Punjab Crisis: పంజాబ్‌లో పరిణామాలపై కాంగ్రెస్‌లో అలజడి.. సీనియర్ నేత కపిల్ సిబాల్ సంచలన వ్యాఖ్యలు!

|

Sep 29, 2021 | 6:23 PM

Kapil Sibal: కాంగ్రెస్‌లో జీ 23 అలజడి మళ్లీ మొదలయ్యింది. పంజాబ్‌లో పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్‌ సీనియర్ నేతలు.

Punjab Crisis: పంజాబ్‌లో పరిణామాలపై కాంగ్రెస్‌లో అలజడి.. సీనియర్ నేత కపిల్ సిబాల్ సంచలన వ్యాఖ్యలు!
Kapil Sibal
Follow us on

Congress Senior Leader Kapil Sibal: కాంగ్రెస్‌లో జీ 23 అలజడి మళ్లీ మొదలయ్యింది. పంజాబ్‌లో పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్‌ సీనియర్ నేతలు. పార్టీకి పూర్తిస్థాయి అధ్యక్షుడు లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందని సీనియర్‌ నేత కపిల్‌ సిబాల్‌ మండిపడ్డారు. వెంటనే వర్కింగ్‌ కమిటీ సమావేశం ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. పార్టీ అధ్యక్ష ఎన్నిక ఆలస్యమవుతున్న విషయాన్ని ఇవాళ ఆయన్ను మీడియా సమావేశంలో విలేఖరులు ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఆయన.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్ని గుర్తు చేస్తూ అలా జరగాల్సింది కాదన్నారు. పంజాబ్‌లో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై స్పందించిన కాంగ్రెస్ అసంతృప్త నేత కపిల్ సిబల్.. అలా జరగి ఉండాల్సింది కాదంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. కాంగ్రెస్ ప్రస్తుతం ఉన్న పరిస్ధితుల్లో ఉండాల్సింది కాదంటూ కపిల్ సిబల్ ఇవాళ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. ఇప్పటికే తనతో కలిసి 23 మంది నేతలు కాంగ్రెస్ నాయకత్వం మార్పు కోసం గతంలో డిమాండ్ చేసిన విషయాన్ని సైతం కపిల్ సిబల్ గుర్తుచేశారు.

పంజాబ్ లో జరుగుతున్న పరిణామాలకు కారణం కాంగ్రెస్ కేంద్ర నాయకత్వ లోపమే కపిల్ సిబాల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పంజాబ్ రాష్ట్రం అంతర్జాతీయ సరిహద్దులో ఉంది పంజాబ్‌లో తాజా పరిణామాలు చూస్తుంటే ఐఎస్ఐ, పొరుగు దేశం పాకిస్తాన్‌కు ప్రయోజనం చేకూరేలా ఉన్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్ కాంగ్రెస్ నేతలు ఐక్యమత్యంగా ఉండాల్సిన అవసరముందన్నారు. కాంగ్రెస్ పార్టీకి శాశ్వత జాతీయ అధ్యక్షుడిని ఎంపిక చేయాలని లెటర్ రాసిన వారిపై ఇంత వరకు నిర్ణయం తీసుకోలేకపోవడం శోచనీయమన్న కపిల్ సిబాల్.. వెంటనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కావల్సిన అవసరముందన్నారు. పంజాబ్ పీసీసీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నికునేందుకు సీడబ్యూసీ, కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నిర్ణయం తీసుకోవాలని కపిల్ సిబాల్ డిమాండ్ చేశారు.


మరోవైపు, దేశంలో రోజుకింత దిగజారుతున్న పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరముందన్న ఆయన.. కాంగ్రెస్‌ను వీడిన నేతలంతా తిరిగి కలిసి రావాలని కపిల్ సిబల్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ మాత్రమే ఈ దేశాన్ని కాపాడగలదంటూ వారికి సిబల్ గుర్తుచేశారు. తనతో పాటు జీ23గా పిలుస్తున్న అసంతప్త నేతలు పార్టీని వీడాలని భావించడం లేదని, కేవలం బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని కపిల్ సిబల్ పేర్కొన్నారు. ఎంతో గొప్ప వైభవం కలిగిన పార్టీలో తానూ సభ్యుడినేనని కపిల్ సిబల్ గుర్తు చేశారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్ధితులు వస్తాయని తాను ఎప్పుడూ అనుకోలేదని సిబల్ వ్యాఖ్యానించారు. అయితే, గతకొంతకాలంగా నాయకత్వ మార్పు కోరుతూ స్వరం పెంచారు సీనియర్ నేతలు. సాధ్యమైనంత త్వరగా అధ్యక్ష ఎన్నికలు జరగాలని, ఇందులో తమకూ పోటీ పడే అవకాశం కల్పించాలని డిమాండ్లు చేస్తూ వస్తున్నారు. కాగా, అధినేత్రి సోనియా మాత్రం ప్రస్తుత పరిస్ధితుల్లో నాయకత్వ మార్పుతో పార్టీ పరిస్ధితి మరింత దారుణంగా మారుతుందని వారికి నచ్చచెప్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో పంజాబ్ సంక్షోభం వారికి కలిసొచ్చినట్లు కనిపిస్తోంది.

Read Also…  Pawan Kalyan: ఎవరు ఏం చేశారో వారికి ప్రతిఫలం ఇస్తాం.. పాండవ సభ ఎలా ఉంటుందో చూపిస్తాః పవన్