
న్యాయమూర్తుల రిటైర్మెంట్ వయసుపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టు జడ్జిల పదవీ విరమణ వయస్సు 65 ఏళ్లకు, సుప్రీంకోర్టు జడ్జిల పదవీ విరమణ 67 ఏళ్లకు పెంచుతూ నిర్ణయించింది. రాష్ట్ర బార్ కౌన్సిల్‌లు.. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేసింది. పదవీ విరమణ వయసుపై తక్షణమే రాజ్యాంగ సవరణ చేయాలని తీర్మానంలో పేర్కొంది. వయో పరిమితి పెంపు తీర్మానానికి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది.
అనుభవజ్ఞులైన న్యాయవాదులను వివిధ కమిషన్లు, ఇతర ఫోరమ్‌లకు ఛైర్మన్‌లుగా నియమించేలా వివిధ చట్టాలను సవరించాలని కూడా బార్ కౌన్సిల్ తీర్మానం పేర్కొంది. ఈ తీర్మానంపై తక్షణం చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరింది. తీర్మాన కాపీని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజుకు పంపాలని నిర్ణయించింది. ప్రస్తుతం హైకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు 62 ఏళ్లు ఉండగా, సుప్రీంకోర్టు జడ్జిల పదవీ విరమణ వయసు 65 ఏళ్లుగా ఉంది.
గత వారం జరిగిన అన్ని రాష్ట్ర బార్ కౌన్సిల్‌లు, హైకోర్టు బార్ అసోసియేషన్ల ఆఫీస్ బేరర్లు, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంయుక్త సమావేశం హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయస్సు పెంపునకు సంబంధించి సమస్యను చర్చించింది. ఇదే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించింది. ఇంతలో, వివిధ కమిషన్లు, ఇతర ఫోరమ్‌లకు అనుభవజ్ఞులైన న్యాయవాదులను కూడా చైర్మన్‌లుగా నియమించేలా వివిధ చట్టాలను సవరించాలని పార్లమెంటుకు ప్రతిపాదించాలని కూడా ఉమ్మడి సమావేశం తీర్మానించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం..