సౌరవ్‌గంగూలీకి మరోసారి బీసీసీఐ అధ్యక్ష పదవి దక్కకపోవడంపై బెంగాల్‌లో రాజకీయ రగడ రాజుకుంది. బీజేపీలో చేరనందుకే బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి సౌరవ్ గంగూలీని తొలగించారని టీఎంసీ ఎంపీ శాంతను సేన్ ఆరోపించారు. అమిత్ షా కొడుకు అదేపదవిలో కొనసాగితే, రాజకీయ ప్రతీకారానికి గంగూలీ బలి అయ్యారని చెప్పారాయన. రెండేళ్ల క్రితం గంగూలీకి ఇంటికి వచ్చిన అమిత్‌షా బీజేపీలో చేరాలని ఆహ్వానించారని, కానీ గంగూలీ దానికి తిరస్కరించడంతో మరోసారి అవకాశం ఇవ్వలేదన్నారు.
గంగూలీ వ్యవహారంలో టీఎంసీ ఆరోపణలను బీజేపీ నేతలు తిప్పికొట్టారు. రాజకీయాలకు, క్రికెట్‌కి సంబంధం లేదనీ, టీఎంసీకి ఏమీ దొరక్క బీసీసీఐపై రాజకీయాలు చేస్తున్నారని కౌంటర్ ఇచ్చారు. సౌరవ్ గంగూలీకి టీఎంసీ ఎప్పుడు తగిన గౌరవం ఇవ్వలేదన్నారు బీజేపీ ఎంపీ దిలీఫ్ ఘోష్.
ఇదిలాఉంటే.. బీసీసీఐ అధ్యక్ష పదవిని మాజీ క్రికెటర్ రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టడం లాంఛనంగానే కనిపిస్తోంది. 2019 నుంచి బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్న సౌరవ్ గంగూలీకి రెండోసారి అవకాశం ఇచ్చేందుకు BCCI బోర్డు సభ్యులు నిరాకరించారు. మంగళవారం బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం ఢిల్లీలో జరిగింది. ఈ సమావేశంలో నెక్ట్స్ ప్రెసిడెంట్ ఎవరు? అనే విషయంపై చర్చించిన బోర్డు సభ్యులు గంగూలీకి మాత్రం మద్దతు ఇవ్వలేదు. వాస్తవానికి బీసీసీఐ ప్రెసిడెంట్‌గా కొనసాగేందుకు సౌరవ్ గంగూలీ ఆసక్తి కనబర్చాడు. కానీ.. వరుసగా రెండోసారి బీసీసీఐ పదవిని ఒకరికే ఇచ్చే సంప్రదాయం బోర్డులో లేదని గుర్తు చేసిన సభ్యులు.. అందుకు నిరాకరించారు. దాంతో గంగూలీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. దీనికి బదులుగా ఐపీఎల్ ఛైర్మన్ పదవిని బోర్డు సభ్యులు ఆఫర్ చేసినా.. దాదా తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..