Bharat Bandh Today Live: రైతుల ఆందోళనకు దేశవ్యాప్త మద్దతు.. కొనసాగుతోన్న భారత్ బంద్.. వాటికే అనుమతి.!

| Edited By: Ram Naramaneni

Mar 26, 2021 | 5:34 PM

Bharat Bandh: వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ‌ను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు పూర్తి స్థాయి 'భారత్ బంద్'‌కు..

Bharat Bandh Today Live: రైతుల ఆందోళనకు దేశవ్యాప్త మద్దతు.. కొనసాగుతోన్న భారత్ బంద్.. వాటికే అనుమతి.!
Bharat Bandh

Bharat Bandh News: వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ‌ను వ్యతిరేకిస్తూ కార్మిక సంఘాలు పూర్తి స్థాయి ‘భారత్ బంద్’‌కు పిలుపునిచ్చారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ బంద్ కొనసాగుతుందని అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. ఈ బంద్ సమయంలో రహదారులను మూసి వేయనుండగా.. ప్రజా రవాణా అంతా బంద్ కానుంది. అలాగే మార్కెట్లు, మాల్స్, షాపింగ్‌ మాల్స్, జనసాంద్రత ప్రదేశాలను సైతం మూసివేయాలని నిర్ణయించారు. అటు బ్యాంక్ సేవలకు సైతం ఆటంకం కలిగే అవకాశం ఉంది. కేంద్ర కార్మిక, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు ఈ బంద్‌కు పూర్తి మద్దతు ప్రకటించాయి. అంబులెన్స్, అత్యవసర ఆరోగ్య సేవలన్నింటికీ మినహాయింపు ఇచ్చినట్లు సీనియర్ రైతు నాయకుడు బల్బీర్ సింగ్ రాజేవాల్ స్పష్టం చేశారు.

కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ, ఘాజీపూర్, సింఘ్, టిక్రీ సరిహద్దుల్లో రైతులు చేస్తోన్న నిరసనలు నాలుగు నెలలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ బంద్‌ను తలపెట్టామని.. దేశ ప్రజలందరూ కూడా దీన్ని విజయవంతం చేయాలని రైతు నాయకుడు బల్బీర్ సింగ్ రాజేవాల్ వెల్లడించారు. రైతులు పలు ప్రాంతాల్లోని రైల్వే ట్రాక్‌లపై నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ బంద్‌కు కాంగ్రెస్, వైసీపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ, సమాజ్‌వాదీ పార్టీ, ఆప్‌ సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు ప్రకటించాయి. దీనితో ఈ బంద్ ప్రభావం పలు రాష్ట్రాల్లోని సామాన్యులపై పడే అవకాశం ఉంది.

భారత్ బంద్‌కు జగన్ సర్కార్ మద్దతు…

రైతు సంఘాలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులు చేపట్టిన భారత్ బంద్‌కు జగన్ సర్కార్ సంఘీభావం తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌లో మధ్యాహ్నం 1 గంట వరకు ప్రభుత్వ కార్యాలయాలు, ఆర్టీసీ బస్సులు బంద్ కానున్నాయి. అత్యవసర సేవలు మాత్రం యధావిధిగా కొనసాగనున్నాయి. ప్రజలకు అసౌకర్యం కలగకుండా బంద్‌ను శాంతియుతంగా నిర్వహించాలని ఏపీ రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 26 Mar 2021 01:16 PM (IST)

    అమృత్‌సర్-ఢిల్లీ రైల్వే ట్రాక్‌పై రైతుల ఆందోళన…

    పంజాబ్‌లోని అమృత్‌సర్-ఢిల్లీ రైల్వే ట్రాక్ పై కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ సమితి సభ్యులు నిరసన తెలుపుతున్నారు. రైతులు అర్ధ నగ్నంగా ఆందోళనలు చేస్తున్నారు.

  • 26 Mar 2021 12:29 PM (IST)

    కేంద్రంతో చర్చలకు సిద్ధం.. బీకేయు నాయకుడు

    భారతీయ కిసాన్ యూనియన్ ఉత్తరప్రదేశ్ అధ్యక్షుడు రాజ్‌వీర్ సింగ్ జాడౌన్ భారత్ బంద్‌పై మాట్లాడుతూ.. ”సాగు చట్టాలపై మా ఉద్యమం సుమారు నాలుగు నెలలుగా జరుగుతోంది. ఈ భారత్ బంద్‌లో ప్రజలు, వ్యాపారులు, రవాణాదారులు తమకు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నారు. ఇదే మేము ప్రభుత్వానికి ఇస్తున్న సందేశం. కేంద్రంతో చర్చలకు ఎప్పుడైనా కూడా తాము సిద్దం అని పేర్కొన్నారు.

  • 26 Mar 2021 11:55 AM (IST)

    భారత్ బంద్.. చంఢీగర్ – అంబాలా హైవే బ్లాక్..

    భారత్ బంద్‌లో భాగంగా నిరసనకారులు చంఢీగర్ -అంబాలా హైవేను బ్లాక్ చేశారు. ఆ విజువల్స్ ఇలా ఉన్నాయి..

