Bharat Jodo Nyay Yatra: రాహుల్ యాత్ర రూటు మారింది.. ఢిల్లీ పీఠం కోసం యూపీ మీదుగా పయనం..

'భారత్ న్యాయ్' యాత్ర పేరుతో వాహనాల శ్రేణికి స్టిక్కర్లు కూడా అతికించిన తర్వాత పేరును "భారత్ జోడో న్యాయ్ యాత్ర"గా మార్చారు. అలాగే ఇదివరకు యాత్ర మార్గంలో లేని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని చేర్చడంతో పాటు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మరింత దూరం యాత్ర సాగించేలా వ్యూహాత్మకంగా మార్పులు చేశారు. ముందుగా అనుకున్న ప్రణాళిక కంటే భిన్నంగా తీసుకువచ్చిన ఈ మార్పుల వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉందని తెలుస్తోంది.

Bharat Jodo Nyay Yatra: రాహుల్ యాత్ర రూటు మారింది.. ఢిల్లీ పీఠం కోసం యూపీ మీదుగా పయనం..
Rahul Gandhi Yatra 2
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Jan 05, 2024 | 7:10 PM

‘భారత్ జోడో’ యాత్ర ఇచ్చిన స్ఫూర్తి, ఉత్సాహంతో రాహుల్ గాంధీ యాత్ర 2.0ను జనవరి 14న ప్రారంభించేందుకు సన్నద్ధమవుతున్నారు. భారతదేశంలోని దక్షిణ దిక్కున చిట్టచివర్లో ఉన్న కన్యాకుమారి నుంచి ఉత్తరాన ఉన్న కాశ్మీర్ (శ్రీనగర్) వరకు సాగించిన మొదటి యాత్రకు ‘భారత్ జోడో’ అని పేరు పెట్టగా.. దేశంలోని తూర్పున ఉన్న మణిపూర్ నుంచి పశ్చిమ దిక్కున ఉన్న ముంబై (మహారాష్ట్ర)కు చేపట్టదల్చిన యాత్ర 2.0కు తొలుత ‘భారత్ న్యాయ్’ యాత్రగా నామకరణం చేశారు. అదే సమయంలో మొదట అనుకున్న మేరకు 14 రాష్ట్రాల మీదుగా 6,200 కి.మీ దూరం యాత్ర చేపట్టాల్సి ఉండగా.. చివరి నిమిషంలో యాత్రలో మార్పులు, చేర్పులు చోటుచేసుకున్నాయి.

‘భారత్ న్యాయ్’ యాత్ర పేరుతో వాహనాల శ్రేణికి స్టిక్కర్లు కూడా అతికించిన తర్వాత పేరును “భారత్ జోడో న్యాయ్ యాత్ర”గా మార్చారు. అలాగే ఇదివరకు యాత్ర మార్గంలో లేని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని చేర్చడంతో పాటు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో మరింత దూరం యాత్ర సాగించేలా వ్యూహాత్మకంగా మార్పులు చేశారు. ముందుగా అనుకున్న ప్రణాళిక కంటే భిన్నంగా తీసుకువచ్చిన ఈ మార్పుల వెనుక పెద్ద వ్యూహమే దాగి ఉందని తెలుస్తోంది.

ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలంటే ముందు ఉత్తర్ ప్రదేశ్ గెలుపొందాలి అన్నది భారత రాజకీయాల్లో ఉన్న నానుడి. దానర్థం కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే దేశంలోనే అత్యధిక ఎంపీ సీట్లు (80) ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లో పాగా వేయకుండా సాధ్యపడదు అని. ఈ రాష్ట్రంలో 2019లో తాను పోటీ చేసిన అమేథీలోనే రాహుల్ గాంధీ ఓడిపోయారు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు యూపీలోని 20 జిల్లాల్లో 23 నియోజకవర్గాలను కవర్ చేస్తూ యాత్ర సాగించేలా రూట్ మ్యాప్‌ను మార్చారు. తద్వారా తమకు పట్టున్న రాయ్‌బరేలీ, అమేథీతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో బలం పెంచుకోవాలని చూస్తున్నారు.

