Congress dissidents to shock high-command: అయిదు అసెంబ్లీల ఎన్నికల్లో రాజకీయ పార్టీలన్నీ బిజీ బిజీగా వుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. రాహుల్, ప్రియాంక లాంటి వారు ప్రజలను ఆకట్టుకునేందుకు గ్రౌండ్‌లో లిటరల్‌గా పుషప్స్, డాన్సులు వంటివి చేస్తుంటే.. జాతీయ స్థాయిలో వున్న నేతలు పరస్పరం మాటల యుద్దాలకు దిగుతున్నారు. మరోవైపు హస్తిన వేదికగా అధిష్టానంతో పోరాడేందుకు అసంతృప్త నేతలు రెడీ అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
పార్టీ ప్రక్షాళన పేరిట అధిష్టానం తీసుకుంటున్న చర్యలు పలువురు సీనియర్ కాంగ్రస్ నేతల్లో అసంతృప్తికి కారణమవుతోంది. ఇదివరకు అసమ్మతి లేఖతో సంచలనం రేపిన 23 మంది గ్రూపు మరోసారి కీలక సమావేశాన్ని నిర్వహించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. దాంతో జీ–23 నాయకుల కదలికలపై అధిష్టానం వేగులు నిఘా పెట్టినట్లు సమాచారం. మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో కీలక నేత, కశ్మీరీ నాయకుడు గులాం నబీ ఆజాద్ జీ–23 లో కీలక సభ్యుడు అయిన కారణంగానే ఆయన రాజ్యసభ పదవీకాలాన్ని పొడిగించలేదని అసంతృప్త నేతలు భావిస్తున్నారు. సుదీర్ఘ కాలంపాటు కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన ఆజాద్ పట్ల అధిష్టానం ధోరణి పలువురు ఇతర సీనియర్లలో ఆగ్రహానికి దారి తీసింది. దాంతో పాటు రాజ్యసభా పక్ష నాయకుడిగా గులాంనబీ ఆజాద్ పదవీ విరమణ చేసిన తర్వాత ఆ తర్వాత డిప్యూటీ ప్లేస్‌లో వున్న మరో సీనియర్ నేత ఆనంద్ శర్మను కాదని, అధిష్టానం రాహుల్‌గాంధీ అనుచరునిగా పేరున్న మల్లికార్జున ఖర్గేకు అప్పగించినప్పటి నుంచి జీ–23 నేతలు అధిష్టానంపై అసహనాన్ని ఏదో ఒక రూపంలో వెల్లగక్కుతూనే ఉన్నారు.
రాజ్యసభ పక్ష నాయకుడి పదవి ఆనంద్ శర్మకు రాకుండా అడ్డుకోవడంలో లోక్‌సభలో విపక్ష నేతగా వ్యవహరిస్తున్న అధిర్ రంజన్ చౌధరి వంటి బెంగాలీ నేతలు వారు కీలకపాత్ర పోషించారని జీ–23 నాయకుల బృందం అనుమానిస్తోంది. తాజాగా బెంగాల్ ఎన్నికల్లో పొత్తుపై కాంగ్రెస్ పార్టీలో రగిలిన చిచ్చుకు ఈ అసమ్మతి, అసంతృప్తి నేతలే కారణమని అనుకుంటున్నారు. బెంగాల్ ఎన్నికల పొత్తు విషయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌధరిపై ఆనంద్ శర్మ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఐఎస్‌ఎఫ్‌తో పొత్తు కాంగ్రెస్ భావజాలానికి పూర్తి విరుద్ధమని, అలాంటి నిర్ణయం తీసుకునే ముందు పార్టీస్థాయిలో వివరణాత్మక చర్చ జరగాలని ఆనంద్ శర్మ తన ట్వీట్ ద్వారా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ ట్వీట్ అధిర్ రంజన్ చౌదరిని టార్గెట్‌గా చేసి పోస్టు చేసిందేనని పలువురు భావిస్తున్నారు. ఆనంద్ శర్మ ట్వీట్ల తరువాత, అధిర్ రంజన్ చౌదరి కూడా ఘాటుగానే స్పందించారు. ఆనంద్ శర్మ, అధిర్ రంజన్‌ల మాటల యుద్ధం మరోసారి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న అంతర్గత పోరును తెరపైకి తీసుకొచ్చింది.
