Global Hunger Index: శ్రీలంక, పాకిస్తాన్‌, నేపాల్‌తో కంటే దారుణ స్థితిలో భారత్.. మన దేశాన్ని తక్కువ చేయాలని..?

|

Oct 16, 2022 | 5:21 PM

తాజాగా విడుదల చేసిన గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో ఇండియా ర్యాంక్‌ 107వ స్థానానికి పడిపోయింది. విచిత్రమైన విషయమేంటంటే పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ ఈ ర్యాంకులో ఇండియా కంటే మెరుగైన స్థానంలో నిలిచాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో తల్లడిల్లుతున్న శ్రీలంక కూడా ఇండియా కంటే ముందు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.

Global Hunger Index: శ్రీలంక, పాకిస్తాన్‌, నేపాల్‌తో కంటే దారుణ స్థితిలో భారత్.. మన దేశాన్ని తక్కువ చేయాలని..?
Global Hunger Index 2022
Follow us on

రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం విషయంలో ఇండియా తీసుకున్న స్టాండ్‌ పాశ్చాత్య దేశాలకు మింగుడుపడటం లేదా? అంతర్జాతీయ వేదికలపై ఇండియాను తప్పుగా, తక్కువగా చూపే ప్రయత్నం జరుగుతోందా? అంతర్జాతీయ ఆకలి సూచికలో ఇండియా ర్యాంక్‌ దిగజారిపోవడం వెనుక తప్పుడు సమాచారం ఉందా? శ్రీలంక, పాకిస్తాన్‌, నేపాల్‌తో పోల్చితే భారత్‌లో తీవ్రమైన పరిస్థితులు ఉన్నాయా? గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ ర్యాంకింగ్స్‌ విషయంలో ఇండియా స్పందించింది. మదింపు ప్రక్రియలో తీవ్ర తప్పిదాలున్నాయని ఇండియా ప్రకటించింది.  2021లో 116 దేశాలకు సంబంధించి గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో ఇండియా 101వ స్థానంలో ఉండేది. ఇప్పుడు ఈ జాబితాలో 121 దేశాలు చేరాయి. భారత్‌ స్థానం మరింత దిగజారి 107వ స్థానానికి పడిపోయిందని నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక భారత్‌కు 29.1 స్కోర్‌ ఇచ్చింది. అంతే కాదు భారత్‌లో ఆకలి కేకలు తీవ్రస్థాయిలో ఉన్నాయని విశ్లేషించింది. అంతే ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో భారత్‌లో పిల్లల ఎదుగుదల లోపాలు అత్యధికంగా ఉన్నాయని ఈ నివేదిక తెలిపింది.

ప్రజలకు కావాల్సిన ఆహారం, అవసరమైన పోషకాలు అందించడంలో ఇండియాను తక్కువ చేసి చూపే ప్రయత్నం జరుగుతోందని భారత్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏటా విడుదల చేసే గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో తప్పుడు సమాచారమన్నది హాల్‌మార్క్‌గా నిలుస్తోందని ఇండియా విమర్శించింది. ఇందులోని నాలుగు సూచికల్లో మూడు పిల్లల ఆరోగ్యానికి సంబంధించినవి, వాటిని మొత్తం జనాభాకు ఎలా అన్వయిస్తారని భారత్‌ ప్రశ్నించింది. అలాగే పోషకాలకు సంబంధించి 3వేల మందితో తీసుకున్న శాంపిల్‌ను మొత్తం జనాభాకు ఎలా అంటగడతారని నిలదీసింది. గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన సూచికల్లో శాస్త్రీయతే కాదు హేతుబద్ధత కూడా లోపించిందని ఇండియా స్పష్టం చేసింది. ఇండియాలోని వాస్తవ పరిస్థితులను ఈ నివేదిక ఏ మాత్రం ప్రతిబింబించడం లేదని తెలిపింది. అంతే కాదు ఈ అంచనాలను ఉపయోగించకూడదని ఐక్యరాజ్యసమితికి చెందిన FAOను ఇండియా కోరింది. ప్రపంచంలోనే అతి పెద్ద ఆహార భద్రత పథకాన్ని తాము అమలు చేస్తున్నామనే విషయాన్ని భారత్‌ వివరించింది. ఆహార సబ్సిడీ కింద ఏడాది డిసెంబర్ వరకు 3.91 లక్షల కోట్లు కేటాయించామని ఇండియా తెలిపింది.

యూరోప్‌కు చెందిన స్వచ్చంద సంస్థ కన్సర్న్‌ వల్డ్‌వైడ్‌ అండ్ వెల్త్‌ హంగర్‌హిల్ఫ్‌ అనే సంస్థ ఈ నివేదికను వెలువరిస్తుంది. మరో వైపు గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌ నివేదికపై విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఆకలి బాధలు, పోషకాహార లోపంపై ప్రభుత్వం ఎప్పుడు దిద్దుబాటు చర్యలు చేపడుతుందని ప్రశ్నించాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..