మారిన రూట్ మ్యాప్ ప్రకారం మణిపూర్ రాజధాని ఇంఫాల్ నుంచి ముంబై వరకు మొత్తం 6,713 కిలోమీటర్ల దూరాన్ని రాహుల్ గాంధీ 66-68 రోజుల్లో పూర్తి చేయనున్నారు. పాత లెక్క ప్రకారం 14 రాష్ట్రాల్లో 6,200 కి.మీ దూరం ప్రయాణించాల్సి ఉండగా.. అదనంగా మరో 513 కి.మీ దూరం పెరిగింది. కొత్త రూట్ ప్రకారం ఆయన 15 రాష్ట్రాల్లోని 110 జిల్లాల్లోని 100 లోక్‌సభ స్థానాల్లో యాత్ర సాగించనున్నారు. కొత్తగా చేసిన మార్పుల్లో అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం కూడా చేరింది. యాత్ర వివరాలను వెల్లడించిన ఏఐసీసీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ రూట్ మ్యాప్‌లో రాహుల్ గాంధీ ఎక్కువ సమయం ఉత్తరప్రదేశ్‌లో గడపనున్నట్టు వెల్లడించింది. ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ 11 రోజుల్లో 1,074 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు.

చందౌలీ వద్ద ఉత్తర ప్రదేశ్‌లోకి ప్రవేశించి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం వారణాసి మీదుగా అమేథీ, రాయ్ బరేలీ చేరుకుంటారు. యూపీలో రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపుతుందని, వారు ఐక్యంగా రంగంలోకి దిగుతారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ రాష్ట్రంలోని హై ప్రొఫైల్ లోక్‌సభ నియోజకవర్గాల మీదుగా ప్రయాణం సాగిస్తారు. సోనియా గాంధీ ప్రాతినిథ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఎంపీగా ఉన్న ఆయన పాత సీటు అమేథీలో కూడా యాత్ర సాగిస్తారు. మొత్తంగా యూపీలోని చందౌలీ, వారణాసి, భదోహి, అలహాబాద్, ప్రతాప్‌గఢ్, అమేథీ, రాయ్ బరేలీ, లక్నో, సీతాపూర్, లఖింపూర్, షాజహాన్‌పూర్, బరేలీ, రాంపూర్, మొరాదాబాద్, మీరట్, అలీగఢ్, మథుర, ఇటా, కాస్‌గంజ్, ఆగ్రా మీదుగా యాత్ర సాగనుంది.

మార్పు వెనుక వ్యూహం ఇదే!

యూపీలో రాహుల్ గాంధీ న్యాయ యాత్ర కోసం కాంగ్రెస్ రూపొందించిన రూట్ వెనుక రాజకీయ ఉద్దేశ్యం దాగి ఉంది. రాహుల్ గాంధీ యాత్రా మార్గంలోని 23 నియోజకవర్గాల్లో కనీసం వీలైనన్ని ఎక్కువ సీట్లలో కాంగ్రెస్ బరిలోకి దిగాలని భావిస్తోంది. తన మొదటి దశ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ పశ్చిమ యూపీలోని మూడు జిల్లాలను మాత్రమే కవర్ చేయగలిగారు. కానీ ఈసారి ఆయన 20 జిల్లాల మీదుగా ప్రయాణం సాగిస్తున్నందున, పూర్వాంచల్ నుండి అవధ్, రోహిల్‌ఖండ్ మీదుగా పశ్చిమ యూపీ, బ్రిజ్ ప్రాంతం వరకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కవర్ చేసినట్టవుతుంది.

2009 ఎన్నికల్లో గెలిచిన సీట్లు కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల సీట్లను కాంగ్రెస్ ఎంపిక చేసింది. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర వెళ్లే ప్రాంతాల్లో వారణాసి, ఫుల్‌పూర్, ప్రయాగ్‌రాజ్, ప్రతాప్‌గఢ్, అమేథీ, రాయ్ బరేలీ, లక్నో, లఖింపూర్ ఖేరీ, షాజహాన్‌పూర్, బరేలీ, మొరాదాబాద్, మీరట్, అలీగఢ్, ఫతేపూర్ సిక్రీ, ఆగ్రా నియోజకవర్గాలు ఉన్నాయి. 2024 ఎన్నికల్లో ఈ స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ యోచిస్తోంది. వీటితో పాటు యాత్ర మార్గంలో లేని మరికొన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పోటీ చేయాలని చూస్తోంది.

