ్యాపిస్తూ భయాందోళనలు కలిగిస్తున్నాయి. కరోనా కొత్త వేరియంట్ మహారాష్ట్రలో ఒక కేసు, గోవాలో 18 కేసులు వెలుగులోకి వచ్చాయి. అంతేకాదు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో కూడా కొత్త కేసుల రాకతో.. దేశవ్యాప్తంగా కరోనా సోకిన రోగుల సంఖ్య 2 వేలకు చేరుకుంది. డిసెంబర్ 11న 938 కరోనా కేసులు నమోదయ్యాయి.
గత 24 గంటల్లో దేశంలో 640 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు మృతి చెందారు. కొత్త కేసుల నమోదుతో మొత్తం సోకిన రోగుల సంఖ్య 2997 కు పెరిగింది. కేరళలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో కేరళలో 265 కరోనా కేసులు కనుగొనగా, మొత్తం సోకిన వారి సంఖ్య ఇప్పుడు 2606 కి చేరుకుంది. కేరళలో కేసులు పెరుగుతున్న తీరుతో కరోనా సెకండ్ వేవ్ కు సంబంధించిన జ్ఞాపకాలు తెరపైకి వస్తున్నాయి. అయితే దీని గురించి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని ఆరోగ్య మంత్రిత్వ శాఖ, WHO చెబుతున్నప్పటికీ.. అనేక ప్రశ్నలు ప్రజల మదిలో కూడా తలెత్తుతున్నాయి.
వాతావరణంలో వచ్చిన మార్పులతో ప్రస్తుతం ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. కరోనా భయం నెలకొన్న నేపథ్యంలో ప్రజలు తమకు కూడా కరోనా సోకిందని భయపడుతున్నారు. వాతావరణంలో మార్పులతో ఇన్‌ఫ్లుఎంజా ఎ, అడెనోవైరస్, రైనోవైరస్, రెస్పిరేటరీ సిన్సిటియల్ వైరస్‌ల బారిన పడే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌ఓ మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. ఈ వైరస్ లక్షణాలు కోవిడ్-19 లక్షణాలను పోలి ఉంటాయి. అయితే ప్రతి ఒక్కరూ కరోనా పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం లేదు. జలుబు, జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్న వారికి ఈ పరీక్ష తప్పనిసరి అని తెలిపారు. ఇప్పటికే శ్వాసకోశ వ్యాధి లేదా న్యుమోనియా ఉన్నవారికి పరీక్ష అవసరమని పేర్కొన్నారు.
ప్రపంచ దేశాలలో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాదు కరోనా మార్గదర్శకాలను అనుసరించాలని ప్రభుత్వాలను కోరింది. కరోనా గ్రాఫ్‌ను పరిశీలిస్తే రద్దీగా ఉండే ప్రదేశాలలో మాస్క్ ధరించడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగిపోయాయని, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
అయితే ప్రస్తుతం ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాల్సిన అవసరం లేదని వృద్ధులు, గర్భిణులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్‌లు ధరించాలి. అంతేకాదు దగ్గు లేదా జలుబు ఉన్నవారు ఇతరులకు సోకకుండా మాస్క్‌లు ధరించాలని సూచించింది.
కరోనాను నియంత్రించడంలో వ్యాక్సిన్ ఎంతగానో దోహదపడింది. కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో, చాలా మంది రెండు డోసులను తీసుకున్నారు. అయితే చాలా మంది కరోనా బూస్టర్ డోస్ ను తీసుకున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం అటువంటి పరిస్థితిలో టీకా ప్రభావం కాలక్రమేణా తగ్గుతుంది. దీంతో మరోసారి ప్రజలు కరోనా బారిన పడుతున్నారు. దీంతో WHO కూడా JN.1 వేరియంట్‌ను ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా ప్రకటించింది. ఇది ప్రపంచ దేశాలలో వేగంగా వ్యాపిస్తోందని పేర్కొంది.
దేశంలోని చాలా ప్రాంతాల్లో కరోనా పట్ల ప్రజలు ఇప్పటికీ నిర్లక్ష్యంగా ఉన్నారు. గతంలో కరోనా వేరియంట్‌లను పరిశీలిస్తే ప్రతిసారీ కేసులు పెరిగినా తక్కువ పరీక్షలు జరిగాయి. ఈసారి, అమెరికా, చైనా ,సింగపూర్‌లో కరోనా JN.1 వేరియంట్ పెరుగుతున్న తీరును చూసిన తర్వాత WHO తీవ్రంగా స్పందించింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం మనం కరోనా బాధితులకు సంబంధించిన ఖచ్చితమైన గణాంకాలను తెలుసుకోవాలంటే అప్పుడు వ్యర్థ జలాల పరీక్ష చేయవలసి ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం చాలా దేశాల్లో వ్యర్థ జలాల నమూనాలను పరీక్షించడం ద్వారా.. ఏ విధంగా ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతుందో కనుగొనవచ్చని వెల్లడించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..