30 నిమిషాల వర్షానికే.. బెంగళూరు చూడండి ఎంత దారుణంగా తయారైందో..! వీడియోలు వైరల్‌

గురువారం 30 నిమిషాల భారీ వర్షంతో బెంగళూరు నగరం జలమయమైంది. తవరేకెరె, బీటీఎం లేఅవుట్ వంటి ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నీటిలో చిక్కుకున్న ప్రజల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. డ్రైనేజీ వ్యవస్థ వైఫల్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

30 నిమిషాల వర్షానికే.. బెంగళూరు చూడండి ఎంత దారుణంగా తయారైందో..! వీడియోలు వైరల్‌
Bangalore Rains

Updated on: Apr 04, 2025 | 9:16 AM

గురువారం నాడు 30 నిమిషాల పాటు కురిసిన భారీ వర్షానికి బెంగళూరు నగరం అతలాకుతలమైంది. అనేక ప్రాంతాలు తీవ్ర జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అత్యంత దెబ్బతిన్న ప్రాంతాలలో తవరేకెరె మెయిన్ రోడ్ కూడా ఉంది. ఇక్కడ నివాసితులు మోకాలి లోతు నీటిలో కొట్టుకుపోతున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు వైరల్‌ అయ్యాయి. బీటీఎం లేఅవుట్ నివాసితులు చెరువులను తలపించే వీధులను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. కేవలం 30 నిమిషాల వర్షానికే ఇది పరిస్థితి అంటూ నగర వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేం పన్ను చెల్లించిన డబ్బుతో ఏం చేస్తున్నారంటూ కూడా కొంతమంది సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నించారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. కాగా బెంగళూరు అంతటా కురిసిన భారీ వర్షానికి అనేక ప్రాంతాలు నీట మునిగాయి. అలాగే ట్రాఫిక్‌కు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. మారతహళ్లి సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్, HAL ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ రోడ్, కస్తూరి నగర్ వంటి కీలక ప్రాంతాలలో నీరు నిలిచిపోవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి.

బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల గురించి ప్రయాణికులను ముందుగా హెచ్చరించారు. ఇంత భారీ వర్షంలో కూడా మూసుకుపోయిన డ్రెయిన్లను శుభ్రం చేయడానికి పారిశుద్ధ్య కార్మికులు తీవ్రంగా శ్రమించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి పోలీసులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. ఇదిలా ఉండగా, భారత వాతావరణ శాఖ రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఏప్రిల్ 7 వరకు అడపాదడపా వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కొనసాగుతాయని, ఆదివారం కూడా తీవ్ర వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..