Chennai Rains: నీటమునిగిన చెన్నై మహానగరం.. ఆ రెండు రోజుల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం..

| Edited By: Narender Vaitla

Nov 08, 2021 | 6:01 PM

Tamil Nadu Rains LIVE Updates: తమిళనాడులో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వానలకు చెన్నై మహానగరం చిగురుటాకులా వణికిపోతోంది. నగరం నీట మునిగింది.

Chennai Rains: నీటమునిగిన చెన్నై మహానగరం.. ఆ రెండు రోజుల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం..
Tamil Nadu Rains

Tamil Nadu Rains: తమిళనాడులో భారీ వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుండపోత వానలకు చెన్నై మహానగరం చిగురుటాకులా వణికిపోతోంది. నగరం నీట మునిగింది. 12 గంటల్లోనే 23సెంటీమీటర్ల వర్షం పడింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. చెన్నై వీథులు నదులను తలపిస్తున్నాయి. చెంబరబాక్కం, పూండి, పుళల్‌ రిజర్వాయర్ల నుంచి భారీగా వరదనీరు పోటెత్తుతోంది. దీంతో రవాణా స్తంభించిపోయింది. ఉత్తర, దక్షిణ చెన్నై నీటమునిగిపోయాయి. మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది వాతావరణ శాఖ. చెన్నై తీర ప్రాంత జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. మరోవైపు చెన్నై ఎయిర్‌పోర్ట్‌ రన్‌వేపై వరదనీరు చేరింది. దీంతో విమాన రాకపోకలకు అంతరాయమేర్పడింది. లోకల్‌ ట్రైన్స్‌ రద్దయ్యాయి..

కుండపోత వర్షాలతో తమిళనాడు రాజధాని చెన్నై నగరం అతలాకుతమవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతోపాటు ఈశాన్య రుతువవనాలు నిర్ణీత సమయానికి ముందే రాష్ట్రంలోకి ప్రవేశించడంతో చెన్నై నగరం భారీ వర్షాలతో నీట మునిగింది. గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షానికి నగరంలోని చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. వేలాదిమంది నగర వాసులు వరదల్లో చిక్కుకున్నారు.

ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో తమిళనాడులో వరద పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు.

తిరువళ్లూరు, కడలూరు, విల్లుపురం, పుదుచ్చేరిలో భారీ వర్షపాతం నమోదైంది. రోడ్లపై నిలిచిన వరదనీటిని మోటార్లతో తొలగిస్తున్నారు సిబ్బంది. భారీ వర్షాలు, వరదలకు అల్లాడిపోతున్న ప్రాంతాల్లో సహాయకచర్యలు ముమ్మరం చేశారు అధికారులు.

ఇక కడలూరు జిల్లాలో వరద విధ్వంసం సృష్టిస్తోంది. శ్రీ ముష్ణం శ్రీ నేదుంచేరి-పావలంగుడి గ్రామాలకు వెళ్లే వంతెనపై నుంచి వరద పోటెత్తుతోంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రమాదకర పరిస్థితుల్లో వంతెన దాటుతున్నారు మహిళలు. 19 జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Nov 2021 05:32 PM (IST)

    తమిళనాడులో అత్యంత భారీ వర్షాలు..

    రాష్ట్రంలో నవంబర్‌ 10,11 తేదీల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. ఈ నెల 9న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని, ఈ కారణంగా తమిళనాడుతో పాటు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

  • 08 Nov 2021 05:29 PM (IST)

    భారీగా మోహరించిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు..

    చెన్నైలో రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురియనున్నాయన్న నేపథ్యంలో మదురై జిల్లాలో 44 మంది నేషనల్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (ఎన్డీఆర్‌ఎఫ్‌) సభ్యులను మోహరించారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా వారి సేవలను వినియోగించుకోనున్నారు.

     


  • 08 Nov 2021 05:24 PM (IST)

    భారీగా పవర్‌ కట్‌..

