దేశవ్యాప్తంగా గ్యాస్ పైప్‌లైన్ విస్తరణకు కేంద్రం ఆర్డర్..

దేశంలో ఇంధన సరఫరాను సమర్థవంతంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గృహాలకు నేరుగా నేచురల్ గ్యాస్ సరఫరా విస్తరణకు మార్గం సుగమం చేస్తూ కొత్త ఆర్డర్‌ను జారీ చేసింది. పైప్‌లైన్ల ద్వారా గ్యాస్ పంపిణీని పెంచి, LPGపై ఆధారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టింది.

దేశవ్యాప్తంగా గ్యాస్ పైప్‌లైన్ విస్తరణకు కేంద్రం ఆర్డర్..
Hardeep Singh Puri

Updated on: Mar 25, 2026 | 1:11 PM

దేశంలో ఇంధన సరఫరాను సమతుల్యం చేయడం, గృహాలకు గ్యాస్ అందుబాటును పెంచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక ఆర్డర్‌ను జారీ చేసింది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఈ ఆదేశాలు 1955 నాటి ఎస్సెన్షియల్ కమోడిటీస్ చట్టం ఆధారంగా అమల్లోకి వచ్చాయి. దేశంలో సహజ వాయువు (నేచురల్ గ్యాస్) సరఫరాను పైప్‌లైన్ల ద్వారా పెంచితే LPGపై ఆధారం తగ్గుతుందని కేంద్రం భావిస్తోంది. ప్రస్తుతం గ్యాస్ పైప్‌లైన్ సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో కూడా వినియోగదారులు LPGనే ఎక్కువగా వినియోగిస్తున్న పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిని మార్చేందుకు ఈ ఆర్డర్ ద్వారా చర్యలు చేపట్టారు. గ్యాస్ పైప్‌లైన్ వ్యవస్థ విస్తరణలో అనేక అడ్డంకులు ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది. భూమి అనుమతులు, అధిక ఫీజులు, వివిధ సంస్థల నుంచి అనుమతులలో జాప్యం, కొన్నిసార్లు భూమి యాక్సెస్ నిరాకరణ వంటి సమస్యలు ప్రాజెక్టుల అమలును ఆలస్యం చేస్తున్నాయి. ఈ సమస్యలను తొలగించేందుకు ఒకే విధమైన విధానాన్ని తీసుకువచ్చింది.

ఇక అంతర్జాతీయ పరిస్థితులు కూడా ఈ నిర్ణయానికి కారణమయ్యాయి. గల్ఫ్ ప్రాంతాల్లో ఉత్పత్తి అంతరాయం, స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ వద్ద జరిగే ఆటంకాలు వంటి అంశాలు భారతదేశానికి ఇంధన సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి. దీర్ఘకాలిక ఇంధన భద్రత కోసం ఒకే వనరుపై ఆధారాన్ని తగ్గించి, ఇంధన వనరులను విభిన్నీకరించడం అవసరమని కేంద్రం పేర్కొంది. ఈ ఆర్డర్ ప్రకారం గ్యాస్ పైప్‌లైన్ నిర్మాణం, నిర్వహణ, విస్తరణకు సంబంధించిన పనులు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు చేపట్టవచ్చు. కేంద్ర ప్రభుత్వం అనుమతించిన సంస్థలను ‘అథరైజ్డ్ ఎంటిటీస్’గా నిర్వచించింది. వీరు ప్రధాన పైప్‌లైన్‌ల నుంచి చిన్న పైప్‌లైన్‌ల ద్వారా గృహాలకు గ్యాస్ సరఫరా చేసే బాధ్యత వహిస్తారు.

ఈ ఆదేశాలు పబ్లిక్, ప్రైవేట్ ప్రాంతాలన్నింటికీ వర్తిస్తాయి. గ్యాస్ పైప్‌లైన్ వేయడంలో ఉన్న అనుమతుల ప్రక్రియను సులభతరం చేయడం, భూమి యాక్సెస్ సమస్యలను తగ్గించడం ద్వారా ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆర్డర్ గెజిట్‌లో ప్రచురితమైన తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. దేశవ్యాప్తంగా గ్యాస్ పైప్‌లైన్ నెట్‌వర్క్ విస్తరణకు ఇది ఊతమిస్తుందని, గృహాలకు నేరుగా గ్యాస్ సరఫరా పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.

Also Read: మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. నగరాల్లో అతి తక్కువ ధరకే హాస్టల్స్‌లో ఉండొచ్చు! 

Follow Us