BJP multi angle strategy in Bihar polls: ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో బీహార్ పాలిటిక్స్ రోజురోజుకూ రక్తికడుతున్నాయి. బీజేపీ-జెడీయూ సంయుక్తంగా పోటీ చేస్తూ ముఖ్యమంత్రి అభ్యర్థిగా సిట్టింగ్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను ప్రకటించిన 24 గంటల వ్యవధిలోనే ఇద్దరు కీలక బీజేపీ నేతలు లోక్‌జనశక్తి పార్టీలోకి మారిపోయారు. వీరిలో ఒకరు గజేంద్ర సింగ్ (గతంలో బీహార్ ముఖ్యమంత్రి రేసులో వున్న వ్యక్తి) కాగా.. మరొకరు ఉషా విద్యార్థి.
రాజేంద్ర సింగ్ మంగళవారమే ఎల్జేపీలోకి చేరిపోగా.. ఉషా విద్యార్థి బుధవారం చిరాగ్ పాశ్వాన్ సమక్షంలో పార్టీ మారారు. ‘‘ బీహార్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం వుంది.. బీహార్ ఫస్ట్.. బీహారీ ఫస్ట్ అనేదే మా ఆలోచన’’ అని ఉషా విద్యార్థి వ్యాఖ్యానించారు.
బీహార్ రాష్ట్ర అసెంబ్లీలో 243 సీట్లుండగా.. 122 సీట్లలో నితీశ్ నేతృత్వంలోని జేడీయూ, 121 సీట్లలో బీజేపీ పోటీ చేస్తున్నాయి. సీట్ల పంపిణీలో జేడీయూ, ఎల్జేపీ మధ్య సఖ్యత కుదరకపోవడంతో జేడీయూ పోటీ చేసే 122 సీట్లలో పోటీ చేయాలని ఎల్జేపీ నిర్ణయించింది. ఎన్డీయే కొనసాగుతామంటూ… బీజేపీతో సామరస్యంగా వ్యవహరిస్తున్నారు ఎల్జేపీ అధినేత చిరాగ్ పాశ్వాన్.
బీజేపీ బహుముఖ వ్యూహం
అటు ఎల్జేపీకి చెప్పలేక, జేడీయూతో విభేదించలేక బీజేపీ బహుముఖ వ్యూహాన్ని నెరపుతున్నట్లు కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బీజేపీ పోటీ చేస్తున్న 121 సీట్లలో కాకుండా జేడీయూ పోటీ చేస్తున్న 122 సీట్లలో ఎల్జేపీ పోటీ చేయడం ద్వారా జేడీయూ అవకాశాలను దెబ్బకొట్టేందుకేనని పలువురు భావిస్తున్నారు. ఇద్దరిలో ఎవరికి పట్టుంటే వారు గెలుస్తారు. ఇది ఒకింత ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమికి కలిసి వచ్చే అంశం.
122 సీట్లలో పరస్పరం పోటీ పడుతున్న జేడీయూ, ఎల్జేపీలలో ఎవరు ఎక్కువ స్థానాలలో గెలిస్తే వారితో బీజేపీ జత కట్టి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఒక వ్యూహం. అప్పుడు బీజేపీకి సీఎం సీటు దక్కు అవకాశం వుంటుంది. ఈ కోణంలో గతంలో బీజేపీతో విభేదించిన నితీశ్ కుమార్‌పై పరోక్షంగా పగ తీర్చుకునే అవకాశం వుంది. ఇక నితీశ్ కుమార్ చరిష్మా బావుండి.. ఆయన పార్టీనే ఎక్కువ సీట్లలో గెలిస్తే.. ఆయన్నే ముఖ్యమంత్రిని చేసి.. ప్రస్తుతం ఉన్న మిత్రధర్మాన్నే కొనసాగించడం రెండో వ్యూహం. మొత్తానికి ఎల్జేపీ, జేడీయూలలో ఎవరికి ఎక్కువ బలం వుందో ఈ ఎన్నికల్లో తేలిపోయే అవకాశం వుంది.
ప్రస్తుతం బీజేపీ నుంచి గజేంద్ర సింగ్, ఉషా విద్యార్థి వంటి నేతలను ఎల్జేపీలోకి పంపడం కూడా కమలనాథుల వ్యూహంలో భాగమేనని పలువురు భావిస్తున్నారు. జేడీయూకు కేటాయించిన సీట్లలో బలమైన బీజేపీ నేతలుంటే వారిని ఎల్జేపీలోకి పంపడం ద్వారా బరిలోకి దింపడమే బీజేపీ వ్యూహమని తెలుస్తోంది. దాంతో అక్కడ బీజేపీ శ్రేణుల్లో కొందరు ఎల్జేపీ క్యాండిడేట్‌కు అనుకూలంగా ప్రచారం చేసే చాన్స్ వుంటుంది. ఈవ్యూహంలో భాగంగా మరికొందరు బీజేపీ నేతలు ఎల్జేపీలోకి వెళతారని సమాచారం. మొత్తానికి బీహార్ ఎన్నికల్లో బీజేపీ అత్యంత వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నట్లు కనిపిస్తోంది.
Also read: మోదీకి అమిత్ షా అభినందన… ఎందుకంటే?