Black Fungus: తెలుగు రాష్ట్రాలపై బ్లాక్ ఫంగస్ పంజా… మందుల కొరతతో రోగులకు ప్రాణ సంకటం

|

May 17, 2021 | 2:53 PM

Black fungus - Mucormycosis: తెలుగు రాష్ట్రాలను బ్లాక్‌ ఫంగస్‌ భయపెడుతోంది. ఏపీలో ముగ్గురు, తెలంగాణలో ముగ్గురు బ్లాక్ ఫంగస్ పంజాకు మృతి చెందారు. అటు బ్లాక్‌ ఫంగస్‌ నియంత్రణకు మందుల కొరత నెలకొంటున్నట్లు వైద్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Black Fungus: తెలుగు రాష్ట్రాలపై బ్లాక్ ఫంగస్ పంజా... మందుల కొరతతో రోగులకు ప్రాణ సంకటం
Black Fungus
Follow us on

తెలుగు రాష్ట్రాలను బ్లాక్‌ ఫంగస్‌ భయపెడుతోంది. ప్రాణాంతక బ్లాక్ ఫంగస్ బారినపడిన రోగులు కంటి చూపును కోల్పోతున్నారు.  ఏపీలో ముగ్గురు, తెలంగాణలో ముగ్గురు చొప్పున బ్లాక్ ఫంగస్ పంజాకు మృతి చెందారు. అటు బ్లాక్‌ ఫంగస్‌ నియంత్రణకు మందుల కొరత నెలకొంటున్నట్లు వైద్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మందుల కొరతతో రోగులు, వారి కుటుంబీకులు సతమతమవుతున్నారు. కోవిడ్‌ చికిత్స తర్వాత కోలుకున్న గుంటూరుకు చెందిన 30 ఏళ్ల యువకుడు, కర్నూలు ఆసుపత్రిలో కొవిడ్‌ చికిత్స తీసుకొని కోలుకున్న60 ఏళ్ల వృద్ధుడు…తర్వాత బ్లాక్‌ఫంగస్‌ లక్షణాలతో మళ్లీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు. కర్నూలుకు చెందిన మరో యువకుడు హైదరాబాద్‌ ఆస్పత్రిలో బ్లాక్‌ ఫంగస్‌తో మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లాలో ఇద్దరు బ్లాక్‌ ఫంగస్‌ రోగులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఇటీవలే పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన అంజిబాబు కరోనా నుంచి కోలుకున్నారు. ఆతని ఓ కన్ను వాచిపోవటంతో బ్లాక్ ఫంగస్ లక్షణాలుగా వైద్యులు ధృవీకరించారు.

తెలంగాణలో ఖమ్మం, నిర్మల్‌ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున బ్లాక్‌ ఫంగస్‌తో మృతి చెందారు. అలాగే కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం గిద్ద గ్రామానికి చెందిన గురజాల అంజల్ రెడ్డి (42) కూడా బ్లాక్ ఫంగస్ తో మృతి చెందారు. గతనెల 23వ తేదీన నిజామాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కరోనాతో చేరిన అంజల్ రెడ్డి..12 రోజుల పాటు చికిత్స పొందిన తరువాత తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. దీంతో ఈ నెల 10వ తేదీన హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు ఈనెల 11వ తేదీన అంజల్ రెడ్డికి దవడ, కన్నును వైద్యులు తొలగించారు. అనంతరం చికిత్స పొందుతూ అంజల్‌ రెడ్డి మృతి చెందారు.

గాంధీ ఆస్పత్రిలో మరో ముగ్గురు కరోనా రోగుల్లోనూ బ్లాక్ ఫంగస్ ఉన్నట్లు గుర్తించారు. వారిలో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉండగా, ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ తరహా లక్షణాలతో వైద్యం కోసం మరికొందరు ప్రైవేటు ఆస్పత్రిలలో చేరుతున్నారు. నిర్మల్‌ జిల్లాకే చెందిన మరో ఐదుగురు బ్లాక్ ఫంగస్‌తో బాధపడుతున్నట్లు సమాచారం. అందులో కుబీర్ మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి కూడా ఉన్నట్లు సమాచారం.