2009లో యూపీలో లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్, సోనియాతో పాటు మొత్తం కాంగ్రెస్‌ ఏడు స్థానాల్లో విజయం సాధించింది. 2014, 2019లో యూపీలో కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆయన తల్లి సోనియా గాంధీ ఎంపీగా ఉన్న రాయ్‌బరేలీ సీటుపై మాత్రమే కాంగ్రెస్ తన పట్టును కొనసాగిస్తోంది. రాహుల్ గాంధీ 2019లో తన సాంప్రదాయ స్థానమైన అమేఠీలో ఓడిపోయారు. రాహుల్ గాంధీ తన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’లో వెళుతున్న లోక్‌సభ స్థానాల్లో రెండు సీట్లు మినహా మిగిలినవన్నీ బీజేపీ గెలుపొందింది.

యూపీ ఎందుకు కీలకం?

దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలు యూపీలో ఉన్నాయి. ఎన్నికలు జరిగే 543 సీట్లలో యూపీలో ఏకంగా 80 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇవి మొత్తం సీట్లలో 15 శాతం. అంతేకాదు, ఎక్కువ మంది ప్రధాన మంత్రులను అందించిన రాష్ట్రంగానూ ఉత్తర్‌ప్రదేశ్‌కు రికార్డు ఉంది. దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, వీపీ సింగ్, చంద్రశేఖర్, అటల్ బిహారీ వాజ్‌పేయి వరకు అందరూ యూపీ నుంచే ఎంపీలయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా యూపీలోని వారణాసి స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. బీజేపీ వరుసగా రెండు సార్లు అధికారంలోకి రావడంలో యూపీలో సాధించిన సీట్లు కీలకంగా మారాయి.

2014లో యూపీలోని 80 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 73 సీట్లు గెలుచుకోగా, 2019లో 64 సీట్లు గెలుచుకుంది. 2024లో బీజేపీని క్లీన్ స్వీప్ చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, యూపీలోనే బీజేపీని ఓడించాలని విపక్షాలు ప్లాన్ వేసి మోదీ హ్యాట్రిక్ సాధించకుండా అడ్డుకోవాలని చూస్తున్నాయి. యూపీలో సమాజ్‌వాదీ, కాంగ్రెస్, ఆర్ఎల్డీ విపక్ష కూటమి (I.N.D.I.A)లో భాగంగా ఉన్నాయి. ఇప్పుడు రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో భాగంగా యూపీలోనే ఎక్కువ కాలం గడుపుతారు. బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ వాతావరణాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు.

భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొనేందుకు విపక్ష కూటమి భారత మిత్రపక్షాలను కూడా ఆహ్వానించాలని కాంగ్రెస్ వ్యూహం రచించింది. భారత్ జోడో న్యాయ యాత్ర కోసం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగే యాత్రలో పాల్గొనేందుకు కాంగ్రెస్‌తో పొత్తు ఉన్న పార్టీలు, ప్రజా సంఘాలు, సామాజిక సంఘాలను ఆహ్వానిస్తామని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ తెలిపారు. యాత్ర భారత రాజకీయాల్లో పరివర్తన ఉద్యమంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

2024 లోక్‌సభ ఎన్నికల సంసిద్ధతతో పాటు భారత్ జోడో న్యాయ యాత్ర కోసం కాంగ్రెస్ గురువారం కీలక సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. రాత్రింబవళ్లు కష్టపడి లోక్‌సభ ఎన్నికల్లో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ ఎక్కడ బలహీనంగా ఉందో అక్కడ ప్రజాదరణ కలిగిన నేతలను గుర్తించాలని నిర్ణయించింది. షెడ్యూల్డ్ కులం (SC), షెడ్యూల్డ్ తెగ (ST), ఇతర వెనుకబడిన తరగతులు (OBC), మైనారిటీ ఆధిపత్య స్థానాల్లో నాయకత్వాన్ని తయారు చేయాలని కూడా నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ ఓటర్ల పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించకుండా చూడాలని ఆయన నేతలను కోరారు.

కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా పదవీకాలం గురించి మల్లికార్జున్ ఖర్గే ప్రత్యేకంగా ప్రస్తావించారు. మార్చి 2001లో బెంగళూరులో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఎన్డీయేను అధికారం నుంచి దించాలని పార్టీ తీర్మానించిందని గుర్తుచేశారు. అన్నట్టుగానే 2004లో సోనియా నాయకత్వంలో ప్రతి రాష్ట్రంలో కార్యకర్తలు హృదయపూర్వకంగా నిరంతరం పనిచేశారన్నారు. యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (UPA) నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA)ని ఓడించి 10 సంవత్సరాలు అధికారంలో ఉంది. ఈ పదేళ్లలో పార్టీ కార్యకర్తలు ప్రతి గ్రామం, నగరం నుంచి తయారయ్యారు. ఇప్పుడు పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు అదే అంకితభావంతో పని చేయాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ ఖర్గే పిలుపునిచ్చారు. 2024లో మోడీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దించి ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని వ్యాఖ్యానించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Latest Articles
మళ్లీ పటాస్ ప్రవీణ్‌తో జబర్దస్త్ ఫైమా..కొత్త లవర్‌ను పరిచయం చేసి
మళ్లీ పటాస్ ప్రవీణ్‌తో జబర్దస్త్ ఫైమా..కొత్త లవర్‌ను పరిచయం చేసి
ఎదుటివారిలో ఈ లక్షణాలు కనిపిస్తే అబద్దాలు చెబుతున్నారని అర్ధమట
ఎదుటివారిలో ఈ లక్షణాలు కనిపిస్తే అబద్దాలు చెబుతున్నారని అర్ధమట
ఆ కాంట్రవర్సీలో ఇరుక్కున్న పాయల్ రాజ్‌పుత్.. కెరీర్‌పై ఎఫెక్ట్.
ఆ కాంట్రవర్సీలో ఇరుక్కున్న పాయల్ రాజ్‌పుత్.. కెరీర్‌పై ఎఫెక్ట్.
ఫైనల్‌కు వెళ్లేదెవరు?KKRతో క్వాలిఫైయర్ మ్యాచ్.. టాస్ గెలిచిన SRH
ఫైనల్‌కు వెళ్లేదెవరు?KKRతో క్వాలిఫైయర్ మ్యాచ్.. టాస్ గెలిచిన SRH
బోనస్‌పై కాంగ్రెస్ మాట మార్చిందా? కొనుగోళ్లలో U ట్యాక్స్‌ నిజమేనా
బోనస్‌పై కాంగ్రెస్ మాట మార్చిందా? కొనుగోళ్లలో U ట్యాక్స్‌ నిజమేనా
మాకొచ్చే సీట్ల విషయంలో క్లారిటీతో ఉన్నాం.. బొత్స కీలక వ్యాఖ్యలు
మాకొచ్చే సీట్ల విషయంలో క్లారిటీతో ఉన్నాం.. బొత్స కీలక వ్యాఖ్యలు
కిర్గిస్థాన్‌లో అల్లర్లు.. ఉలిక్కిపడ్డ విజయనగరం.. తమ పిల్లల కోసం
కిర్గిస్థాన్‌లో అల్లర్లు.. ఉలిక్కిపడ్డ విజయనగరం.. తమ పిల్లల కోసం
యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.. మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
యూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు.. మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
ముఖానికి మాస్క్ పెట్టేసిన ఈ స్టార్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
ముఖానికి మాస్క్ పెట్టేసిన ఈ స్టార్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
మీరు మోక్షం పొందాలంటే జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాలను దర్శించండి..
మీరు మోక్షం పొందాలంటే జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయాలను దర్శించండి..