Himachal Pradesh: హిమాచల్.. కాంగ్రెస్ చేజారనుందా?.. అదే జరిగితే..

వైనాట్ ఫోర్ హండ్రెడ్ అని బీజేపీ గర్జిస్తుంటే.. 350 మైలురాయినైనా దాటుదాం రండి అని ఇండీ కూటమిని తొందరపెడుతోంది కాంగ్రెస్ పార్టీ. మోదీకి హ్యాట్రిక్ ఛాన్స్ ఇవ్వొద్దన్న సింగిల్ పాయింట్ ఎజెండాతో పరుగుపెడ్తున్న హస్తం పార్టీని వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. కాంగ్రెస్ పోగొట్టుకోబోతున్న లేటెస్ట్ వికెట్ పేరు హిమాచల్ ప్రదేశ్.

Himachal Pradesh: హిమాచల్.. కాంగ్రెస్ చేజారనుందా?.. అదే జరిగితే..
Chief Minister Sukhvinder Singh Sukhu with AICC observers Bhupesh Baghel, D K Shivakumar, Bhupinder Singh Hooda and Rajeev Shukla

Updated on: Feb 29, 2024 | 10:21 AM

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్ని చేతులారా పోగొట్టుకుంది హస్తం పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ చేతుల్లో మిగిలిన మూడు రాష్ట్రాల్లో మరొకటి మిస్సవబోతోందా? రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయననది ఆసక్తికరంగా మారింది.  నార్త్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం-హిమాచల్‌ప్రదేశ్‌. ఇక్కడ కాంగ్రెస్‌ సంఖ్యాబలం తగ్గడం, అసెంబ్లీలో బీజేపీ బలపరీక్షకు డిమాండ్‌ చేయడంతో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. నిన్న రాజ్యసభ ఎన్నికల్లో ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు హ్యాండ్‌ ఇచ్చి క్రాస్‌ ఓటింగ్‌కి పాల్పడ్డమే ఈ సంక్షోభానికి కారణం.

హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ మొత్తం సభ్యత్వం 68. కాంగ్రెస్ ఖాతాలో 40 మంది. బీజేపీ ఎమ్మెల్యేలు 25 మంది. ఇండిపెండెంట్లు ముగ్గురు. తగిన బలం లేకపోయినప్పటికీ రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టింది బీజేపీ. ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చెయ్యడంతో బీజేపీ స్కోరు 34కు పెరిగింది. కాంగ్రెస్ స్కోరు కూడా 34 దగ్గరే ఆగిపోయింది. సమ ఉజ్జీలుగా నిలవడంతో టాస్ వేయాల్సి వచ్చింది. అదృష్టం బీజేపీ అభ్యర్థిని వరించింది. రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి ఎదుర్కోవడమే కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడ్డట్టయింది. ఇదే అదనుగా హిమాచల్‌ను తమ ఖాతాలో వేసుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. బీజేపీ ఎమ్మెల్యేలు రాజ్‌భవన్‌ తలుపుతట్టి.. కాంగ్రెస్‌కు బలం లేదనీ, వెంటనే అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. గవర్నర్‌ ప్రతాప్‌ శుక్లాకు వినతిపత్రం ఇచ్చారు.

బుధవారం హిమాచల్ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు జరిగాయి. బడ్జెట్ సమర్పిస్తున్న సమయంలో నినాదాలు చేసినందుకు 15 మంది బీజేపీ సభ్యుల్ని సస్పెండ్ చేశారు స్పీకర్ కుల్‌దీప్ సింగ్. అటు.. తమ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో భంగపడ్డ సీఎం సుఖ్వీందర్ సింగ్ రాజీనామా చేసినట్టు వదంతులు పుట్టాయి. కానీ.. తాను పారిపోవడం లేదని, నిలబడే పోరాడతానని స్టేట్‌మెంట్ ఇచ్చారు సీఎం సుఖ్వీందర్. సంక్షోభ నివారణ కోసం ఢిల్లీ నుంచి భూపిందర్‌సింగ్‌ హుడా, డీకే శివకుమార్‌ను పరిశీలకులుగా పంపింది కాంగ్రెస్ హైకమాండ్.

అటు.. ఆరుగురు ఎమ్మెల్యేలకు షోకాజ్‌ నోటీస్‌ ఇచ్చింది కాంగ్రెస్‌ అధిష్టానం. సమాధానం ఇవ్వడానికి వారం రోజుల సమయం ఉంది.. ఇప్పుడేంటి తొందర అంటూ రిసార్ట్‌లో రెస్ట్ తీసుకుంటున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అటు.. సీఎంపై అసంతృప్తితో క్యాబినెట్‌ నుంచి వైదొలిగారు మంత్రి విక్రమాదిత్య సింగ్.

అటు ముఖ్యమంత్రిని మార్చే యోచన కూడా చేస్తోంది కాంగ్రెస్ హైకమాండ్. ఆరు సార్లు సీఎంగా చేసిన దివంగత నేత వీరభద్ర సింగ్ భార్య, ఆ పార్టీ సీనియర్‌ మహిళా నేత ప్రతిభా సింగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ.. రెబెల్ ఎమ్మెల్యేల్ని సముదాయిస్తేనే.. కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నెగ్గే ఛాన్సుంది. అప్పటిదాకా బీజేపీ చూస్తూ ఊరుకుంటుందా… అనేది సస్పెన్స్.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.