Black Fungus

తెలంగాణ డీఎంఈ రమేశ్ రెడ్డి వివరణ ఇలా..
గాంధీ ఆసుపత్రిలో మూడు బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నట్లు తెలిపిన తెలంగాణ డీఎంఈ రమేశ్ రెడ్డి..ఈ కేసులు ప్రైవేటు ఆసుపత్రి నుంచి వచ్చాయని తెలిపారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో ఏడు బ్లాక్ ఫంగస్ కేసులు ఉన్నాయనడంలో వాస్తవం లేదని తెలిపారు.

మందుల కొరత..
బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి నియంత్రణకు మందుల కొరత అంటున్నారు వైద్యులు. ఈ వ్యాధి చికిత్స కోసం పొసాకోనాజోల్‌ మాత్రలు,లిపోసోమల్‌ యాంఫోటెరిసిన్‌-బి ఇంజక్షున్లు వాడతారు. తాజాగా కేసులు పెరగటంతో లిపోసోమల్‌ యాంఫోటెరిసిన్‌-బి ఇంజక్షున్లకు డిమాండ్‌ పెరిగింది. తగిన స్దాయిలో ఉత్పత్తి లేక పోవటంతో రోగులకు సరిగా అందటం లేదంటున్నారు వైద్యులు.

మహారాష్ట్రలో..
ఆ రాష్ట్రంలో 2వేలకు పైగా కొవిడ్ బాధితులకు బ్లాక్ ఫంగస్ సోకింది. కొవిడ్ కేసులు పెరిగితే బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ బాధితులు పెరిగే అవకాశముంది. బ్లాక్ ఫంగస్ బాధితులకు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీరికి చికిత్స కోసం స్థానిక మెడికల్ కళాశాలలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులను ఉపయోగిస్తోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. గతవారంలో.. మహారాష్ట్రలో బ్లాక్ ఫంగల్ ఇన్ ఫెక్షన్ కారణంగా 8మంది కొవిడ్ పేషెంట్లు మరణించారని రాష్ట్ర ప్రభుత్వ అధికారి మీడియాకు తెలిపారు. అంతేకాక, మరో 200 మంది బ్లాక్ ఫంగల్ సోకిన కొవిడ్ పేషెంట్లకు చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు. 12-5-2021న.. థానె జిల్లాలో బ్లాక్ ఫంగస్ కారణంగా ఇద్దరు మృతి చెందగా…జిల్లాలోని ఆసుపత్రుల్లో మరో ఆరుగురు రోగులు చికిత్స పొందుతున్నారు.

ఒడిశాలో…
10-5-2021న.. ఒడిశాలో తొలి బ్లాక్ ఫంగస్ కేసు నమోదయ్యింది.

రాజస్థాన్ లో…
గత 12 గంటల్లో రాజస్థాన్ రాజధాని జైపూర్ లో 14 మందికి బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ వచ్చింది. (వీరిలో జార్ఖంగ్ నుంచి వచ్చిన వారు ఇద్దరుండగా, యూపీకి చెందిన వారు ఐదుగురు రాజస్థాన్ కు చెందిన వారు నలుగురు, ముగ్గురు ఎన్సీఆర్ ఢిల్లీ నుంచి వచ్చినవారు ఉన్నారు)

మధ్యప్రదేశ్ లో..
మధ్యప్రదేశ్ లో ఇప్పటికే బ్లాక్ ఫంగస్ సోకిన ఇద్దరు పేషెంట్లు మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 13 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదకాగా… వీరి చికిత్స విషయమై అమెరికా వైద్య నిపుణులతో ఆ రాష్ట్ర ప్రభుత్వ వైద్యులు సంప్రదింపులు జరుపుతున్నారు.

