Jamili Elections: దేశం మళ్లీ జమిలీ మూడ్‌లోకి వచ్చేసింది. ఎన్నికలు జరుగుతాయో లేదోగానీ.. తాజాగా రాజ్యసభ వేదికగా కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుతం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల్లో కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు కీలక ప్రకటన చేశారు. జమిలి ఎన్నికల నిర్వహణ అంశం కేంద్రం పరిశీలనలో ఉందన్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు వేరు వేరుగా జరిగితే వ్యయం పెరుగుతుందన్న ఉద్దేశ్యంతో అన్ని ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలని పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫారసు చేసిందన్నారు. లోక్‌సభలో ఎంపీ ప్రదీప్ కుమార్ సింగ్ అడిగిన లిఖిత పూర్వక ప్రశ్నకు ఆయన ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ఎన్నికలు తరచూ జరగడం మూలంగా సాధారణ ప్రజా జీవితం ఇబ్బందులకు గురవడంతో పాటు.. వారికి అందే అత్యవసర సేవల పైనా ప్రభావం పడుతోందన్నారు కిరణ్ రిజిజు. దేశంలో 2014, 19 మధ్య జరిగిన రాష్ట్రాల ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం 5,814 కోట్ల నిధులు విడుదల చేసినట్లు న్యాయశాఖ మంత్రి సభలో వెల్లడించారు.
అన్ని ఎన్నికలు ఏక కాలంలో జరిగితే.. ఏటేటా వాటి నిర్వహణ వ్యయ భారం తగ్గిపోతుందని న్యాయ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం తన 79వ నివేదికలో పేర్కొందన్నారు. ఎన్నికల సంఘంతో సహా.. వివిధ భాగస్వామ్య పక్షాలతో చర్చించి పలు సిఫారసు చేసిందని తెలిపారు. ఆ విషయాన్ని మరింత లోతుగా పరిశీలించి.. జమిలి ఎన్నికలపై ఆచరణాత్మక మార్గ సూచిక, నిబంధనలు రూపొందించాలని సూచిస్తూ లా కమిషన్‌కు పంపించామని కేంద్ర మంత్రి తెలిపారు. విభిన్న వర్గాలతో సంప్రదించిన అనంతరం ఎన్నికలపై సంస్కరణపై లా కమిషన్ 244, 255 నివేదికలో సిఫారసు చేసిందన్నారు కిరణ్ రిజిజు. ఇది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
కాగా, వన్ నేషన్, వన్ ఎలక్షన్ ఆలోచన మాటలకు పరిమితం చేయలేమని.. దేశానికి అవసరమని ప్రధాని నరేంద్ర మోదీ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి.. నీతి ఆయోగ్ కూడా నివేదిక సిద్ధం చేసింది. లా కమిషన్ అభిప్రాయ సేకరణ తీసుకుంది. ఇదిలాఉంటే.. నిత్యం ఎన్నికలతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని, దీనిపై లోతైన అధ్యయనం, చర్చ జరగాలని నాటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా అనడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే… ప్రధాన పార్టీలు జమిలి ఎన్నికలకు సై అంటున్నాయి. జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలోనే తమ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇక ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ప్రకటించారు.
అయితే, జమిలి ఎన్నికల నిర్వహణకు కనీసం అయిదు రాజ్యాంగ సవరణలను చేయాలని లా కమిషన్ పేర్కొంది. వీటిని కనీసం సగం రాష్ట్రాలు ఆమోదించాల్సి ఉంటుంది. మెజారిటీ రాష్ట్రాల్లో ఎన్డీయే పాలక పక్షాలున్నాయి. రాజ్యసభలో బలం లేకపోయినా మద్దతిచ్చే పార్టీలున్నాయి. కాబట్టి రాజ్యాంగ సవరణ ద్వారా వన్ నేషన్… వన్ ఎలక్షన్‌కు ఇదే సరైన సమయం అని మోదీ భావిస్తే.. అమలు పెద్ద కష్టం కాదు. కాగా, జమిలి ఎన్నికల ఆచరణపై కాంగ్రెస్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు జరిగితేనే సాధ్యమంటోంది. అటు జమిలి ఎన్నికలను వామపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి.
Also read:
Viral Video: నువ్వు ఎలుగుబంటివైతే నాకేంటి..? ఆ పిల్లి ధైర్యం చూడాల్సిందే..!