Ashwini Vaishnaw: ‘ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుతో యువతకు రక్షణ, సృజనాత్మకతకు ప్రోత్సాహం’

ఆన్‌లైన్‌ గేమింగ్‌పై కేంద్ర ప్రభుత్వం నూతన చట్టం తీసుకొచ్చింది. ప్రొమోషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్‌ – 2025 పార్లమెంట్‌లో ఆమోదం పొందింది. సమాజాన్ని కాపాడుతూనే, ఇన్నోవేషన్‌కు తోడ్పడేలా ఈ బిల్‌ను రూపొందించామని రైల్వే, ఎలక్ట్రానిక్స్‌ & ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు.

Ashwini Vaishnaw: ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుతో యువతకు రక్షణ, సృజనాత్మకతకు ప్రోత్సాహం
Ashwini Vaishnaw

Updated on: Aug 21, 2025 | 5:18 PM

ఆన్‌లైన్ గేమింగ్ రోజురోజుకూ విస్తరిస్తున్న తరుణంలో, సమాజంపై దాని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ గేమింగ్ ప్రోత్సాహం & నియంత్రణ బిల్లు 2025ను పార్లమెంట్ ఆమోదించింది. రైల్వే, ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ.. ఈ బిల్లు ఉద్దేశం యువతను రక్షించడం, అలాగే మంచి గేమ్స్‌కి ప్రోత్సాహం ఇవ్వడమేనని తెలిపారు. ఆన్‌లైన్ గేమ్స్ మూడు రకాలుగా ఉంటుందని వివరించారు.

1. ఈ-స్పోర్ట్స్: క్రికెట్, ఫుట్‌బాల్‌లో ఎలా అయితే జట్టు ప్లానింగ్, కలిసి పనిచేయడం, త్వరగా స్పందించడం అవసరమో… ఇక్కడ కూడా అలానే ఉంటుంది. ఉదాహారణకు చెప్పాలంటే జట్ల మధ్య జరిగే ఆన్‌లైన్ టోర్నమెంట్లు. వీటికి ఈ బిల్లు చట్టబద్ధ గుర్తింపు ఇస్తోంది. ప్రభుత్వం ప్రత్యేక పథకాలు తెచ్చి ఈ-స్పోర్ట్స్ ఆటగాళ్లను, పోటీలను ప్రోత్సహించనుంది.

2. ఆన్‌లైన్ సోషియల్ గేమ్స్: స్నేహితులతో కలిసి సరదాగా ఆడుకునే గేమ్స్, బుర్రను పదను పెట్టే పజిల్ గేమ్స్, లేదా కొత్త విషయాలు నేర్పే విద్యా గేమ్స్. ఉదా: యాంగ్రీ బర్డ్స్, కార్డ్ గేమ్స్, పజిల్ గేమ్స్. వీటిని సురక్షిత వినోదంగా ఈ బిల్లు గుర్తించింది. ఇలాంటి గేమ్స్ రూపొందించే క్రియేటర్లకు ప్రభుత్వం మద్దతు ఇవ్వనుంది.

3. ఆన్‌లైన్ మనీ గేమ్స్: డబ్బు పెట్టుబడి పెట్టి ఆడే గేమ్స్. ఉదా: పందేలు, బెట్టింగ్ యాప్స్. ఇవి అత్యంత ప్రమాదకరం. చిన్న అలవాటును నుంచి వ్యవసంలా మారిపోతాయి. అప్పులు, మోసాలు, కుటుంబాల కూలిపోవడం, ఆత్మహత్యల వరకు దారితీస్తాయి. మనీలాండరింగ్, టెర్రర్ ఫైనాన్సింగ్ వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. అందుకే ప్రభుత్వం వీటిని పూర్తిగా నిషేధించింది.

మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ..ఇలాంటి మనీ గేమ్స్ వల్ల కోట్ల కుటుంబాలు దెబ్బతిన్నాయన్నారు. మధ్యతరగతి పొదుపులు నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఆదాయం వచ్చినా.. ప్రజల రక్షణే ప్రధాన కర్తవ్యంగా భావించి.. ప్రధాని నరేంద్ర మోదీ ఈ నిర్ణయం దిశగా అడుగులు వేశారని స్పష్టం చేశారు.

ఈ బిల్లు ప్రకారం త్వరలోనే ఒక కేంద్ర నియంత్రణ సంస్థ ఏర్పాటు చేయబడనుంది. ఇది గేమింగ్ రంగానికి సంబంధించి విధానాలు రూపొందించడం, కొత్త అవకాశాలు కల్పించడం, నిబంధనలు కఠినంగా అమలు చేయడం వంటి పనులు చేస్తుంది.

మొత్తంగా చెప్పాలంటే ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025 ఒకవైపు ఈ-స్పోర్ట్స్, సోషియల్ గేమ్స్‌కి అవకాశాలు కల్పిస్తూనే.. మరోవైపు డబ్బుతో ఆడే ప్రమాదకర గేమ్స్‌కి గట్టి చెక్ పెడుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..