ప్రేమ బలే విచిత్రమైనది. తాను ప్రేమించిన వారి కోసం ఏం చేసేందుకైనా, ఎంతవరకైనా వెళ్లేలా చేస్తుంది. ఈ అపర ప్రేమికుడు కూడా దేశం కాని దేశానికి చెందిన అమ్మాయి ప్రేమించాడు. అందులోనూ పాకిస్తాన్ అమ్మాయి. ప్రేమలో ఆదేం ఆలోచించలేదు. ఎలాగైనా ఆమెను తన దగ్గరకు చేర్చుకోవాలనుకున్నాడు. ఇంకేముంది.. ఆమెను ఇండియాకు తీసుకువచ్చే ప్రయత్నం చేశాడు. అయితే, ఆ ప్రయత్నం వికటించి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. ఇంతకీ అసలేం జరిగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన ములాయంసింగ్ యాదవ్(25) బెంగళూరులో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆన్‌లైన్‌లో లూడో గేమ్‌కి అలవాడు పడ్డాడు. అలా ఆన్‌లైన్‌లో గేమ్ ఆడుతున్న సందర్భంలో పాకిస్తాన్‌కు చెందిన ఇక్రా జీవాని(19) పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. ఎలాగైనా ఆమెను తన చెంతకు తీసుకురావాలని భావించాడు. అనుకున్నదే తడవు.. ప్లాన్ వేశాడు, అమలు చేశాడు. అమ్మాయిని పాకిస్తాన్ నుంచి నేపాల్ మీదుగా భారత్‌లోకి అక్రమంగా, నకిలీ ధృవపత్రాలు సృష్టించి తీసుకువచ్చాడు. కానీ, అతని మాస్టర్ ప్లాన్‌ను పోలీసులు పసిగట్టారు. అమ్మాయి.. తన కుటుంబ సభ్యులను సంప్రదించేందుకు చేసిన ప్రయత్నాన్ని.. కేంద్ర నిఘా సంస్థలు పసిగట్టాయి. ఇంకేముంది.. వెంటనే సమాచారాన్ని బెంగళూరు పోలీసులకు అందించారు. రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. యువకుడిని కటకటాల్లోకి నెట్టగా, అమ్మాయిని ప్రభుత్వ మహిళా వసతి గృహానికి తరలించారు. అయితే, అమ్మాయి పాకిస్తాన్ గూఢచారా? ఇంకేమైనా ఉందా? అని పలు కోణాల్లో విచారిస్తున్నారు పోలీసులు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..