  • 26 Mar 2021 11:35 AM (IST)

    అమృత్‌సర్‌లో రైల్వే ట్రాక్‌లపై రైతుల బైఠాయింపు..

    పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో భారత్ బంద్ సందర్భంగా రైల్వే ట్రాక్‌‌పై రైతులు బైఠాయించారు. నిరసనలను తెలుపుతూ రైలును అడ్డుకున్నారు. 

  • 26 Mar 2021 11:17 AM (IST)

    సాధారణ ప్రజలు మా వెంట ఉన్నారు- రాకేశ్ టికైట్

    భారతీయ కిసాన్ యూనియన్  జాతీయ ప్రతినిధి రాకేశ్ టికైట్ మాట్లాడుతూ, నేటి ‘భారత్ బంద్’లో సాధారణ ప్రజలు తమ వెంటే ఉన్నారని తెలిపారు. “తమ పోరాటం రైతులు, కార్మికుల ప్రయోజనాలను కాపాడుతుందని అన్నారు”. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 

  • 26 Mar 2021 11:04 AM (IST)

    32 చోట్ల రైలు సర్వీసులపై బంద్ ప్రభావం.. 4 శతాబ్ది రైళ్లు రద్దు..

    భారత్ బంద్ నేపథ్యంలో రైల్వే శాఖ అప్రమత్తమైంది. పంజాబ్, హర్యానాలోని 31 చోట్ల నిరసనకారులు నిరసన తెలుపుతున్న నేపథ్యంలో రైలు సర్వీసులపై ప్రభావం పడింది. దీనితో 4 శతాబ్ది రైళ్లు రద్దు అయ్యాయి. 

  • 26 Mar 2021 10:35 AM (IST)

    భారత్ బంద్: ఏపీ వ్యాప్తంగా అన్నీ బ్లాక్..

    భారత్ బంద్ కారణంగా ఏపీ అంతటా నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లాలో ప్రధాన నగరాలైన కాకినాడ, రాజమండ్రితో సహా 9 ప్రాంతాల్లోని డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యాయి. అటు కాకినాడలో బ్యాంకులు, వాణిజ్య, వ్యాపార సంస్థలు బంద్ అయ్యాయి. అంతేకాకుండా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలన్నింటికీ యాజమాన్యాలు సెలవులు ప్రకటించాయి.

  • 26 Mar 2021 10:12 AM (IST)

    ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న బంద్

    ప్రకాశం జిల్లాలో బంద్ వాతావరణం కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా వస్త్ర, వ్యాపార సంస్థలు, దుకాణాలను మూసివేశారు. అంతేకాకుండా చీరాల ముఖ్య కూడళ్లలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసారు.

  • 26 Mar 2021 09:45 AM (IST)

    విశాఖపట్నంలో కొనసాగుతోన్న బంద్ ప్రభావం

    కేంద్రానికి వ్యతిరేకంగా ఉక్కు కార్మికులు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. రిలే నిరాహార దీక్షలు 43వ రోజుకు చేరగా.. ప్రస్తుతం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో కూర్మన్నపాలెం కూడలి వద్ద దీక్షలు కొనసాగుతున్నాయి.

  • 26 Mar 2021 09:23 AM (IST)

    భారత్ బంద్: ఒడిశాలో అన్ని పాఠశాలలు బంద్..

    భారత్ బంద్ దృష్ట్యా రాష్ట్రమంతా అన్ని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ఒడిశా పాఠశాల, విద్యా విభాగం ప్రకటించింది.

  • 26 Mar 2021 09:22 AM (IST)

    పశ్చిమ గోదావరి: 16వ నెంబర్ జాతీయ రహదారిపై రైతు సంఘాల రాస్తారోకో

    ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో బంద్ ప్రభావం కొనసాగుతోంది. దెందులూరు మండలం సత్యనారాయణపురంలో రైతు సంఘాలు రాస్తారోకో నిర్వహిస్తున్నాయి. 16వ నెంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహిస్తుండగా.. దీని వల్ల కిలోమీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయాయి.

  • 26 Mar 2021 09:15 AM (IST)

    ఏపీలో కొనసాగుతున్న బంద్ ప్రభావం

    ఏపీలో కొనసాగుతున్న భారత్  బంద్ ప్రభావం

    భారత్ బంద్‌కు రాష్ట్రంలో పలు సంఘాలు మద్దతు

    ఏపీ అమరావతి ఐకాస, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘాలు భారత్ బంద్ కు మద్దతు

    బంద్‌ను శాంతియుతంగా నిర్వహించాలని.. విజయవంతం చేయాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చిన టీడీపీ

     

  • 26 Mar 2021 08:33 AM (IST)

    భారత్ బంద్: రాష్ట్రంలో కొనసాగుతున్న బంద్ ప్రభావం

    ఆంధ్రప్రదేశ్‌లో భారత్ బంద్ ప్రభావం కొనసాగుతోంది. రాష్ట్రంలో డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యాయి. అనంతపురం ఆర్టీసీ బస్టాండ్ వద్ద వామపక్షాలు ఆందోళన చేస్తుండగా.. ఆ జిల్లాలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలోని 7 డిపోల పరిధిలోని బస్సులు అన్నీ కూడా నిలిచిపోయాయి. జిల్లా వ్యాప్తంగా వామపక్షాలు ఆర్టీసీ డిపోల వద్ద నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.

