చనిపోయిన కొడుకు ఆస్తిలో అతని తల్లికి కూడా సమాన వాటా ఉంటుందని కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. భర్త మరణించి కొడుకు వద్ద ఉంటున్న మహిళకు, ఆమెకు కొడుకు కూడా చనిపోతే అతని ఆస్తిలో సమాన వాటా ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. చనిపోయిన తన భర్త ఆస్తిలోనే కాకుండా, మరణించిన కొడుకు ఆస్తిలోనూ సమాన వాటా ఉంటుందని మరింత క్లారిటీ ఇచ్చింది కోర్టు. ఈ మేరకు గురువారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
హిందూ వారసత్వ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం, మరణించిన కుమారునికి సంక్రమించిన ఆస్తిని అతని భార్య, పిల్లలకు సమానంగా పంచాలి. అలాగే అతని వితంతు తల్లికి కూడా సమానంగా పంచాలని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే, ఈ నిబంధన కేవలం వితంతు తల్లులకు మాత్రమే వర్తిస్తుందని, భర్త ఉన్న మహిళకు మరణించిన కొడుకు ఆస్తిలో వాటా ఇచ్చే హక్కు లేదని హైకోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
బీదర్‌కు చెందిన హనుమంత రెడ్డి, ఈరమ్మ దంపతుల మధ్య జరిగిన ఆస్తి పంపకాల కేసులో హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. హనుమంత రెడ్డి, ఈరమ్మ దంపతులకు పోరస రెడ్డి, భీమా రెడ్డి, రేవమ్మ, బసవ రెడ్డి అనే నలుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో భీమా రెడ్డి మరణించారు. ఈరమ్మ భర్త హనుమంత రెడ్డి కూడా చనిపోయాడు. ఆస్తి పంపకాల విషయంలో తల్లీబిడ్డల మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో బీదర్ జిల్లా స్థానిక కోర్టులో కేసు నమోదైంది. బీదర్ కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల సంతృప్తి చెందని ఈరమ్మ హైకోర్టును ఆశ్రయించింది.
ఈ వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు హనుమంత రెడ్డికి చెందిన ఆస్తిలో 1/5 వంతును ఆయన భార్య ఈరమ్మ, పిల్లలకు సమానంగా పంచాలని తీర్పునిచ్చింది. ఈ తీర్పు ప్రకారం ఒక్కొక్కరు ఆస్తిలో 1/25వ వంతు పొందుతారు. అక్కడ, ప్రతి బిడ్డకు వారి వాటాలో 1/5, వారి తండ్రి ఆస్తిలో 1/25, మొత్తం 6/25 ఆస్తికి హక్కు ఉంటుంది.
ఇక ఆస్తి పంపకం మూడో దశ కింద మృతుడు ఈరమ్మ కుమారుడు భీమారెడ్డికి సంక్రమించిన ఆస్తిలో 6/25 శాతం భీమా రెడ్డి భార్య, కుమార్తె, వితంతువు ఈరమ్మకు సమానంగా పంచాలి. అప్పుడు ఈరమ్మ ఆస్తిలో తన భర్త వంతు, కొడుకు భీమారెడ్డి వాటాతో కలిపి మొత్తం 6/75% ఆస్తి వస్తుంది. వితంతువు ఈరమ్మకు కూడా అదే విధంగా ఆస్తి పంచాలని హైకోర్టు సూచించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..