
దేశంలో ఉగ్రమూకల కదలికలు మొన్నటి వరకూ పోలీసులకు నిద్ర లేకుండా చేశాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు పహారాకాశాయి. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశాయి. బళ్లారి, కేరళ, ముంబాయిలో ఉగ్రదాడులను నిర్వీర్యం చేశారు. ఈ నేపథ్యంలో మొన్నటి పార్లమెంట్ స్మోక్ సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.ఇదిలా ఉంటే ఈరోజు దేశంలో పలు ప్రాంతాలకు బాంబు బెదిరింపులు వెలుగులోకి వచ్చాయి.
ఢిల్లీలోని ఇజ్రాయిల్ ఎంబసీకి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇజ్రాయెల్ ఎంబస్సీపై బాంబులు వేస్తామంటూ పోలీసులకు కొందరు ఆగంతకులు బెదిరింపు కాల్స్ చేశారు. సాయంత్రం ఆరు గంటలకు ఈ దాడుల గురించి అగ్ని మాపకశాఖ పోలీసులకు ఫోన్ చేశారు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వెనుక ఉన్న ఖాళీ స్థలంలో పేలుడు సంభవించనుందని హెచ్చరించారు. సమాచారం తెలుసుకున్న వెంటనే బాంబ్ స్క్వాడ్‌తో పాటు పోలీసు ప్రత్యేక బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అక్కడి వాస్తవ పరిస్థితిని పరిశీలించాయి. పోలీసు ఉన్నతాధికారులు చేసిన తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు, వ్యక్తులు కనిపించలేదు. దీంతో పోలీసులకు వచ్చిన ఫోన్ కాల్‌పై సమగ్ర విచారణ చేపడుతున్నారు.
ఇక ఇదే క్రమంలో ముంబాయిలో కూడా పలు ప్రాంతాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. బుధవారం మధ్యాహ్నం 1:30 గంటలకు ముంబయిలోని 11 ప్రధాన ప్రాంతాల్లో మొత్తం 11 బాంబు దాడులు జరుగుతాయని దుండగులు మెయిల్ పంపించారు. ఆర్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకుల కార్యాలయాలపై దాడులు చేస్తామని ఆర్బీఐకి మంగళవారం బాంబు బెదిరింపులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
అంతేకాకుండా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ రాజీనామా చేయాలని మెయిల్ లో బెదిరింపు సందేశం పంపించారు. మెయిల్‌లో తెలిపిన అన్ని ప్రాంతాలకు వెళ్లి పోలీసులు, బాంబు స్వాడ్ అధికారులు గాలించినా ఏమీ కనిపించలేదు. దీంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇలా బాంబు బెదిరింపులు వచ్చిన ఈమెయిల్‌కు ఖిలాఫత్ ఇండియా అనే యూజర్ పేరు ఉంది. యూజర్ ఐడీ ఎవరు, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారన్న దానిపై నిఘా పెంచారు ఇన్వెస్టిగేషన్ అధికారులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..