భర్తతో గొడవపడి కాలువలోకి దూకిన మహిళ..! ఆమెను రక్షించబోయిన కానిస్టేబుల్‌..

ఘజియాబాద్‌లోని హిండన్ కాలువలో ఆత్మహత్యాయత్నం చేస్తున్న మహిళను కాపాడేందుకు 20 ఏళ్ల కానిస్టేబుల్ అంకిత్ తోమర్ నీటిలో దూకాడు. అతను బురదలో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయాడు. మహిళను కాపాడినప్పటికీ, కానిస్టేబుల్ ధైర్యం విషాదాంతమైంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో విషాదాన్ని నింపింది.

భర్తతో గొడవపడి కాలువలోకి దూకిన మహిళ..! ఆమెను రక్షించబోయిన కానిస్టేబుల్‌..
Representative Image

Updated on: May 18, 2025 | 11:01 AM

పోలీస్‌ అంటేనే ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడే వాడు. అలాంటి పోలీస్‌ తన పని కాకపోయినా.. ఓ మహిళ ప్రాణాలు రక్షించేందుకు నీటిలోకి దూకి.. ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. ఇరవై ఏళ్ల వయసున్న అంకిత్ తోమర్ అనే టాఫిక్‌ కానిస్టేబుల్‌ను హిండన్ కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకోబోయిన మహిళ రక్షించేందుకు కాలువలోకి దూకాడు. కానీ, దురదృష్టవశాత్తు బురదనీటిలో చిక్కుకొని మరణించాడు.

స్థానికులు అతన్ని బురద నుంచి బయటికి తీసి సమీపంలోని ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం ఉదయం వైశాలి సెక్టార్ 2లో నివసిస్తున్న ఆర్తి (23) తన భర్త ఆదిత్యతో గొడవ పడి, హిండన్ కాలువలోకి దూకింది. అక్కడే ట్రాఫిక్‌ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్‌ఐ ధర్మేంద్ర, కానిస్టేబుల్ అంకిత్ తోమర్ వెంటనే ఆర్తిని రక్షించడానికి కాలువలోకి దూకారు. ఆరతిని రక్షించడానికి స్థానికులు కూడా సహాయ చర్యలో పాల్గొన్నారు.

ఆర్తిని సురక్షితంగా బయటికి లాగగా, ఎస్‌ఐ, కానిస్టేబుల్ తోమర్ కాలువ బురదలో చిక్కుకున్నారు. ఎస్ఐ ధర్మేంద్ర ఎలాగోలా అదృష్టవశాత్తు ఆ బురద నుంచి బయటపడ్డారు. కానీ. పాపం తోమర్‌ మాత్రం అందులోనే చిక్కుకుపోయాడు. చివరికి స్థానికులు ఎంతో కష్టపడి అతన్ని బయటికి తీశారు. అప్పటికే తోమర్‌ ఊపిరాడక మృతిచెందాడు. ఓ మహిళను రక్షించబోయి.. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ అందులోనా 20 ఏళ్ల కుర్రాడు ప్రాణాలు వదలడంతో అక్కడున్న వారు కన్నీళ్లు పెట్టుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..