    చెన్నైలో కురుస్తోన్న వర్షాల కారణంగా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా కొన్ని ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా నిలిపివేశామని రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి వి. సెంథిల్‌బాలాజీ తెలిపారు. ఇందులో భాగంగా చెన్నై పవర్‌ సప్లై మొత్తం 44.50 లక్షల కనెక్షన్లకు గాను 12,297 కనెక్షకు విద్యుత్‌ సరఫరాను నిలిపి వేశారు. రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తోన్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

  • 08 Nov 2021 03:55 PM (IST)

    రానున్న 48 గంటల్లో చెన్నైలో వాతావరణం ఎలా ఉండనుందంటే..

    చెన్నై రాగల 48 గంటలపాటు ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశాలున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షం, మరి కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఇక కనిష్టంగా 24 డిగ్రీల సెల్సియస్‌, గరిష్టంగా 26 డిగ్రీల సెల్సియస్‌ నమోదలయ్యే అవకాశాలున్నాయి.

  • 08 Nov 2021 03:22 PM (IST)

    వర్షం దాటికి కూలిన గోడ..

    చైన్నైలో వర్షం బీభత్సాన్ని సృష్టిస్తోంది. ఎడతెరపిలేకుండా కురుస్తోన్న వర్షానికి రోడ్లన్నీ జలమయంగా మారాయి. ఇక వీధులు నదులను తలపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పెరంబూర్‌ రోడ్డులోని ఎస్‌పీఆర్‌ అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌ సరిహద్దు గోడ కూలిపోయింది.

  • 08 Nov 2021 03:18 PM (IST)

    నేరుగా రంగంలోకి దిగిన సీఎం..

    చెన్నైలో కురుస్తోన్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేసింది. నేరుగా రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రజలకు సహాయాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలోనే రాయపురం ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న ప్రజలకు పాలు, బ్రెడ్లతో పాటు నిత్యవసర సరుకులను అందించారు.

  • 08 Nov 2021 02:02 PM (IST)

    19 జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు..

    19 జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. అదే సమయంలో 17 జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించారు అధికారులు. కన్యాకుమారి, కాంచీపురం, మధురైలోనూ భారీ వర్షాలు కురవడంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. చెన్నై నగరమంతా మోకాటి లోతు నీరు నిలవడంతో.. లోకల్ రైళ్లను రద్దు చేసింది రైల్వే శాఖ. చెన్నై, తిరువళ్ళూరు, చెంగల్ పట్టు జిల్లాలల్లో హైఅలెర్ట్ నడుస్తోంది.

  • 08 Nov 2021 02:02 PM (IST)

    రెయిన్‌కోట్ ధరించి సహాయ చర్యల్లో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్..

    ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రెయిన్‌కోట్ ధరించి సహాయ సామగ్రిని పంపిణీ చేస్తూ కనిపించారు. భారీ వర్షాల కారణంగా చెన్నై, తిరువళ్లూరు, చెంగల్‌పేట, కాంచీపురం జిల్లాల్లోని పాఠశాలలకు రెండు రోజుల సెలవులు ప్రకటించారు స్టాలిన్. ఆయన ఈరోజు 8 ప్రాంతాల్లో పరిస్థితిని సమీక్షించి, బాధిత ప్రజలకు సహాయాన్ని పంపిణీ చేస్తారు.

  • 08 Nov 2021 02:00 PM (IST)

    కొద్దిగా శాంతించిన వరుణ దేవుడు..

    నిన్న చెన్నై నగరాన్ని అతలాకుతలం చేసిన వర్షం.. ఈ రోజు వరుణ దేవుడు కొద్దిగా  శాంతించాడు. దీంతో చెన్నైకి సమీప ప్రాంతాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఆదివారం వరకు 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. ఈ ఉదయం 5:30 గంటల వరకు 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అయితే, ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

  • 08 Nov 2021 12:59 PM (IST)

    నిండు కుండల్లా పుళల్, చెంబరకపాలెం రిజర్వాయర్లు

    పుళల్, చెంబరకపాలెం రిజర్వాయర్లు నిండు కుండల్లా మారడంతో.. గేట్లు ఎత్తేసే పరిస్థితి. ఈ అంశాలపై సీఎం స్టాలిన్ సమీక్షించారు. ఇక జలదిగ్బంధంలో చిక్కిన ప్రాంతాలను సందర్శించి తక్షణ సహాయక చర్యలకు ఆదేశించారు స్టాలిన్.

  • 08 Nov 2021 12:58 PM (IST)

    పడవల్లా మారి నీటిపై తేలియాడుతున్న కార్లు..

