ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోరు మరింత ఆసక్తికరంగా మారింది. బీజేపీ , ఆప్ యుద్ధంలో కాంగ్రెస్ కూడా ఎంట్రీ ఇచ్చింది. ఢిల్లీలో కాంగ్రెస్ అభ్యర్ధుల తరపున జోరుగా ప్రచారం చేస్తున్నారు రాహల్‌గాంధీ.. రితాలా ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. ఢిల్లీలో పేదలు చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని అన్నారు రాహుల్.. కాని అటు బీజేపీ , ఇటు ప్రజల కష్టాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఢిల్లీ ప్రజలకు కాంగ్రెస్ తోనే న్యాయం జరుగుతుందన్నారు.
కేజ్రీవాల్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు రాహుల్.. ప్రధాని మోదీకి, కేజ్రీవాల్‌కు తేడా లేదన్నారు.. అవినీతి విషయంలో బీజేపీ , ఆప్ ఒక్కటే విధానాన్ని పాటిస్తున్నాయన్నారు. అయితే రాహుల్‌కు అదేస్థాయిలో కౌంటరిచ్చారు కేజ్రీవాల్. ఆప్‌ను ఓడించడానికి బీజేపీ , కాంగ్రెస్ ఒక్కటయ్యాయని విమర్శించారు. అందుకే బీజేపీపై కాకుండా తనపై రాహుల్‌గాంధీ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
మరోవైపు ఆమ్‌ఆద్మీ పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. దొంగ ఓట్లతో గెలిచేందుకు కుట్ర చేస్తున్నారని ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా.. పూర్వాంచల్ ప్రాంతానికి చెందిన ఓటర్లను పద్దతి ప్రకారం తొలగించేందుకు ప్రణాళిక రచించారని ఆరోపించారు. అంతేకాకుండా గత కొద్ది రోజులుగా 70 నుంచి 80 ఏళ్ల వయస్సున్న 5 లక్షల మంది ఓటర్లను కొత్తగా చేర్చారని ఆరోపించారు.
మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీజేపీకి అదే రీతిలో కౌంటర్లిస్తోంది. తమ ముఖ్యమంత్రి అభ్యర్ధి కేజ్రీవాల్ అని, బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధిని ప్రకటించకుండానే ఎన్నికల బరి లోకి దిగిందని, ఇది పెళ్లి కొడుకు లేని బరాత్ లాంటిదన్నారు ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్.. బీజేపీపై సెటైర్ వేస్తూ పెళ్లి కొడుకు లేని గుర్రంతో ఢిల్లీ రాజేంద్రనగర్‌లో ఆప్ నేతలు బరాత్ నిర్వహించారు.
ఢిల్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జాతీయ స్థాయి ఎన్నికల్లో పోటీ కోసమే ఇండియా కూటమి ఏర్పడిందని.. అసెంబ్లీ, స్థానిక ఎన్నికల గురించి తాము ఎప్పుడూ చర్చించలేదంటూ పేర్కొన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల విషయానికొస్తే.. అరవింద్ కేజ్రీవాల్‌కు కూటమి పార్టీలు మద్దతుగా నిలవాలని పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది..
కాగా.. ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సహా స్థానిక సంస్థల ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేసే అవకాశం ఉందని మహా వికాస్ అఘాడి కూటమిలోని శివసేన (యూబీటీ) ఇటీవల ప్రకటించింది.. ఈ నేపథ్యంలో మాట్లాడిన శరద్ పవార్.. మళ్లీ కూటమి సమావేశం ఉంటుందని.. ఆ తర్వాత పోటీపై ప్రకటన విడుదల చేస్తామన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..