  • 26 Mar 2021 08:12 AM (IST)

    ఏపీలో కొనసాగుతోన్న బంద్ ప్రభావం.. కర్నూలులో డిపోలకే పరిమితమైన బస్సులు..

    ఆంధ్రప్రదేశ్‌లో బంద్ ప్రభావం కొనసాగుతోంది. కర్నూలు జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద వామపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో జిల్లాలోని డిపోలకే ఆర్టీసీ బస్సులు పరిమితమయ్యాయి.

  • 26 Mar 2021 07:58 AM (IST)

    భారత్ బంద్ నేపథ్యంలో ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం..

    భారత్ బంద్ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. మార్కెట్లు, జనసాంద్రత ప్రదేశాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

  • 26 Mar 2021 07:52 AM (IST)

    మద్దిలపాలెం వద్ద వామపక్షాల బంద్..

    భారత్ బంద్‌లో భాగంగా విశాఖపట్నం జిల్లాలోని మద్దిలపాలెం బస్టాండ్ వద్ద వామపక్షాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వామపక్షాలు, ప్రజా సంఘాలు నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ఈ బంద్‌లో సీపీఎం కార్పొరేటర్ గంగరావు, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.

  • 26 Mar 2021 07:48 AM (IST)

    భారత్ బంద్‌కు వైసీపీ మద్దతు.. మధ్యాహ్నం 1 గంట వరకు ఆర్టీసీ బస్సులు బంద్…

    రైతు సంఘాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపడుతోన్న భారత్ ‌బంద్‌కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంఘీభావం తెలిపింది. ఈ క్రమంలోనే ఏపీలో ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం 1 గంట వరకు బంద్ కానున్నాయి. అటు ప్రభుత్వ సంస్థలను సైతం మూసివేయనున్నారు. బంద్‌ను శాంతియుతంగా నిర్వహించాలని.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూసుకోవాలని రైతు సంఘాలకు, ఉక్కు కార్మికులకు ఏపీ రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని విజ్ఞప్తి చేశారు. ఈ బంద్ సమయంలో అత్యవసర ఆరోగ్య సేవలన్నీ కూడా యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు.

  • 26 Mar 2021 07:34 AM (IST)

    భారత్ బంద్: ఏవేవి బంద్ కానున్నాయంటే.!

    రైతు సంఘాలు, ఉక్కు కార్మికులు తలపెట్టిన భారత్ బంద్‌కు రాజకీయ పార్టీల నుంచి పూర్తిస్థాయి మద్దతు లభించింది. అటు కేంద్ర కార్మిక, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు సైతం మద్దతు ప్రకటించాయి. ఈ బంద్ సమయంలో రహదారులను మూసి వేయనుండగా.. ప్రజా రవాణా అంతా బంద్ కానుంది. రైలు, రోడ్డు రవాణా మార్గాలను, మార్కెట్లు, షాపింగ్ మాల్స్, అన్ని సంస్థలు బంద్ కానున్నాయి. అంబులెన్స్, అత్యవసర ఆరోగ్య సేవలకు మాత్రమే మినహాయింపు ఉందని.. మిగిలిన అన్నింటినీ అడ్డుకుంటామని రైతులు తెలిపారు. అటు బ్యాంకు సేవలకు సైతం ఆటంకం కలిగే అవకాశం ఉంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ బంద్ కొనసాగనుంది.

  • 26 Mar 2021 07:28 AM (IST)

    అన్నదాతలను గౌరవించి, బంద్‌కు పూర్తి మద్దతు తెలపాలని విజ్ఞప్తి…

    కేంద్రానికి వ్యతిరేకంగా అఖిల భారత సంయుక్త కిసాన్ మోర్చా ఈరోజు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనితో దేశవ్యాప్తంగా ప్రజా రవాణా 12 గంటల పాటు స్తంభించనుంది. బంద్‌ను శాంతియుతంగా నిర్వహించాలని దేశ పౌరులు అందరూ కూడా అన్నదాతలను గౌరవించి ఈ భారత్ బంద్‌ను పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలనీ సీనియర్ రైతు నాయకుడు బల్బీర్ సింగ్ రాజేవాల్ తెలిపారు.

  • 26 Mar 2021 07:23 AM (IST)

    కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు, ఉక్కు కార్మికుల ‘భారత్ బంద్’

    కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు, విశాఖ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణను అడ్డుకుంటూ ఉక్కు కార్మికులు ఇవాళ 12 గంటల పాటు పూర్తి స్థాయి ‘భారత్ బంద్’కు పిలుపునిచ్చారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ బంద్ కొనసాగనుంది.

Follow us on