ఢిల్లీ పోలీసుల(Delhi Police) తీరుపై కాంగ్రెస్ మహిళా ఎంపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఈడీ విచారణను వ్యతిరేకిస్తూ ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న ఢిల్లీ పోలీసులు నిరసనకారులతో దురుసుగా ప్రవర్తించారు. ఇదే సమయంలో వారి వైఖరిపై తమిళనాడులోని కరూర్ ఎంపీ జ్యోతిమణి(MP Jyothimani) తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులు తనపై దాడి చేసి, దుస్తులు చించేశారని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఢిల్లీ పోలీసులు తమపై దారుణంగా దాడి చేశారన్న ఎంపీ జ్యోతిమణి.. బూట్లను లాగేసి, దుస్తులు చించేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వలేదని, కొనుక్కునేందుకు షాపుకు వెళ్తే వారినీ బెదిరించారని ఆవేదన చెందారు. ఒక మహిళా ఎంపీ పట్ల పోలీసులు ప్రవర్తించాల్సిన తీరు ఇదేనా అని ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై లోక్‌సభ స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు.. రాహుల్ గాంధీపై ఈడీ విచారణతో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కొంతమంది పోలీసులు బలవంతంగా తమ కార్యాలయంలోకి ప్రవేశించారని, కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. అక్రమంగా లోపలికి వచ్చిన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాగా.. ఈ ఆరోపణలను దిల్లీ పోలీసులు తోసిపుచ్చారు. నిరసన ర్యాలీ జరగకుండా అడ్డుకోవాలనుకున్నామే గానీ.. ఏఐసీసీ కార్యాలయంలోకి ప్రవేశించలేదని స్పష్టం చేశారు.
This is outrageous in any democracy. To deal with a woman protestor like this violates every Indian standard of decency, but to do it to a LokSabha MP is a new low. I condemn the conduct of the @DelhiPolice & demand accountability. Speaker @ombirlakota please act! pic.twitter.com/qp7zyipn85
— Shashi Tharoor (@ShashiTharoor) June 15, 2022
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఈడీ విచారణ మూడో రోజు ముగిసింది. ఎల్లుండి మరోసారి విచారణకు రావాలన్న ఈడీ అధికారులు తెలిపారు. ఇవాళ రాహుల్ గాంధీని 9 గంటలపాటు విచారించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట మూడో రోజు హాజరయ్యారు రాహుల్ గాంధీ. ఆయన వెంట ఆయన సోదరి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. విచారణ కారణంగా పోలీసులు ఢిల్లీలో(Delhi) ఆంక్షలు విధించారు. ఈడీ విచారణ రెండో రోజు రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసనలు చేశారు.