35 ఏళ్ల క్రితంనాటి కేసులో 85 ఏళ్ల వృద్ధుడికి 3 ఏళ్లు జైలు శిక్ష.. అసలు మ్యాటర్ ఏంటంటే?

చేసిన నేరానికి ఎప్పటికైనా శిక్ష తప్పదు అనే దానికి బీహార్‌ కోర్టు ఇచ్చిన తీర్పే ఇప్పుడు నిదర్శనంగా నిలుస్తోంది. 35 ఏళ్ల నాటి సుదీర్ఘ విచారణ తర్వాత 85 ఏళ్ల వృద్ధుడికి బీహార్‌లోని వైశాలి కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆ వృద్ధుడిని చేతులతో ఎత్తుకెళ్తున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

35 ఏళ్ల క్రితంనాటి కేసులో 85 ఏళ్ల వృద్ధుడికి 3 ఏళ్లు జైలు శిక్ష.. అసలు మ్యాటర్ ఏంటంటే?
Bihar Court 85 Year Old Man Sentence

Updated on: Jun 03, 2026 | 2:27 PM

35 ఏళ్ల నాటి ఓ కేసులో సుదీర్ఘ విచారణ తర్వాత 85 ఏళ్ల నిందితుడికి కోర్టు 3 ఏళ్ల శిక్ష విధించిన ఘటన బీహార్‌ రాష్ట్రంలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ఒక హత్యాయత్నం, ఆయుధాల ఉల్లంఘన కేసులో 85 ఏళ్ల వృద్ధుడు దీప్ రాయ్‌కు బీహార్‌లోని వైశాలి జిల్లా కోర్టు మంగళవారం 3 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. అయితే తీర్పు సందర్భంగా న్యాయమూర్తి మానవతా దృక్పథంతో మాట్లాడుతూ.. నేరస్థుడైన దీప్ రాయ్‌కు ప్రస్తుతం 85 ఏళ్లు. అతను పూర్తిగా శారీరక వైకల్యంతో ఉన్నాడు. జైలులో కఠినమైన శిక్షను అతను తట్టుకుని ప్రాణాలతో బయటపడటం కష్టమనేది వాస్తవం. కానీ అదే సమయంలో నేరానికి శిక్ష పడటం కూడా అంతే ముఖ్యమని తెలిపారు. కాబట్టి మానవతా దృక్పథంతో కోర్టు అతనికి తక్కువ శిక్షను ఖరారు చేస్తున్నట్టు తెలిపారు.

ఈ కేసులో దీప్ రాయ్‌కు మూడేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 25,000 జరిమానా విధించిన కోర్టు, కేసులో నిందితులుగా ఉన్న నాకేశ్వర్ రాయ్ (62), నరేష్ రాయ్ (60), ఉద్కేశ్వర్ రాయ్ (59), జగదీష్ రాయ్ (50) అనే మరో నలుగురికి కూడా శిక్ష విధించింది. అయితే ఈ ఘటన జరిగి దాదాపు 35 ఏళ్లు దాటింది. ఇంత సుదీర్ఘ కాలం పాటు విచారణను ఎదుర్కోవడమే నిందితులకు ఒక రకమైన శిక్ష.. కాబట్టి వీరికి ఎక్కువ శిక్ష విధించడం సమంజసం కాదని కోర్టు భావిస్తోందని న్యాయమూర్తి పేర్కొన్నారు.

అయితే నిందితులంతా మొదటిసారి నేరానికి పాల్పడిన వారేనని, వారి వయసును పరిగణనలోకి తీసుకుని కనిష్ట శిక్ష విధించాలని డిఫెన్స్ లాయర్లు వాదించారు. దీంతో డిఫెన్స్ వాదనను అంగీకరించిన కోర్టు అతనికి రూ. 25,000 జరిమానాతో పాటు తగ్గించిన శిక్షను విధించింది. ఇక కోర్టు ఆదేశాలతో నడవలేని స్థితిలో ఉన్న నిందితుడిని పోలీసులు చేతులపై ఎత్తుకొని తీసుకెళ్తుండగా చూసిన కొందరు వ్యక్తులు ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us