Central Electoral Commission: కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం కీలక సమావేశం నిర్వహించనుంది. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు చేయడంపై అధికారులతో చర్చించనుంది. మార్చి మొదటి వారంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల భర్తీకి కూడా ఉప ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం భావిస్తోంది.
అసోం,కేరళ,పశ్చిమ బెంగాల్, తమిళనాడు, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మార్చి 7లోగా ఎన్నికల కమిషన్ తేదీలను ప్రకటించే అవకాశం ఉందని ప్రధాని మోడీ సూచనప్రాయంగా తెలిపారు. అలాగే మార్చి మొదటివారంలో పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీకి కూడా తేదీని ఈసీ ప్రకటించవచ్చన్నారు.అసోంలో నిర్వహించిన ఎన్నికల బహిరంగసభలో ఆయన ఈ మేరకు తెలిపారు. త్వరలో ఎన్నికలు జరుగునున్న అసోంలో నెల రోజుల వ్యవధిలో మోదీ ఇక్కడ పర్యటించడం ఇది మూడోసారి కావడం విశేషం. 2016 ఎన్నికలు కూడా ఇదే మాదిరిగా మార్చి 4 న ప్రకటించారని, ఈ ఏడాది బహుశా మార్చి 7 నాటికి ఈసీ తేదీలను ప్రకటించవచ్చునని తాను భావిస్తున్నానని మోడీ చెప్పారు.