    రోడ్ల మీదుగా ప్రవహిస్తున్న వరదనీటి ప్రవాహానికి.. భారీ చెత్త డబ్బాలు.. పడవల్లా మారి నీటిపై తేలియాడుతూ దూసుకెళ్తున్నాయి. ఇక కార్ల సంగతి సరే సరే. నిండా మునిగిన కార్ల రిపేర్లకు ఎంతవుతుందో ఆ మెకానిక్కులకే ఎరుక. చెన్నై ఎయిర్ పోర్టులోనూ వరద బీభత్సమే. రన్ వేపైకి నీళ్లు రావడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

  • 08 Nov 2021 12:57 PM (IST)

    నానా పాట్లు పడుతోంది చెన్నై మహానగరం..

    భారీ వర్షాల కారణంగా.. నానా పాట్లు పడుతోంది చెన్నై మహానగరం.. మేం గత కొన్నాళ్లుగా రైన్ డ్రైన్స్ రిపేరు చేయించమని మొత్తున్నామనీ.. మీరలా చేయక పోవడం వల్ల ఇప్పుడు మా ఇళ్లన్నీ నీట మునిగాయని వాపోవడం ఇక్కడి జనం వంతు అవుతోంది.

  • 08 Nov 2021 12:54 PM (IST)

    చెన్నై , పుదుచ్చేరితో సహా 10 జిల్లాలకు రెడ్ అలెర్ట్

    తమిళనాడు వాతావరణ అప్‌డేట్ : ఉత్తర కోస్తా, తమిళనాడులో మరిన్ని వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో తమిళనాడుతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ తాజా వెదర్ బులిటన్‌లో పేర్కొంది. మంగళ, బుధవారాల్లో మరోసారి వర్షాలు కురుస్తాయని తెలిపింది. చెన్నై , పుదుచ్చేరితో సహా 10 జిల్లాలకు రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.

     

  • 08 Nov 2021 12:45 PM (IST)

    జలదిగ్బంధంలో సీఎం స్టాలిన్ నియోజకవర్గం..

    జలదిగ్బంధంలో సీఎం స్టాలిన్ నియోజకవర్గం చిక్కుకుంది. కొలత్తూరులోని పలు లోతట్టు ప్రాంతాల్లో చేరిన వర్షపు నీరుతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లలోకి నీరు చేరడంతో తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళుతున్నారు స్థానికులు. 2015 తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో వరద వచ్చాయని నియోజకవర్గ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే ప్రభుత్వ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రత్యేక సహాయ గ్రూపులు రంగంలోకి దిగాయి.

  • 08 Nov 2021 11:37 AM (IST)

    సీఎం స్టాలిన్‌తో మాట్లాడిన ప్రధాని మోడీ..

    ఈ మేరకు ప్రధాని మోడీ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.  రెస్క్యూ, రిలీఫ్‌ పనుల్లో కేంద్రం నుంచి అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

  • 08 Nov 2021 11:29 AM (IST)

    1976 తర్వాత ఇప్పుడే..

    వాతావరణ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎస్ బాలచంద్రన్ పలు కీలక విషయాలను వెల్లడించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ..  1976 తర్వాత ఇంత పెద్ద ఎత్తున వర్షాలు కురవడం ఇదే తొలిసారి అని అన్నారు. 1976లో 45 CMల అత్యధిక వర్షపాతం నమోదైందని.. ఆ తర్వాత 1985లో చెన్నైలో రెండు వేర్వేరు తేదీల్లో 25 సీఎంలు, 33 సీఎంలు వర్షపాతం నమోదైందని తెలిపారు. అయితే..  ఆ తర్వాత 2015లో చెన్నై నగరంలో 25 సిఎం వర్షపాతం నమోదైందన్నారు. అదే స్థాయిలో వర్షపాతం రికార్డు అయినట్లుగా పేర్కొన్నారు. గతంలో ఈశాన్య రుతుపవనాల సమయంలో నవంబర్‌లో ఇటువంటి జల్లులు నమోదయ్యాయి. 

  • 08 Nov 2021 11:24 AM (IST)

    వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం స్టాలిన్..

