PM Modi to Begin Strategy Meets With UP Today: దేశంలో ఐదు రాష్ట్రాల్లో మరికొన్ని రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో బీజేపీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు, అదేవిధంగా పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు చెక్ పెట్టేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) వ్యూహాం రచిస్తున్నారు. ఇటీవల పలు రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేసిన ప్రధాని మోదీ.. ప్రస్తుతం వర్చువల్ ద్వారా కూడా కార్యకర్తలనుద్దేశించి ప్రసంగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ ఎన్నికలు (Elections 2022) జరగనున్న బీజేపీ నేతలతో ఈ రోజు వర్చువల్ ద్వారా కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లోని బీజేపీ సంస్థాగత కార్యకర్తలతో ప్రధాని నరేంద్రమోదీ నేటినుంచి కీలక వ్యూహాత్మక సమావేశాలు నిర్వహించనున్నారు. కోవిడ్-19 మహమ్మారి దృష్ట్యా.. బూత్ విజయ్ అభియాన్ పేరుతో ఈ సమావేశాలు వర్చువల్‌గా నిర్వహిస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధాని మోదీ పలు సూచనలు చేయనున్నారు. ఈ రోజు యూపీ (Uttar Pradesh) కార్యకర్తలతో ప్రధాని మాట్లాడనున్నారు. ఈ సమావేశంలో అగ్ర నాయకుల నుంచి బూత్ స్థాయి సంస్థాగత కార్యకర్తలు పాల్గొననున్నారు. యూపీకి చెందిన 6 లక్షల మంది కార్యకర్తలు పాల్గొననున్నారు.
ఈ సమావేశంలో మోదీ వ్యూహ ప్రతివ్యూహాలు, ప్రచారం, ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు చేయాల్సిన కార్యక్రమాల గురించి ప్రస్తావించనున్నారు. శుక్రవారం జరిగే ఉత్తరప్రదేశ్-నిర్దిష్ట సమావేశానికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా హాజరుకానున్నారు. ఈ సమావేశం మధ్యాహ్నం ప్రారంభమవుతుందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ రోజు జరిగే వర్చువల్ సమావేశంలో హాపూర్, మీరట్, నోయిడా, అలీఘర్ జిల్లాలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులనుద్దేశించి ప్రసంగించనున్నారు.
కోవిడ్-19 థర్డ్ వేవ్ నేపథ్యంలో ఎన్నికల సంఘం బహిరంగ సభలను నిషేధించడంతో… ఎన్నికలకు ముందు పార్టీ కార్యకర్తల్లో ఉత్సహాన్ని నింపేందుకు ప్రధాని మోదీ వర్చువల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్ మరియు గోవా అసెంబ్లీ ఎన్నికలు 2022 ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు జరుగనున్నాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10 న జరుగుతుంది.
Also Read: