Bullet Train Project: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం..22 వేల చెట్ల నరికివేతకు హైకోర్టు అనుమతి.. కండిషన్స్ అప్లై

|

Dec 10, 2022 | 7:14 AM

ముంబై- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం ముంబైతో పాటు పాల్ఘర్, థానే జిల్లాల్లో 50 వేలకు పైగా మడ చెట్లు అడ్డుగా ఉన్నాయని గుర్తించింది నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్. వీటిని నరికడానికి తమకు అనుమతులు కావాలంటూ 2018లో కోఆర్డినేట్ బెంచ్ ను కోరింది.

Bullet Train Project: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం..22 వేల చెట్ల నరికివేతకు హైకోర్టు అనుమతి.. కండిషన్స్ అప్లై
Bombay High Court Allows Cutting Of 22k Trees
Follow us on

పచ్చదనం, పర్యావరణం ప్రగతికి మెట్లు.. చెట్లు నాటండి.. పర్యావరణనాన్ని పరిరక్షించండి ఇవన్నీ వాతావరణ పరిరక్షణ కోసం చెప్పే స్లొగన్స్.. అయితే ఒకొక్కసారి అభివృద్ధి పనుల పేరుతో రకరకాల రీజన్స్ తో చెట్లను నరికివేస్తారు.. తాజాగా బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం వేల చెట్లు నరికివేత చేపట్టనున్నారు. ఇందుకు హైకోర్టు అనుమతులు. ఏ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది తెలుసుకుందాం..
మహారాష్ట్రలో బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం చెట్ల నరికివేత అంశం.. గత నాలుగేళ్లుగా కోర్టులో వాదనలు ప్రతివాదనలు నడుస్తున్నాయి. నేషనల్ హై స్పీడ్ రైల్వే వర్సెస్ కోర్టులుగా జరిగిన ఈ పోరాటం ముగిసింది. ముంబై పొరుగున ఉండే పాల్ఘర్, థానే జిల్లాల్లో 22 వేల మడ చెట్లను నరికివేయడానికి ఎట్టకేలకు అనుమతించింది బాంబే హైకోర్టు.

ముంబై- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం ముంబైతో పాటు పాల్ఘర్, థానే జిల్లాల్లో 50 వేలకు పైగా మడ చెట్లు అడ్డుగా ఉన్నాయని గుర్తించింది నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్. వీటిని నరికడానికి తమకు అనుమతులు కావాలంటూ 2018లో కోఆర్డినేట్ బెంచ్ ను కోరింది. ఇందుకు ఒప్పుకునేది లేదంటూ.. తిరస్కరించిందీ బెంచ్. అయితే ఇది ప్రజా ప్రయోజనానికి సంబంధించిన ప్రాజెక్టు కాబట్టి.. బాంబే హైకోర్టును సంప్రదించమని సూచించింది కోఆర్డినేట్ బెంచ్. దీంతో నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ బాంబే హైకోర్టును ఆశ్రయించింది.

గతంలో తాము యాభై వేలకు పైగా చెట్లను నరికివేయడానికి అనుమతులు కోరామనీ. ఇపుడా సంఖ్యను 22 వేలకు తగ్గించామనీ.. బాంబే హైకోర్టుకు విన్నవించుకుంది హై స్పీడ్ రైల్ కార్పొరేషన్. అంతే కాదు నరికిన చెట్లకు బదులుగా ఐదు రెట్లు ఎక్కువ మొక్కలు నాటుతామనీ హామీ ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని.. అనుమతులు పొందామనీ. చెట్ల నరికివేత ఒక్కటే తమ ప్రాజెక్టుకు అడ్డుగా ఉందన్న వాదనలు వినిపించింది- NHSRC.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. బుల్లెట్ ట్రైన్ కోసం భారీ సంఖ్యలో చెట్లను నరకడంపై ముంబై పర్యావరణ పరిరక్షణకు చెందిన ఒక ఎన్జీవో సంస్థ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. చెట్లు నరకడం వల్ల పర్యావరణంపై పడే ప్రభావాన్ని అంచనా వేయడం కష్టమనీ. ఈ ప్రాజెక్టు వల్ల ఆ ప్రాంతంలో ఎలాంటి పేలుడు కార్యక్రమాలు చేపట్టకుండా చూడాలని కోర్టును కోరింది.

వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న బాంబే హైకోర్టు.. షరతులతో కూడిన అనుమతులను జారీ చేసింది. పర్యావరణ, అటవీ, మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర తీర మండల నిర్వహణ అథారిటీ జారీ చేసిన నిబంధనలకు కట్టుబడి ఉండాలని సూచించింది ధర్మాసనం. డిసెంబర్‌ 1న రిజర్వ్‌ చేసిన ఈ తీర్పును శుక్రవారం వెల్లడి చేసింది. మొత్తం మీద బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం సుమారు 22వేల చెట్ల నరికివేతకు అనుమతి లభించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..