    భారీ వర్షాల దృష్ట్యా సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆదేశించారు. అధికారులతో ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించారు. 2015 వరదలను దృష్టిలో ఉంచుకుని వరద ప్రాంతాల్లో సహాయక చర్యలను పర్యవేక్షించారు. కొలత్తూరు, పెరంబూర్, పురశైవలకం, కొసాపేట్, ఓటేరిలను సందర్శించిన స్టాలిన్ సమీపంలోని పాఠశాలలో బస చేసిన బాధిత ప్రజలకు ఆహారం, సహాయ సామగ్రిని పంపిణీ చేశారు.

  • 08 Nov 2021 11:19 AM (IST)

    వరదలకు అల్లాడిపోతున్న జనం..

    తిరువళ్లూరు, కడలూరు, విల్లుపురం, పుదుచ్చేరిలో భారీ వర్షపాతం నమోదైంది. రోడ్లపై నిలిచిన వరదనీటిని మోటార్లతో తొలగిస్తున్నారు సిబ్బంది. భారీ వర్షాలు, వరదలకు అల్లాడిపోతున్న ప్రాంతాల్లో సహాయకచర్యలు ముమ్మరం చేశారు అధికారులు. చెంబరబాక్కం, పూండి, పుళల్‌ రిజర్వాయర్ల నుంచి భారీగా వరదనీరు పోటెత్తుతోంది. దీంతో రవాణా స్తంభించిపోయింది. ఉత్తర, దక్షిణ చెన్నై నీటమునిగిపోయాయి. కడలూరు జిల్లాలో వరద విధ్వంసం సృష్టిస్తోంది. శ్రీ ముష్ణం శ్రీ నేదుంచేరి-పావలంగుడి గ్రామాలకు వెళ్లే వంతెనపై నుంచి వరద పోటెత్తుతోంది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రమాదకర పరిస్థితుల్లో వంతెన దాటుతున్నారు స్థానికులు.

  • 08 Nov 2021 11:18 AM (IST)

    విద్యార్థులకు సెలవులు..

    ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తమిళనాడులోని పలు జిల్లాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. దీంతో ఆయ జిల్లా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. పుదుచ్చేరి, కారైకల్ రీజియన్‌లలోని పాఠశాలలను నవంబర్ 8 మరియు 9 తేదీలలో మూసివేయనున్నట్లు పుదుచ్చేరి విద్యాశాఖ అధికారులు తెలిపారు.  9 నుండి 12 తరగతుల విద్యార్థులకు సెలవులను ప్రకటించారు.

  • 08 Nov 2021 11:14 AM (IST)

    రాగల 24 గంటల్లో కోస్తా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు తీరంలో..

    మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది వాతావరణ శాఖ. చెన్నై తీర ప్రాంత జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ ప్రకటించింది. రాగల 24 గంటల్లో కోస్తా ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు తీరంలో భారీ నుండి అతి భారీ గాలులు వీచే అవకాశం ఉంది. ఈశాన్య రుతుపవనాల కారణంగా నవంబర్ 9 నుండి నవంబర్ 11 వరకు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తాయని IMD అంచనా వేసింది. కోయంబత్తూర్‌లో సాధారణంగా ఆకాశం మేఘావృతమై భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.

     

  • 08 Nov 2021 11:09 AM (IST)

    నదులను తలపిస్తున్న చెన్నై నగరం..

    జనజీవనం అస్తవ్యస్తమైంది. చెన్నై వీథులు నదులను తలపిస్తున్నాయి. చెంబరబాక్కం, పూండి, పుళల్‌ రిజర్వాయర్ల నుంచి భారీగా వరదనీరు పోటెత్తుతోంది. దీంతో రవాణా స్తంభించిపోయింది. ఉత్తర, దక్షిణ చెన్నై నీటమునిగిపోయాయి.

  • 08 Nov 2021 11:05 AM (IST)

    కుండపోత వర్షాలతో చెన్నై నగరం అతలాకుతలం..

    కుండపోత వర్షాలతో తమిళనాడు రాజధాని చెన్నై నగరం అతలాకుతమవుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతోపాటు ఈశాన్య రుతువవనాలు నిర్ణీత సమయానికి ముందే రాష్ట్రంలోకి ప్రవేశించడంతో చెన్నై నగరం భారీ వర్షాలతో నీట మునిగింది.

Follow us on