
Tamil Nadu elections: తమిళనాడు అసెంబ్లీలో కాలుపెట్టాలని రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కమలనాధులకు కాలం కలిసి వచ్చింది. అక్కడి అధికార అన్నాడీఎంకేను చాలా కాలంగా చేరదీసిన బీజేపీ అక్కడ బలపడటం కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. అక్కడ ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం బీజేపీ చెప్పినట్టే చేశారు అనేది బహిరంగ రహస్యం. ఎలాగైనా తమిళనాడులో కమలం ముద్ర పడాలని విశ్వప్రయత్నాలు చేస్తూ వచ్చింది బీజేపీ. ఎట్టకేలకు ఆ ప్రయత్నాలు ఫలించాయి. ఈసారి ఎన్నికల్లో 4 సీట్లలో విజయం సాధించింది భారతీయ జనతా పార్టీ. ఎన్నికల ప్రచారం సమయంలో ఎలాగైనా తమిళనాడు అసెంబ్లీలో ఈసారి కాలుపెట్టి తీరుతాం అని చెబుతూ వచ్చారు కమలనాధులు. కనీసం ఒక్క సీటైనా గెలిచి తీరుతాం అంటూ చెప్పుకొచ్చారు. వారి ఆశలు నెరవేరాయి.. ఇప్పుడు ఒకటి కాదు నాలుగు స్థానాల్లో విజయం సాధించి ఇరవై ఏళ్ల తరువాత తమిళనాడు అసెంబ్లీలో అడుగుపెడుతోంది బీజేపీ.
నాలుగేళ్ళుగా అన్నాడీఎంకే పార్టీని కాపాడుకుంటూ వచ్చిన బీజేపీ.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీతో పొత్తులో భాగంగా 60 సీట్లు అడిగింది. అయితే, చివరికి 20 స్థానాలలో బీజేపీ పోటీ చేసేందుకు ఇరుపక్షాల మధ్య అంగీకారం కుదిరింది. ఇక ఈ ఎన్నికల్లో తమిళనాడు మీద బీజేపీ గట్టిగానే ఫోకస్ పెట్టింది. ప్రధాని మోడీ, అమిత్ షాతో పాటూ పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో ప్రచారమ చేశారు. ఇక ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ తీర్థం పుచ్చుకున్న సినీనటి కుష్బూ కూడా పార్టీ ప్రచారంలో చురుకుగానే వ్యవహరించారు. అయితే, ఆమె ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు.
తెలుగువారైన పార్టీ కోర్‌కమిటీ సభ్యులు పొంగులేటి సుధాకరరెడ్డి అభ్యర్థుల వెంట సుడిగాలిలా తిరిగి తెలుగు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పెద్దసంఖ్యలో బీజేపీ అభ్యర్థులు గెలవడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. అయితే ఫలితాలు వెలువడిన తరువాత ఈ రెండింటిలో ఒకటి పూర్తిగా నెరవేరకున్నా, అసెంబ్లీలో బీజేపీ ప్రవేశాన్ని మాత్రం ఖరారు చేసుకున్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నపు డు వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుని బీజేపీ రెండుసీట్లు గెలుచుకుంది. ఆ తరువాత ఇన్నాళ్లకు మళ్లీ అదే అన్నాడీఎంకే కూటమి నుంచి బరిలోకి దిగి నాలుగు సీట్లను సొంతం చేసుకుంది. మొత్తమ్మీద తమిళనాడు అసెంబ్లీలో కమలాదళం ఇన్నాళ్ళకు కనిపించనుంది.
Also Read: CM Palaniswami: తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన పళనిస్వామి.. స్టాలిన్‌కు శుభాకాంక్షలు
Pinarayi Vijayan: కేరళలో మహామహులకే కుదరనిది.. ఒంటిచేత్తో ఒడ్డున పడేశారు! వరుస ‘విజయ’న్