రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో లోక్ సభలో కాంగ్రెస్ విపక్ష నేతగా అధిర్ రంజన్ చౌదరిని తొలగించవచ్చునని తెలుస్తోంది. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ బుధవారం నిర్వహించే పార్లమెంట్ స్ట్రాటజీ గ్రూప్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకోవచ్చునని భావిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలు వచ్చే వరం నుంచి ప్రారంభం కానున్నాయి. సభలో ఈ పదవిని శశిథరూర్, మనీష్ తివారీ, గౌరవ్ గొగోయ్ తదితరులు ఆశిస్తున్నారు. తెలంగాణ పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరు కూడా వినవస్తోంది. ఇదే సమయంలో లోక్ సభలో పార్టీ విప్ లను కూడా మార్చవచ్చునని అంటున్నారు. 2019 నుంచి అధిర్ రంజన్ చౌదరి సభలో పార్టీ నేతగా కొనసాగుతున్నారు. ఈయన స్థానే ఈ పదవిలో మరొకరిని నియమించవచ్చునని చాలాకాలంగా ఊహాగానాలు సాగుతున్నాయి. కాగా బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందడంతో ఇక చౌదరిని మార్చవచ్చుననే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ ఎన్నికల్లో ఆయన పార్టీ ప్రచార వ్యూహ బాధ్యతలను నిర్వర్తించారు.
అయితే ఒక వ్యక్తికి ఒకే పదవి అన్న సూత్రాన్ని అనుసరించి కూడా లోక్ సభలో చౌదరి మార్పు అంశాన్ని పార్టీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. 2024 లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బెంగాల్ లో కాంగ్రెస్ విజయావకాశాలను మెరుగుపరిచే అంశంపై చౌదరి దృష్టి పెడతారని అంటున్నారు. బహుశా ఈ నేపథ్యంలోనే ఆయనను మార్చే విషయంలో సోనియా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ను, ఆ పార్టీ అధినేత్రి, సీఎం, మమతా బెనర్జీని ఎదుర్కొనే సత్తా చౌదరికి ఉన్నట్టు పార్టీ భావిస్తోంది. అయితే అన్ని అంశాలను బుధవారం జరిగే స్ట్రాటజీ గ్రూప్ మీటింగ్ లో పార్టీ అధినాయకత్వం పరిశీలించనుంది.
మరిన్ని ఇక్కడ చూడండి : మెస్సి మెస్మరైజ్ చేసావ్…28ఏళ్ల నిరీక్షణకు తెరదించావ్..!కోపా అమెరికా కప్ కైవసం..:Copa America Final 2021