హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన దిశ ఘటన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. మహిళలకు రక్షణ కల్పించేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో రాత్రి సమయాల్లో మహిళలు గమ్యస్థానానికి చేరుకునేందుకు పోలీసులే పలు ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేశారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో మహిళల భద్రత కోసం ఆప్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఢిల్లీ నగరంలో తిరిగే ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్, క్లస్టర్ బస్సుల్లో సీసీ కెమెరాలు, పానిక్ బటన్‌లను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. అంతేకాదు.. ఈ బస్సులకు జీపీఎస్ అనుసంధానం చేయబోతున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ప్రతి బస్సులో 3 సీసీ కెమెరాలు, 10 పానిక్ బటన్‌లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. ఢిల్లీలోని మొత్తం 5500 బస్సుల్లో వీటిని అమర్చుతామన్నారు.
తొలుత పైలట్ ప్రాజెక్టుగా.. ఈ నెలాఖరులోపు 100 బస్సుల్లో సీసీ కెమెరాలు, పానిక్ బటన్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. ఇక మిగిలిన బస్సుల్లో.. ఏడు నెలల్లోగా అమర్చుతామని పేర్కొన్నారు. అంతేకాదు బస్ స్టాప్‌లలో ప్రయాణికులు బస్సుల వివరాలు తెలియజేసే సరికొత్త యాప్‌ను కూడా తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఈ యాప్‌తో.. బస్సు ఎక్కడ ఉంది అన్న విషయం యాప్ ద్వారా తెలుసుకోవచ్చని..అతి త్వరలోనే ఈ యాప్‌ను లాంచ్ చేయనున్నట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు.