లైంగిక నేరాలు, దాడులు, వివాహేతర సంబంధాలు వంటి అంశాలపై కోర్టులు వెలువరించే తీర్పులు చాలా విచిత్రంగా ఉంటాయి. అవి కొన్ని సార్లు వివాదాస్పదంగా మారితే, మరికొన్ని సార్లు అవి అనుకూలంగానూ మారవచ్చు. చిన్నారిపై లైంగిక నేరానికి సంబంధించిన అంశంపై నాగపూర్ బెంచ్ వెలువరించిన తీర్పు అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ దోవలోనే బాంబే హైకోర్టు(Bombay High Court) ఆసక్తికర తీర్పు వెలువరించింది. పెదాలపై ముద్దుపెట్టడం, శరీరంలోని ప్రైవేట్ భాగాలను తాకడం ఐపీసీ -377 సెక్షన్ కింద అసహజ లైంగిక నేరాలు కావని సంచలనాత్మక తీర్పు వెలువరించింది. అనంతరం ఈ దాడికి పాల్పడిన వ్యక్తికి బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అనూజా ప్రభుదేశాయ్ ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు జారీచేశారు. ఓ 14 ఏళ్ల బాలుడిపై నిందితుడు ముద్దుపెట్టడం, ప్రైవేట్ భాగాలను తాకడం అనేది ఈ కేసులో ప్రధాన అభియోగం. ఈ ఘటనపై బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం, ఐపీసీ 377 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా జీవిత ఖైదు సైతం నమోదైంది. ఈ సెక్షన్ కింద బెయిల్ లభించడం కష్టం.
జస్టిస్ ప్రభు దేశాయ్ తన బెయిల్ ఉత్తర్వుల్లో లైంగిక దాడి జరిగిందన్న బాలుడి ఆరోపణలను, వైద్య పరీక్షలు ధ్రువీకరించడం లేదని అన్నారు. పొక్సో చట్టం కింద నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ఐదేళ్ల గరిష్ఠ శిక్ష మాత్రమే పడుతుందని, కాబట్టి నిందితుడు బెయిల్‌కు అర్హుడని తెలిపారు. ఈ కేసులో అసహజ శృంగారం వర్తించదని అభిప్రాయపడ్డారు.
ఎఫ్‌ఐఆర్ ప్రకారం బాధితుడి ప్రైవేట్ భాగాలను నిందితుడు తాకాడని, పెదవులపై ముద్దు పెట్టాడని అర్థమవుతోంది. కానీ నా దృష్టిలో ఇవి ప్రాథమికంగా 377 సెక్షన్ కింద నేరాలు కావు. పైగా నిందితుడు ఏడాదిగా కస్టడీలో ఉన్నాడు. విచారణ కూడా ఇప్పట్లో ప్రారంభమయ్యేలా లేదు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని నిందితుడికి బెయిల్ మంజూరు చేస్తున్నాం
– జస్టిస్ ప్రభు దేశాయ్, బాంబే హైకోర్టు
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీ చదవండి