ఇంకోవైపు అసంతృప్త నేతల్లో కీలకంగా ఉన్న నలుగురు నేతలు ఢిల్లీకి చెందిన వారు కావడంతో, ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలోను వర్గ పోరు, ఇంటర్నల్ వార్ మొదలయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. త్వరలో జరుగబోయే కీలక సమావేశంలో పార్టీ అసంతృప్త నాయకుల భవిష్యత్తు కార్యాచరణపై చర్చలు జరపనున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్, ఢిల్లీ పీసీసీ మాజీ అధ్యక్షుడు అర్విందర్ సింగ్ లవ్లీ, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్, మాజీ ఉపాధ్యక్షుడు యోగానంద్ శాస్త్రిలు 23 మంది అసంతృప్త నేతల జాబితాలో ఉన్నారు. అయితే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఢిల్లీ పీసీసీలో ఈ అసంతృప్త నాయకుల జాబితా పెరుగుతోందని తెలుస్తోంది.
పార్టీని బలోపేతం చేసే విషయంలో అధిష్టానం తీరు మార్చుకోవాలంటూ గత సంవత్సరం ఆగస్టులో సోనియాగాంధీకి 23 మంది అసంతృప్త నేతలు రాసిన లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ లేఖ అప్పట్లో పెద్ద సంచలనమైంది. పార్టీలో పెద్ద ఎత్తున దుమారానికి దారి తీసింది. కొన్ని నెలల క్రితం సోనియాగాంధీ నివాసంలో జీ –23 నేతలతో జరిగిన కీలక సమావేశంలో తమ అభిప్రాయాలను పలువురు పార్టీ సీనియర్లు రాహుల్, సోనియా, ప్రియాంక గాంధీల ముందుంచినా ఫలితం లేదని వారు భావిస్తున్నారు. ఆ సమావేశం జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ హైకమాండ్ జీ–23 నేతలు ఇచ్చిన సలహాలను, చేసిన సూచనలను పట్టించుకున్న దాఖలాలు లేవని అంటున్నారు. అసంతృప్తి కారణంగా పార్టీని వీడాలనుకుంటున్న నాయకుల గురించి కూడా సోనియా, రాహుల్ వంటి నేతలు పట్టించుకోకపోవడంతో వారిలో మరింత అసహనానికి దారి తీస్తున్నందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అందుకే, త్వరలో జరపాలనుకుంటున్న సమావేశం ద్వారా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక బలమైన సందేశాన్ని పంపించాలని అసంతృప్త కాంగ్రెస్ నేతలు తలపెట్టారని, దానికి అనుగుణంగానే కార్యాచరణ రూపొందిస్తున్నారని తెలుస్తోంది.
బెంగాల్, తమిళనాడు, కేరళ వంటి కీలక రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతుండడం, వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి ఈ రాష్ట్రాల గెలుపు కీలకం కానున్న నేపథ్యంలో రాహుల్, ప్రియాంక కాళ్ళకు చక్రాలు కట్టుకుని మరీ గ్రౌండ్ స్థాయిలో పర్యటిస్తున్నారు. ఒక చోట పుషప్స్.. ఇంకో చోట డాన్సులతో రాహుల్ ప్రజలకు చేరువయ్యేందుకు యధాశక్తి యత్నిస్తున్నారు. మార్చి 27వ తేదీ నుంచి అయిదు అసెంబ్లీల పోలింగ్ ప్రారంభం కాబోతోంది. ఇలాంటి కీలక తరుణంలో అసంతృప్త నేతలు సమావేశమై.. జాతీయ స్థాయిలో గట్టి సందేశాన్ని పంపితే కాంగ్రెస్ పార్టీకి భారీ నష్టం కలిగించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీన్ని నివారించాల్సిన అధిష్టానం ఆ దిశగా అస్సలు దృష్టి పెట్టకపోవడంపై కూడా పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.