Budget 2024 – Nirmala Sitharaman: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జులై 23న పార్లమెంట్‌లో 2024-25 బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మోదీ 3.0 సర్కారులో ఆమె ప్రవేశపెడుతున్న మొదటి బడ్జెట్ ఇది. మొత్తంగా చూస్తే ఆమె ప్రవేశపెడుతున్న ఏడో కేంద్ర బడ్జెట్.. ఇప్పటికే నిర్మలా సీతారామన్ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా ఐదు పూర్తిస్థాయి బడ్జెట్‌లు సమర్పించగా.. ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.. ఇప్పుడు ఆరోసారి పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశబెట్టి.. మరో రికార్డును తిరగరాయనున్నారు. ఇంతకుముందు వరుసగా ఐదు కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టిన మొరార్జీ దేశాయ్, అరుణ్‌జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్‌సిన్హా, మన్మోహన్‌సింగ్‌ను ఆమె అధిగమించనున్నారు. 1959 నుంచి 1964 వరకు ఆర్థిక మంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్ ఐదు పూర్తి బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టారు. మొత్తంగా మొరార్జీ దేశాయ్ 10సార్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఇన్నాళ్లు అత్యధిక బడ్జెట్ ప్రవేశపెట్టిన రికార్డు మొరార్జీ దేశాయ్ పేరు మీదే ఉంది. దీనిని ఎవ్వరూ బ్రేక్ చేయలేదు..
అయితే.. తాజా బడ్జెట్‌తో నిర్మలా సీతారామన్ వరుసగా ఆరుసార్లు పూర్తిస్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టి అరుదైన ఘనతను సాధించబోతున్నారు. వాస్తవానికి ఇందిరా గాంధీ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో మహిళ నిర్మలా సీతారామన్.. ప్రధాని హోదాలో ఉంటూ నాడు ఇందిరా గాంధీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. స్వతంత్ర భారతదేశంలో తొలి పూర్తిస్థాయి మహిళా ఆర్థిక మంత్రిగా ఎక్కువ కాలం కొనసాగిన నేతగా నిర్మలా సీతారామన్ ఇప్పటికే రికార్డును నమోదు చేసుకున్నారు.
వాస్తవానికి బడ్జెట్ ప్రవేశపెట్టడంలోనూ నిర్మల సీతారామన్ కొత్త పోకడలు తీసుకొచ్చారు. సంప్రదాయ బ్రీఫ్‌కేస్ విధానానికి ఆమె మంగళం పాడారు. జాతీయ చిహ్నంతో కూడిన ఖాతా పుస్తకం తరహాలో ఉండే బ్యాగులో ఆమె బడ్జెట్ పత్రాలు తీసుకొచ్చే సంప్రదాయానికి ఆమె శ్రీకారం చుట్టారు. 2019లో తొలి బడ్జెట్ నుంచి ఆమె ఖాతా బుక్ విధానాన్ని అనుసరిస్తున్నారు.
ఇప్పటి వరకు అతి సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం రికార్డు, అతి స్వల్ప ప్రసంగం రికార్డు కూడా నిర్మలా సీతారామన్ పేరిటే ఉన్నాయి. 2020లో ఆమె చేసిన బడ్జెట్ ప్రసంగం రెండు గంటల 40 నిమిషాలు సాగింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో తాత్కాలిక బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆమె చేసిన 57 నిమిషాల ప్రసంగం ఇప్పటి వరకు చేసిన ప్రసంగాల్లో అత్యల్పమైనది.
నిర్మలా సీతారామన్.. 2019లో రెండోసారి మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఆమెను కొనసాగుతున్నారు. మోదీ త్రీ పాయింట్ ఓ లో మొత్తం ఐదేళ్ల కాలానికి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ కొనసాగితే అది కూడా ఒక రికార్డవుతుంది.. ప్రస్తుతం నిర్మలా సీతారామన్ కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..