అయ్యో పాపం.. సీబీఐ అధికారులమని మహిళకు ఫోన్.. నెల రోజుల పాటు ఇంట్లోనే ఉంచి..
ఈ డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఫేక్ లింక్స్, డిజిటల్ అరెస్టుల పేరుతో కేటుగాళ్లు అందినకాడికి దోచుకుంటున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొంతమంది నేరగాళ్ల గాలానికి చిక్కి విలవిలలాడుతున్నారు. తాజాగా 57 ఏళ్ల మహిళ సైబర్ మోసానికి గురై కోట్లు పోగొట్టుకుంది.

బెంగళూరుకు చెందిన 57 ఏళ్ల మహిళా వ్యాపారవేత్తను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు దాదాపు రూ. 31.83 కోట్ల విలువైన భారీ మోసానికి పాల్పడ్డారు. డిజిటల్ అరెస్ట్‌తో మోసగాళ్లు ఆమెను ఒక నెల పాటు ఇంట్లోనే వర్చువల్ కస్టడీకి పరిమితం చేశారు. మోసగాళ్లు DHL సిబ్బంది, సీబీఐ, ఆర్బీఐ, సైబర్ క్రైమ్ అధికారులమని నమ్మబలికి ఈ భారీ స్కామ్‌కు పాల్పడ్డారు. 2024 సెప్టెంబర్ 15న బాధితురాలికి మొదట DHL నుండి కాల్ వచ్చింది. ముంబైలోని అంధేరి నుండి ఆమె పేరు మీద బుక్ చేసిన ఒక ప్యాకేజీలో నిషేధిత వస్తువులైన నాలుగు పాస్‌పోర్ట్‌లు, మూడు క్రెడిట్ కార్డులు, MDMA ఉన్నాయని కాల్ చేసిన వ్యక్తి ఆమెకు తెలియజేశాడు. ఆమె ఆ ప్యాకేజీ గురించి తనకు తెలియదని చెప్పినప్పటికీ.. వారు కేసుల పేరుతో ఆమెను భయపెట్టారు.
స్కైప్‌లో నిరంతరం నిఘా
కాల్ వెంటనే సీబీఐ అధికారులుగా నటిస్తున్న వ్యక్తులకు బదిలీ అయింది. వారు ఆమెకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు ఉన్నాయని, అరెస్టు చేస్తామని భయపెట్టారు. స్థానిక పోలీసులను సంప్రదించవద్దని, ఆమె ఇంటిని నేరస్థులు పర్యవేక్షిస్తున్నారని హెచ్చరించడంతో కుటుంబ భద్రతకు భయపడి బాధితురాలు వారి షరతులకు ఒప్పుకుంది. మోసగాళ్లు ఆమెను రెండు స్కైప్ ఐడీలను ఇన్‌స్టాల్ చేయమని ఆదేశించారు. మోహిత్ హండా అనే వ్యక్తి స్కైప్‌లో ఆమెను నిరంతరం పర్యవేక్షించారు. మరొక వ్యక్తి సీబీఐ అధికారి ప్రదీప్ సింగ్‌గా నటిస్తూ ఆమెను మాటలతో దుర్భాషలాడి, నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని ఒత్తిడి చేశాడు.
ఆస్తులు డిపాజిట్ చేయాలని డిమాండ్
నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి, ఆమె అన్ని ఆస్తుల వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత, ఆమె ఆస్తుల్లోని 90శాతం డబ్బును క్లియరెన్స్ పేరుతో తమకు పంపాలని బలవంతం చేశారు. భయంతో ఆ మహిళ సుమారు రూ. 31.83 కోట్లు 187 లావాదేవీల ద్వారా పంపింది. ఈ ఏడాది ప్రారంభంలోనూ స్కామర్లు డబ్బు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయితే మార్చి 26న ఉన్నట్లుండి కాల్స్ ఆగిపోయాయి. దాంతో మోసపోయానని మహిళ గ్రహించింది. జూన్ 8న తన కొడుకు పెళ్లి తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…




