దేశంలో గ్యాస్ కొరత ఆందోళన.. నగరాల్లో మూతపడుతున్న రెస్టారెంట్లు! హైదరాబాద్‌ పరిస్థితి..?

నగరంలోని కొన్ని రెస్టారెంట్లు, చిన్న హోటళ్లు గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు సమాచారం. హోటల్ యజమానులు ప్రత్యామ్నాయ మార్గాలు ప్రయత్నిస్తున్నప్పటికీ, కమర్షియల్ గ్యాస్ లేకపోతే పూర్తి స్థాయిలో సేవలు అందించడం కష్టమని అంటున్నారు. ఇదిలా ఉంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం..

దేశంలో గ్యాస్ కొరత ఆందోళన.. నగరాల్లో మూతపడుతున్న రెస్టారెంట్లు! హైదరాబాద్‌ పరిస్థితి..?
Gas Cylinder Shortage

Updated on: Mar 10, 2026 | 4:18 PM

దేశంలో చమురు, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, పలు ప్రధాన నగరాల్లో కమర్షియల్ LPG సిలిండర్ల కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు పెద్దఎత్తున కమర్షియల్ గ్యాస్ సిలిండర్లపై ఆధారపడటం వల్ల ఈ కొరత ప్రభావం వ్యాపార రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఐటీ రాజధాని బెంగళూరులోని హోటళ్లు తీవ్ర ఎల్‌పిజి సిలిండర్ల కొరతను ఎదుర్కొంటున్నాయి. వాణిజ్య సిలిండర్ల ధరలు విపరీతంగా పెరిగాయి. వాటి లభ్యత పూర్తిగా పడిపోయింది. ఫలితంగా, ప్రతిష్టాత్మక త్రీస్టార్ హోటళ్లు వంట కోసం సాంప్రదాయ కలపను ఆశ్రయించాయి. బెంగళూరులోని వేలాది హోటళ్లకు ప్రతిరోజూ ఐదు నుండి పది వాణిజ్య సిలిండర్లు అవసరం. అయితే, సరఫరా లేకపోవడం వల్ల, చాలా హోటళ్లు ఇప్పటికే నిల్వ చేసిన సిలిండర్లను ఉపయోగించాయి. సమీప భవిష్యత్తులో సిలిండర్లు అందుబాటులో లేకపోతే తమ హోటళ్లను మూసివేయాల్సి రావచ్చని హోటల్ యజమానులు విచారం వ్యక్తం చేశారు. అతిథులకు సేవ చేయడానికి కట్టెల పొయ్యిలను చివరి ప్రయత్నంగా ఉపయోగిస్తున్నారు.

అటు మహారాష్ట్ర రాజధాని ముంబాయ్‌లోనూ ఈ సమస్య తీవ్రంగా మారింది. అక్కడ కమర్షియల్ LPG సిలిండర్లు సరిపడా అందుబాటులో లేకపోవడంతో సుమారు 20 శాతం హోటళ్లు, రెస్టారెంట్లు తాత్కాలికంగా మూతపడినట్లు హోటల్ అసోసియేషన్ వెల్లడించింది. గ్యాస్ సరఫరా సమస్య త్వరగా పరిష్కారం కాకపోతే మరికొన్ని రోజుల్లో పరిస్థితి మరింత విషమించి, నగరంలో సగానికి పైగా హోటళ్లు మూసివేయాల్సిన పరిస్థితి రావచ్చని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హోటల్ యజమానుల ప్రకారం, గత కొన్ని రోజులుగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా ఆలస్యంగా జరుగుతోందని అంటున్నారు.. డిస్ట్రిబ్యూటర్ల వద్ద కూడా నిల్వలు పరిమితంగా ఉండటంతో హోటళ్లకు అవసరమైనంత గ్యాస్ అందడం లేదని చెబుతున్నారు.. దీంతో చాలా చిన్న, మధ్య తరహా రెస్టారెంట్లు తమ కార్యకలాపాలను కొనసాగించలేక తాత్కాలికంగా మూసివేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్య ముంబాయ్‌కే పరిమితం కాకుండా ఇతర ప్రధాన నగరాలకు కూడా విస్తరిస్తోందని తెలిసింది.. దేశ రాజధాని ఢిల్లీలో కూడా కొన్ని రెస్టారెంట్లు గ్యాస్ కొరత కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

ఇక, హైదరాబాద్‌లో కూడా ఇదే పరిస్థితి కొంత మేర కనిపిస్తోంది. నగరంలోని కొన్ని రెస్టారెంట్లు, చిన్న హోటళ్లు గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్లు సమాచారం. హోటల్ యజమానులు ప్రత్యామ్నాయ మార్గాలు ప్రయత్నిస్తున్నప్పటికీ, కమర్షియల్ గ్యాస్ లేకపోతే పూర్తి స్థాయిలో సేవలు అందించడం కష్టమని అంటున్నారు.

ఇదిలా ఉంటే, కేంద్ర ప్రభుత్వం మాత్రం దేశంలో చమురు, గ్యాస్ నిల్వలు సరిపడా ఉన్నాయని స్పష్టం చేస్తోంది. సరఫరా వ్యవస్థలో తాత్కాలిక సమస్యలు లేదా రవాణా ఆలస్యాల వల్ల కొన్నిచోట్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడి ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. సమస్యను త్వరగా పరిష్కరించేందుకు ఆయిల్ కంపెనీలు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. కాగా, హోటల్, రెస్టారెంట్ రంగానికి చెందిన వ్యాపారులు ప్రభుత్వాన్ని వెంటనే జోక్యం చేసుకుని గ్యాస్ సరఫరాను సాధారణ స్థితికి తీసుకురావాలని కోరుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us