SIR టెన్షన్.. నెక్స్ట్ ఏం జరగనుంది..? బిహార్‌ ఫలితాలతో ఆ రాష్ట్రాల్లో ప్రకంపనలు..

S.I.R... స్పెషల్‌ ఇంటెన్సివ్ రివిజన్..! బిహార్ ఫలితాల తర్వాత ఇప్పుడు దీనిపైనే దేశవ్యాప్తంగా తెగ చర్చ జరుగుతోంది. SIR వల్లే ఓడిపోయామని మహాఘట్‌బంధన్‌ పదేపదే చెబుతుండటం... ఎన్నికల ముందు కూడా ఇదే అంశంపై రచ్చరచ్చ చేయడంతో నెక్ట్స్‌ ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో టెన్షన్‌ నెలకొంది. మరీ S.I.Rతో నిజంగానే అన్యాయం జరుగుతోందా..? పార్టీల ఆందోళనల్లో వాస్తవమెంత..?

SIR టెన్షన్.. నెక్స్ట్ ఏం జరగనుంది..? బిహార్‌ ఫలితాలతో ఆ రాష్ట్రాల్లో ప్రకంపనలు..
Sir

Updated on: Nov 15, 2025 | 9:50 AM

బిహార్ ఎన్నికల ముందు రాష్ట్రవ్యాప్తంగా స్పెషల్‌ ఇంటెన్సివ్ రివిజన్ చేపట్టింది కేంద్ర ఎన్నికల సంఘం. ఓటరు జాబితాలో అర్హులైన పౌరులందరి పేర్లను చేర్చడం… మరణించిన, శాశ్వతంగా వలస వెళ్లిన వాళ్లను తొలగించడం… అలాగే నకిలీ ఓటర్లను తీసేయడం లాంటి తప్పొప్పులను SIR ప్రక్రియతో సరిచేశామంటోంది ఎలక్షన్ కమిషన్. అయితే… ఈ SIR ప్రక్రియ ఎన్నికలకు ముందే జరగడంతో బిహార్‌లో పొలిటికల్‌ ఫైట్‌ ఓరేంజ్‌లో నడిచింది. ఎన్నికల సంఘం బీజేపీ కోసం పనిచేస్తోందని… SIR పేరుతో ఓట్లను తొలగించి కమలం పార్టీకి అన్ని రాష్ట్రాల్లో అధికారం కట్టబెట్టడమే పనిగా పెట్టుకుందని పార్టీలన్ని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఫలితాల తర్వాత కూడా SIRను ప్రస్తావిస్తూ NDAని పార్టీలన్నీ టార్గెట్‌ చేస్తున్నాయి.

బీహార్‌ ఎన్నికల్లో NDA కూటమి గెలవడానికి SIR ఓ కొత్త ఆయుధమని MGB నిప్పులు చెరుగుతోంది. కరెక్ట్‌గా ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియను చేపట్టంపై మండిపడుతోంది. ఈ SIR పేరుతో ఎన్నికల సంఘం 60 లక్షల మంది ఓటర్లను తొలగించిందని…. ఇందులో ఎక్కువమంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఓటర్లే ఉన్నారని పలువురు నేతలు ఫలితాల తర్వాత తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలకు ముందే ఎస్‌ఐఆర్‌ అనేది ఓటు చోరీ మాధ్యమంగా మారిందని… కేవలం ఎస్‌ఐఆర్‌ వల్లే ఈ ఎన్నికల్లో NDA గెలిచిందని… ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి ఎస్‌ఐఆర్‌ ఒక పెద్ద ఆయుదంగా మారిందని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఆక్రోశం వెల్లగక్కారు.

ఇక బిహార్‌లో SIR ప్రక్రియ పూర్తవ్వడంతో దేశవ్యాప్తంగా ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణకు శ్రీకారం చుట్టింది ఎన్నికల సంఘం. పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో ఇప్పటికే SIRను షురూ చేసింది. అయితే బెంగాల్‌లో మమతా సర్కార్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తోంది. కోల్‌కతాలో సీఎం మమతా బెనర్జీ సైతం భారీ ర్యాలీ చేశారు. ఢిల్లీలో కూడా పోరాటం చేస్తామని… అర్హులైన వాళ్ల ఓట్లు తొలగిస్తే సహించే ప్రసక్తే లేదని ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇటు తమిళనాడులోనూ ఇవే సీన్స్ కనిపిస్తున్నాయి. అసలొద్దీ SIR అని డీఎంకే ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా SIR ప్రక్రియ జరుగుతోందన్నారు. అయితే ఇది రొటీన్‌ ప్రక్రియ అని ఎన్నికల సంఘం అధికారులు వివరణ ఇస్తున్నా… ఏమాత్రం ఒప్పుకునేదేలే అంటున్నారు.

మొత్తంగా… తమిళనాడు , బెంగాల్‌ రాష్ట్రాల్లో 2026లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతుండంతో ఆ రాష్ట్రాల్లో ఉన్న అధికార పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. బిహార్‌లో SIRను అడ్డంపెట్టుకుని గెలిచినట్లే… తమ రాష్ట్రాల్లోనూ NDA గెలవాలని చూస్తోందని విమర్శలు ఎక్కుపెడుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..