Eknath Gaikwad Death: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం వేలాది మంది మరణిస్తున్నారు. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ కోవిడ్ మహమ్మారికి బలవుతున్నారు. తాజాగా తాజాగా మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎక్‌నాథ్ గైక్వాడ్ (81) కరోనాతో కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో గైక్వాడ్ పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం 10 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన కూతురు వర్షా గైక్వాడ్ ప్రస్తుతం మహారాష్ట్ర ప్రస్తుత విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.
కాగా.. బౌద్ధ కుటుంబానికి చెందిన ఏక్‌నాథ్ గైక్వాడ్ ముంబై సౌత్ సెంట్రల్ నియోజకర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి చవిచూశారు. ఆసియాలో అతిపెద్ద మురికివాడ అయిన ధారావి నియోజకవర్గం నుంచి 1985 నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ముంబై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన మృతి పట్ల కాంగ్రెస్ నాయకులు, పలు పార్టీల ప్రతినిధులు విచారం వ్యక్తంచేసి.. గైక్వాడ్ కుటుంబానికి సంతాపం తెలిపారు.
కాగా.. మహారాష్ట్రలో రోజురోజుకూ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిత్యం 60 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య కూడా భారీగానే నమోదవుతోంది. దేశంలో కరోనా కేసులు, మరణాల పరంగా మహారాష్ట్ర మొదటిస్థానంలో కొనసాగుతోంది.
Also read: