నమ్మినోళ్లను నట్టేట ముంచే సచ్చు సన్నాసులు ఒకరా ఇద్దరా… తాజాగా ఆ కోవలో తమిళనాడులో ఓ డేరాబాబా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాడు. అతగాడి పేరు మునుస్వామి. తిరువళ్లూరులో ఆశ్రమం రన్ చేస్తుంటాడితను. గ్రహదోషాలు, పీడ-చీడ వంటి మూఢనమ్మకాలను నమ్మే భక్త జనాలేమునుస్వామికి రాబడి యంత్రాలు. బిజినెస్ బాగా గిట్టుబాటయి రెండోచోట్ల ఆశ్రమ దుకాణాలు తెరిచాడితను. 2021లో జరిగిన ఓ ఘటనతో మునుస్వామిపై ఆరోపణలు వెల్లువెత్తాయి.ఆ దుర్మార్గమే ఆశ్రమంలో ఓ యువతిపై అత్యాచారం. హేమమాలిని అనే డిగ్రీ స్టూడెంట్‌కు ఆరోగ్యం బాగోలేకపోవడంతో గ్రహదోషం కారణమనుకున్నారు పేరెంట్స్. ఎవరో చెప్తే మునుస్వామి ఆశ్రమానికి తీసుకెళ్లారు. ఇంకేం వుంది..ఆశ్రమంలోకి వెళ్లగానే హూం ..హోం హా హాకారాలు. చుట్టూ కట్టుబానిసలు.. మంచి జరుగుతుందనే నమ్మకంతో వచ్చిన సగటు మనుషులు. అదిరేటి గెటప్..మాయామశ్చింద్ర అంటూ కనికట్టు లీలలు.. లోనికి వెళ్తే సాములోరి మాయలో పడాల్సిందే. అలాగని అందర్నీ కనికరించడు. తన కంటపడ్డవాళ్లను ..ముఖ్యంగా మహిళల్ని ఇలా ట్రీట్ చేస్తాడు…..ఆరోగ్యం బాగోలేదని వెళ్తే ఇలాగే వెకిలి వేషాలేశాడు. భయమో భక్తో ఎవరూ ప్రతిఘటించరు. అదే దొంగ సన్నాసులకు అలుసు.
మునుస్వామి నిర్వాకం కూడా అంతే అనే అనుమానాలు, ఆరోపణలు వెల్లువెత్తాయి ఏడాది కిందట. సూడ్డానికి వయసులో పెద్దమనిషే. కానీ అతను చేసిన నిర్వాకం ఏంటో లేటెస్ట్‌గా రూడీ అయింది. ఎంతో ఉజ్వల భవిష్యత్ వున్న హేమమాలిని అనే విద్యార్ధిని అర్ధాంతర మరణానికి కారణం మునుస్వామినే అని తేలింది. నాగదోషం ..గ్రహ దోషం పేరిట అమావాస్య, పౌర్ణమి వేళలో ప్రత్యేక పూజలు చేయాలని చెప్పాడు. ఆమె ఆశ్రమంలోనే ఉండాలని కండీషన్ పెట్టాడు. హేమ ఆమె బంధువు ఆశ్రమంలోనే ఉన్నారు. మునుస్వామి పూజలతో నయం అవుతుందనే నమ్మకంతో. కానీ ఒకరోజు హేమ..ఆశ్రమంలో ఒక్కసారిగా కుప్పకూలింది. స్వామికి చెప్తే ఆటో మాట్లాడి హాస్పిటల్‌కు తరలించాడు. కానీ ఫలితం దక్కలేదు. హేమ మరణానికి కారణం అనారోగ్యం కాదు. ఆమె ఆత్మహత్య చేసుకుందని తేల్చారు పోలీసులు.
ఏం జరిగిందని ఆరా తీసిన కుటుంబసభ్యులు ..మునుస్వామి నిర్వాకమేనని పసిగట్టారు. పోలీసులను ఆశ్రయించారు. ఆశ్రమంలో యువతిపై మునుస్వామి అత్యాచారం చేశాడంటూ ఆందోళనలు భగ్గుమన్నాయి. మునుస్వామిని అరెస్ట్ చేయాలంటూ ప్రజా సంఘాలు ధర్నాకు దిగాయి. పోలీసులు అతనికి వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. దాంతో కేసును సీబీ-సీఐడీకి అప్పగించింది ప్రభుత్వం. సీబీసీఐడీ విచారణలో సంచలనాలు వెలుగులోకి వచ్చాయి. పూజలతో అనారోగ్యం నయం చేస్తానని నమ్మించిన మునుస్వామి..యువతిపై అత్యాచారానికి పాల్పడినట్టు తేలింది. ఆమెను కాలేజీకి వెళ్లనివ్వకుండా ఆశ్రమంలోనే కట్టడి చేయడం..తరుచూ వేధించడంతో మనస్తాపం చెందింది. వాడిని ఎదరించలేక ..వాడిని నమ్మే ఇంట్లోవాళ్లకు అతని దుర్మార్గం గురించి చెప్పుకోలేక చావే శరణ్యం అనుకుంది. నిజాన్ని సమాధి చేయాలనుకున్న మునుస్వామి పప్పులు ఉడకలేదు. పక్కా ఆధారాలను సేకరించిన సీబీ సీఐడీ అధికారులు.. మునుస్వామిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. భక్తి తప్పు కాదు. కానీ భక్తి పేరిట ఘోరాలకు పాల్పడే ఇలాంటి కన్నింగ్‌వాళ్ల విషయంలో తస్మాత్ జాగ్రత్త…!