
మధ్యప్రదేశ్‌లో పూర్తి ఆధిక్యంలో కొనసాగుతోంది బీజేపీ. మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 160 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 67 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే.. 116 అసెంబ్లీ స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. అయితే మ్యాజిక్ ఫిగర్‌ను దాటి దూసుకుపోతోంది కమలం పార్టీ. ఇదే వేగం కొనసాగితే బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 114 సీట్లు సాధించగా.. బీజేపీ 109 కే పరిమితం అయింది. అయితే కొన్ని రాజకీయ సమీకరణాల ద్వారా ప్రభుత్వం ఏర్పాటు చేసింది బీజేపీ. ఈసారి ఇలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. మధ్యప్రదేశ్ ఓటర్లు బీజేపీకి క్లియర్‌గా మద్దతు ఇచ్చినట్లు తెలుస్తోంది.
మధ్యప్రదేశ్‌లో 52జిల్లా కేంద్రాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు ఎన్నికల అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 2,533 మంది అభ్యర్థులు పోటీలో దిగగా ఎవరు గెలుస్తారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకూ వెల్లడైన ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ గెలిచే అవకాశం ఉందని తెలిపింది. మరి కొన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు విజయావకాశాలు అధికంగా ఉన్నట్లు చూపించాయి. రెండో సారి కూడా తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ధీమా వ్యక్తం చేశారు. అయితే ప్రజలు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారని మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్ అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ట్రెండ్స్ చూస్తే బీజేపీ మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..