Karnataka Assembly Polls: మే 10న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ 16 హామీలతో కూడిన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసింది. బెంగళూరులో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కర్నాటక సీఎం బసవరాజ్ బొమ్మై, సీనియర్ నేత యడ్యూరప్ప సమక్షమంలో దీన్ని విడుదల చేశారు. ‘ప్రజాధ్వని’ అని ఈ మ్యానిఫెస్టోకు బీజేపీ పేరు పెట్టింది. అధికారంలోకి వస్తే బెంగళూరు అపార్టుమెంటుల్లో నివసిస్తున్న వారి సమస్యలు చక్కదిద్దుతామని బీజేపీ తన మానిఫెస్టో ద్వారా కన్నడ ప్రజలకు హామీ ఇచ్చింది. దారిద్య్రరేఖకు దిగువన ఉండే కుటుంబాలకు ఏటా 3 గ్యాస్ సిలిండర్లు, రోజు అర లీటరు నందిని పాలు ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. నెలవారీ రేషన్‌లో భాగంగా ఐదు కిలోల సిరిధాన్యాలు అందజేస్తామని ఓటర్లకు బీజేపీ హామీ ఇచ్చింది.
ఇంకా బీజేపీ తన మేనిఫెస్టోలో కర్ణాటకలోని సంక్షేమ పథకాలు, మహిళలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో ఉగాది, గణేశ చతుర్ధి, దీపావళి పండుల నెలల్లో ప్రజలందరికీ 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను ఇస్తామని హామీ ఇచ్చింది. సరసమైన ధరకు ఆహారాన్ని అందించేందుకు ప్రతి వార్డులో అటల్ ఆహార కేంద్రాన్ని కూడా ఏర్పాడు చేస్తామని పేర్కొంది. వీటితో పాటు ప్రతినెలా ఒక్కొక్కరికి 5 కిలోల ఉచిత బియ్యం, 5 కిలోల ఉచిత మినుములను అందిస్తామని బీజేపీ ప్రకటించింది. రాష్ట్రంలోని ప్రతి తాలూకాలో కీమోథెరపీ, డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేస్తామని తన మానిఫెస్టోలో బీజేపీ పేర్కొంది. యూనిఫాం సివిల్ కోడ్, మత ఛాందసవాదాన్ని నియంత్రించేందుకు ఓ విభాగం, NRC అమలు చేయడం వంటి అంశాలను కూడా కర్ణాటక అధికార బీజేపీ తన మానిఫెస్టోలో పొందుపరిచింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..