2024 లోనూ అధికారాన్ని నిలబెట్టుకునేందుకు బీజేపీ(BJP) కార్యాచరణ ప్రారంభించింది. మోదీ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మెగా ప్లాన్ సిద్ధం చేసింది. 2024 ఎన్నికలను(Elections – 2024) దృష్టిలో ఉంచుకుని ఈ మెగా ప్లాన్‌ను సిద్ధం చేశారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 144 లోక్‌సభ స్థానాలను బీజేపీ గుర్తించింది. 2019 ఎన్నికల్లో బీజేపీ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన 144 స్థానాలు ఇవి. ఈ 144 లోక్‌సభ నియోజకవర్గాల్లో కేంద్ర ప్రభుత్వంలోని ప్రతి మంత్రి మూడు రోజుల పాటు మకాం వేయనున్నారు. ఈ లోక్‌సభ(Lok Sabha) స్థానాల్లో బీజేపీ స్థానాన్ని బలోపేతం చేసేందుకు రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం బీజేపీ కొత్త నేతలకు బాధ్యతలు అప్పగించనుంది. బలహీనంగా ఉన్న లోక్‌సభ స్థానాల్లో విజయవకాశాలను మెరుగుపరుచుకునేందుకు జాతీయ ప్రధాన కార్యదర్శి సీటీ రవి, ఉపాధ్యక్షులు బైజయంత్ పాండా, దిలీప్ ఘోష్, ఎస్సీ మోర్చా అధ్యక్షుడు లాల్‌సింగ్ ఆర్యలతో టాస్క్‌ఫోర్స్‌ను నియమించింది.
ఇంతవరకూ గెలవని 100 లోక్‌సభ స్థానాలనూ బీజేపీ గుర్తించింది. వీటిల్లో గెలుపే దిశగా టాస్క్‌ఫోర్స్ బృందం సిద్ధం చేయనుంది. మూడు నెలలు విస్తృతంగా పర్యటనలు చేసి పార్టీ పటిష్టానికి చేపట్టాల్సిన చర్యలపై అభిప్రాయాలు సేకరించనుంది. వచ్చే వారం నుంచి పర్యటనలు మొదలవుతాయని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోనూ బృందం సమావేశం కానుంది. బలహీనంగా ఉన్న బూత్‌లలో ఎక్కువగా దక్షిణాదిలోనే ఉన్నాయి.
ఉత్తర భారతదేశంలో, హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో బీజేపీ సత్తాచాటింది. కానీ దక్షిణాదిలో మాత్రం ఆ పార్టీకి ఆశించిన జనాధరణ లభించడం లేదు. తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన సీట్లు సాధించలేదనే అసంతృప్తి ఉంది. కానీ వచ్చే ఎన్నికల్లో ఈ రాష్ట్రాల్లో మెరుగైన ప్రదర్శన సాధిస్తోందని విశ్వాసంతో ఉంది. దక్షిణాదిలో కూడా విజయం తథ్యమని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఏపీ, త్రిపుర ఇంచార్జీ సునీల్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయా రాష్ట్రాల్లో పాగా వేయాలంటే ఊరికే ప్రచారం చేస్తే సరిపోదని, అక్కడి భాష నేర్చుకోవడం తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు.
దక్షిణాదిలో పార్టీ పరాజయానికి కారణాలేంటనే అంశాలపై పార్టీ లోతుగా అధ్యయనం చేస్తోంది. కర్ణాటకలో 28 సీట్లలో 25 స్థానాల్లో విజయం సాధించింది. తెలంగాణలో 17 సీట్లు ఉంటే 4 చోట్ల గెలుపొందింది. అయితే తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఖాతా తెరవకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి