Charter Plane Crash: మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన ట్రైనీ చార్టర్ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి

Balaghat plane crash: బాలాఘాట్ జిల్లాలోని కిర్నాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భక్కుటోలా గ్రామంలోని దట్టమైన అడవిలో ట్రైనీ చార్టర్ విమానం కూలిపోయింది.

Charter Plane Crash: మధ్యప్రదేశ్‌లో కుప్పకూలిన ట్రైనీ చార్టర్ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి
Charter Plane Crash

Updated on: Mar 18, 2023 | 6:52 PM

మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో ట్రైనీ విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు ఫైలట్లు దుర్మరణం పాలయ్యారు. బాలాఘాట్ జిల్లాలోని కిర్నాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భక్కుటోలా గ్రామంలోని దట్టమైన అడవిలో ట్రైనీ చార్టర్ విమానం కూలిపోయింది. శనివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగిందని స్థానిక అధికారులు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఇందులో ఒక పైలట్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకోగా, మరొకరి మృతదేహం కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.

కిర్నాపూర్‌లోని భక్కుటోలా వద్ద ట్రైనర్ విమానం కూలిపోయిందని పోలీసులకు సమాచారం అందిందని అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆదిత్య మిశ్రా తెలిపారు. సంఘటనా స్థలానికి పోలీసు బలగాలు బయలుదేరాయి. మృతుల పేర్లు, విమానం ఎక్కడికి వెళుతోంది, విమాన ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి పోలీసులకు కూడా సరైన సమాచారం లేదు. అయితే ప్రాథమిక దర్యాప్తులో, కూలిపోయిన విమానం మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో నిర్వహిస్తున్న ఫ్లై స్కూల్‌కు చెందినదిగా గుర్తించారు.

ఈ ఘటనపై పోలీసు ఉన్నతాధికారుల బృందం సంఘటనా స్థలంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇక మార్చి 20న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కిర్నాపూర్ సమీపంలోని లాంజీ తహసీల్‌లో లాడ్లీ బహనా యోజన కార్యక్రమంలో పాల్గొనేందుకు బాలాఘాట్‌కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి బాలాఘాట్‌ పర్యటనకు రాకముందే విమాన ప్రమాదం సంభవించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.