
కొంత మంది డబ్బు కోసం ఎంత నీచానికైనా దిగజారుతారు. కావాల్సిన వారిని కూడా వదిలపెట్టరు. ఈజీ మనీ కోసం హనీట్రాప్ లు, బ్లాక్ మెయిల్ చేస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఎదుటి వ్యక్తి బలహినతే.. వీరి బలం. ఇలాంటి కీచకుల వేధింపులు భరించలేక ఇప్పటికే చాలా మంది ప్రాణాలు తీసుకున్నారు. ఇప్పుడు అటువంటి ఘటనే జరిగింది. ఫ్రెండ్సే ఓ వ్యక్తిని వేధించారు. ఏకంగా ఏడాదిన్నర పాటు వారి వేధింపులను భరించిన సదరు వ్యక్తి చివరకు ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన ముంబైలో జరిగింది. ముంబైలోని యశ్వంత్ నగర్‌లో ఉండే రాజ్ లీలా అనే వ్యక్తి చార్టర్డ్ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. అయితే ఓ ప్రైవేట్ వీడియోను అడ్డుపెట్టుకుని అతడిని 18 నెలలుగా రాహుల్, సభా అనే ఇద్దరు వ్యక్తులు వేధింపులకు గురిచేస్తున్నారు. అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వకపోతే వీడియో సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారు. ఇలా కోట్ల రూపాయలను అతడి వద్ద నుంచి తీసుకున్నారు. వారి వేధింపులు ఎక్కువవడంతో రాజ్ ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
చనిపోయే ముందు రాజ్ సూసడ్ నోట్ రాశారు. ఆ నోట్‌లో ముందుగా తన తల్లికి క్షమాపణలు చెప్పాడు. కుటుంబాన్ని బాగా చూసుకోవాలని కోరాడు. ‘‘ నేను మీకు మంచి కొడుకును అవ్వలేకపోయాను. మిమ్మల్ని ఒంటరిగా వదిలేసి వెళ్లిపోతున్నాను. నేను చాలా చెడ్డవాడిని అంటూ రాసుకొచ్చాడు. అంతేకాకుండా తన తోటి ఉద్యోగుల గురించి కూడా ప్రస్తావించాడు. ‘‘దీపా లఖానీ.. నేను మీ నమ్మకాన్ని వమ్ము చేసినందున క్షమించండి. నన్న నమ్మండి. నా తప్పులన్నింటికీ నేనే బాధ్యుడిని. ఇందులో ఎవరికీ ఎటువంటి సంబంధం లేదు. నేను ఖాతాలను తారుమారు చేయలేదు. శ్వేత, జయప్రకాష్‌లకు ఏం తెలియదు. దయచేసి వారిపై ఎటువంటి చర్య తీసుకోకండి’’ అని రాశాడు.
చివరి పేజీలో తన ఆత్మహత్యకు ఎవరో కారణమో రాజ్ రాశాడు. ‘‘ నా ఆత్మహత్యకు రాహుల్ పర్వానీ, సభా బాధ్యులు. వారు నన్ను నెలల తరబడి నన్ను బ్లాక్ మెయిల్ చేశారు. నా నుంచి కోట్లలో డబ్బు తీసుకున్నారు’’ అని రాసుకొచ్చాడు. దీంతో పోలీసులు వారిద్దరిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తన కొడుకు చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని రాజ్ తల్లి డిమాండ్ చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..