బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై దాడి జరగలేదని, కానీ జరిగినట్టు ఆమె అబద్దమాడుతున్నారని బీజేపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. గురువారం వారు నందిగ్రామ్ లో టైర్లు దహనం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. మమతపై ఎటాక్ జరిగినట్టు చెబుతున్న స్థలానికి దగ్గరలోని బిరూలియా బజార్ ప్రాంతంలో టైర్లు కాల్చిన కార్యకర్తల్లో ఒకరైన సుకుమార్ మైతీ మాట్లాడుతూ.. మమతపై ఎవరూ ఎటాక్ చేయలేదని, ఆమె అబధ్దమాడుతున్నారని అన్నాడు. ‘అసలు ఆమెను ఎవరూ కారు వద్ద ముందుకు తోయలేదు…ఆమె కారు డోర్ ఓపెన్ కాగానే అది దగ్గరున్న ఓ స్తంభానికి కొట్టుకుని ఆమెకు తగిలింది’ అని ఆయన చెప్పాడు. మొత్తానికి ఆమె ఆడుతున్నదంతా నాటకం అన్న రీతిలో ఆయన మాట్లాడాడు. అటు-పుర్బా మెడిని పూర్ జిల్లా మేజిస్ట్రేట్ విభు గోయెల్, ఎస్ పీ ప్రవీణ్ ప్రకాష్ గురువారం ఈ బజార్ ను విజిట్ చేసి నిన్న జరిగిన ఘటనపై స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. కాగా-ఈ దాడికి బీజేపీయే కారణమని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది.
మమతా బెనర్జీ అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ బీజేపీ నేతలు కొందరు కోల్ కతా లో ఎన్నికల కమిషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అసలు ఈ సంఘటనపై ఉన్నతస్థాయి ఇన్వెస్టిగేషన్ జరపాలని వారు డిమాండ్ చేశారు. నిజంగా దాడి జరిగి ఉంటే డ్యూటీలో నిర్లక్ష్యం వహించిన పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలని కూడా వారు కోరారు. ఇప్పటికే పలువురు రాష్ట్ర బీజేపీ ముఖ్య నాయకులు కూడా ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు బయటకు రావలసిందే అని వారు ముక్తకంఠంతో వ్యాఖ్యానించారు. ఇలా ఉండగా టీఎంసీ నేతలు మాత్రం ఈ దాడికి బీజేపీ కారణమని ఆరోపిస్తున్నా..మరి దర్యాప్తు జరపాలని ఎందుకు కోరడంలేదనే వ్యాఖ్యలు వినవస్తున్నాయి. ఎన్నికల వేళ ఈ వ్యవహారమంతా రాష్ట్రమంతా హాట్ టాపిక్ గా మారింది.
మరిన్ని చదవండి ఇక్కడ :