గుజరాత్ లో…
8-5-2021న.. గుజరాత్ లోని అహ్మదాబాద్ ఆసుపత్రిలో బ్లాక్ ఫంగస్ కు గురైన కోవిడ్ బాధితులు గుర్తించారు. గత 20 రోజుల్లో ఈఎన్ టీ వార్డులో 67మంది ఫంగల్ బాధితులను గుర్తించామని బీజే మెడికల్ కాలేజీ, సివిల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ కల్పేష్ పటేల్ వెల్లడించారు.
11-5-20201నాటికి గుజరాత్ లో 100కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి.వీరిలో ఇన్ఫెక్షన్ కారణంగా కొందరు రోగులు అంధులయ్యారు. అహ్మదాబాద్, వడోదరా, సూరత్, రాజ్ కోట్, భావ్ నగర్, జామ్ నగర్ ప్రాంతాల్లో ఇన్ఫెక్షన్ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వైద్యుల వెల్లడించారు.

కర్నాటకలో..
13-5-2021న..కర్నాటక రాజధాని బెంగళూరులో కొవిడ్ చికిత్స పొందుతున్న 33 మందికి బ్లాక్ పంగస్ ఇన్ఫెక్షన్ సోకినట్లు తేలింది. వీరికి పలు ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నట్లు బృహత్ బెంగళూరు నగర పాలిక ఆరోగ్య అధికారి విజయేంద్ర వెల్లడించారు. బ్లాక్ ఫంగస్ ను ముందుగా గుర్తించి యాంటి ఫంగల్ మందులతో వైద్యం అందిస్తే… బాధితుల ప్రాణాలను రక్షించవచ్చని అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది.

ఈ లక్షణాలుంటే.. బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లే..

కంటి కింద నొప్పి, ముఖంలో ఒకపక్క వాపు, తలనొప్పి, జ్వరం, ముక్కు దిబ్బడ, పాక్షికంగా దృష్టి లోపం వంటివి ప్రారంభంలో కన్పించే లక్షణాలు. ఇన్ఫెక్షన్ ముదిరితే.. కంటి చుట్టూ ఉండే కండరాలను స్తంభింపజేసి.. అంధత్వం వచ్చే ప్రమాదముంది. ఇన్ఫెక్షన్‌ మెదడుకు పాకితే మెనింజైటిస్ కు దారితీస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రారంభదశలోనే బ్లాక్ ఫంగస్ ను గుర్తించకుంటే ప్రాణాపాయానికి దారితీస్తుందంటున్న వైద్యులు హెచ్చరిస్తున్నారు. బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో మరణాల రేటు 50 శాతంగా ఉంది.

బ్లాక్ ఫంగస్ ఎక్కడిదంటే..
డాక్టర్లు, శాస్త్రవేత్తలు ‘బ్లాక్ ఫంగస్’గా పేర్కొంటున్న మ్యూకోర్‌మైకోసిస్‌ ఒక అరుదైన, ప్రమాదకరమైన ఫంగస్ ఇన్ఫెక్షన్. వాతావరణంలో ఉండే మ్యూకోర్మోసైట్స్‌ ఫంగిల వల్ల కలుగుతుంది. ఈ ఫంగి(ఫంగస్ క్రిములు) కారణంగా కలిగే వ్యాధి కావడంతో దీన్ని మ్యూకోర్‌మైకోసిస్‌ అంటారు. అయితే బ్లాక్ ఫంగస్ ఒకరి నుంచి మరొకరికి సోకదని వెల్లడించారు. కొవిడ్ వైరస్ కు గురై బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్న వారిలో ‘బ్లాక్ ఫంగస్'(మ్యూకోర్ మైకోసిస్) సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్, కిడ్నీ వ్యాధులు, గుండె జబ్బులున్నవారిలో దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశముంది.

దడపుట్టిస్తున్న కరోనా మరణాలు…Watch Video

ఇది కూడా చదవండి..మొదలైన “స్పుత్నిక్‌ వి” వ్యాక్సిన్ పంపిణీ… దేశంలో టీకా కొరత తీరనుందా?

ఏపీలో క‌ర్ఫ్యూ ఈ నెలాఖ‌రు వ‌ర‌కు పొడిగింపు.. మ‌రికొన్ని కీల‌క నిర్ణ‌యాలు