Privatisation of Air India: ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణ విషయంపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి శనివారం కీలక ప్రకటన చేశారు. ఎయిర్ ఇండియా సంస్థలో ప్రభుత్వ వాటాను ఉపసంహరించుకొని పూర్తిగా ప్రైవేటీకరించడం.. లేదా మూసివేయడం తప్ప వేరే మార్గమే లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రైవేటీకరించడమా.. లేదా ప్రైవేటీకరించకపోవడమా అన్న ప్రత్యామ్నాయాలు ప్రభుత్వం ముందు లేవని పేర్కొన్నారు. పెట్టుబడులు పూర్తిగా వెనక్కి తీసుకోవాలన్న విషయంపై ప్రత్యామ్నాయ మార్గాలేవీ లేవని, ప్రైవేటీకరణే ఫైనల్ అంటూ ఆయన వివరించారు. ఎయిర్ ఇండియాకు రోజూ రూ.20 కోట్ల చొప్పున నష్టం వస్తోందని వెల్లడించారు. ఆస్తుల పరంగా ఎయిర్ ఇండియాకు మొదటి రేటు ఉన్నప్పటికీ.. ఇప్పటికే రూ.60,000 కోట్ల మేర బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. అయితే ఈ రుణ భారాన్ని తగ్గించడం కోసం కొత్త యాజమాన్యం రాక తప్పదని హర్దీప్ సింగ్ పురి స్పష్టం చేశారు.
ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణకు సంబంధించిన బిడ్‌ల ప్రక్రియ పూర్తయ్యేందుకు 64 రోజుల సమయం పడుతుందని హర్దీప్ సింగ్ పురి తెలిపారు. ఇదంతా మే ఆఖరు నాటికి పూర్తికావచ్చని తెలిపారు. అయితే దీనికి సంబంధించి పలు పెద్ద కంపెనీలు పోటీపడుతున్నట్లు సమాచారం. షార్ట్ లిస్ట్ ప్రక్రియను కూడా ప్రారంభించాలని అంతకుమందే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: