కొబ్బరి రైతులకు గుడ్‌న్యూస్ .. మద్దతు ధర పెంపునకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్.. క్వింటాల్‌పై ఎంతంటే?

MSP Hike 2026: కొబ్బరి రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 2026 సీజన్‌కు కొబ్బరి కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కొబ్బరి కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

కొబ్బరి రైతులకు గుడ్‌న్యూస్ .. మద్దతు ధర పెంపునకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్.. క్వింటాల్‌పై ఎంతంటే?
Coconut Msp India

Edited By: Anand T

Updated on: Dec 12, 2025 | 7:02 PM

గత కొన్ని రోజులుగా కనీస మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్న కొబ్బరి రైతులకు కేంద్రం పండగ లాంటి వార్తను చెప్పింది. కొత్త సంవత్సరానికి ముందే కొనసీమ రైతుల కళ్లలో ఆనందాన్ని తెచ్చింది. 2026 సీజన్‌కు కొబ్బరి కనీస మద్దతు ధర పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తాజాగా ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ కొబ్బరి కనీస మద్దతు ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

కొబ్బరి ఎంఎస్‌పీని క్వింటాలుకు రూ.12,027గా, బాల్ కొబ్బరికి రూ.12,500గా ప్రభుత్వం నిర్ణయించింది. గత సీజన్‌ కంటే మిల్లింగ్ కొబ్బరిపై క్వింటాలుకు రూ.445, బాల్ కొబ్బరిపై క్వింటాలుకు రూ.400 పెంచింది. 2014లో క్వింటాల్ మిల్లింగ్ కొబ్బరి ధర రూ.5,250 గా ఉండగా.. బాల్ కొబ్బరి ధర రూ.5,500 గా ఉంది. గడిచిన 11 ఏళ్లుగా కొబ్బరి ధరల్లో వచ్చిన మార్పులు చూసుకుంటే.. 2026 మార్కెటింగ్ సీజన్‌ నాటికి మల్లింగ్ కొబ్బరిపై 129 శాతం, బాల్‌ కొబ్బరిపై 127 శాతం వృద్ధి ఉంది.

కొబ్బరి రైతులకు లాభదాయక ధరలను అందించడం కోసం పంటల కనీస మద్దతు ధరను సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 1.5 రెట్ల స్థాయిలో నిర్ణయించనున్నట్లు ప్రభుత్వం 2018-19 కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించింది. దానికి అనుగుణంగా కొబ్బరి ఉత్పత్తిని పెంచడానికి రైతులను ప్రోత్సహించేలా కేంద్రం ఎప్పటికప్పుడు కొబ్బరి మద్దతు ధర పెంచుతుంది.

కొబ్బరి సాగుదారులకు మెరుగైన లాభదాయక రాబడిని నిర్దారించడమే కాకుండా. దేశీయంగా, అంతర్జాతీయంగా కొబ్బరి ఉత్పత్తులకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి సరిపడా కొబ్బరి ఉత్పత్తిని విస్తరించేలా రైతులను ప్రోత్సహిస్తుంది. ప్రస్తుతం దేశంలో ధర మద్దతు పథకం కింద కొబ్బరి సేకరణ కోసం సెంట్రల్ నోడల్ ఏజెన్సీలుగా నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, నేషనల్ కోఆపరేటివ్ కన్స్యూమర్స్ ఫెడరేషన్‌లు పనిచేస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.