ఆలిండియా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. రాహుల్ పాదయాత్ర చేస్తూ పార్టీ పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తుంటే.. ఆయన మాత్రం విపక్షాల సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందంటూ చేసిన వ్యాఖ్యలు ఇంటా, బయటా దుమారం రేపుతున్నాయి. పేరుతో కూటమిగా ఉన్నా కూడా సొంతంగా బలపడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది. కానీ కాంగ్రెస్ ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది.
దేశంలో అతిపెద్ద పార్టీగా ఉంది భారతీయ జనతా పార్టీ.. 3వందలకు పైగా ఎంపీ సీట్లున్నాయి.. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ పట్ల వ్యతిరేకను క్యాష్ చేసుకుని ప్రజామద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన ప్రధానప్రతిపక్షం కాంగ్రెస్ ఇందుకు భిన్నంగా లెఫ్ట్ ఫ్రంట్, ఇతర ప్రాంతీయపార్టీలపై ఆధారపడుతోంది. సొంతంగా అధికారంలోకి వస్తామని ధీమాగా చెప్పలేకపోతున్న 50 ఏళ్లకు పైగా పాలించిన అతిపురాతన కాంగ్రెస్ మిత్రుల కోసం చూస్తోంది. ఇందులో భాగంగానే మల్లిఖార్జున ఖర్గే 2024లో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని ప్రకటన చేశారు.
అయితే కాంగ్రెస్ పార్టీలోనూ భిన్నమైన వాదనలున్నాయి. కలసి వచ్చే ప్రాంతీయ పార్టీలన్నింటినీ కలుపుకుని వెళతామని ఖర్గె అంటే.. రాహుల్ మాత్రం ఇందుకు విరుద్దంగా ప్రాంతీయపార్టీలను టార్గెట్ చేస్తున్నారు. టీఎంసీ, బీఆర్ఎస్, ఆప్ వంటి బలమైన పార్టీలను బీజేపీకి బీ టీమ్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర కారణంగా దేశంలో కాంగ్రెస్ పరిస్థితి పూర్తిగా మెరుగుపడిందన్న భావిస్తున్న నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి. సిద్దాంతపరంగా వైరుధ్యాలున్నా బీజేపీని ఢీకొట్టడానికి ప్రాంతీయపార్టీలను కలుపుకుని పోతారా? లేక సొంతంగా బలపడేందుకు ప్రయత్నిస్తారా?